మీ ఇంట్లో గాలిని శుద్ధ పరచటానికి ఉపయోగపడే 3 మొక్కలు
మొక్కలతో మీ ఇంట్లోని గాలిని శుభ్రపరచటానికి ఈషా గ్రీన్ హాండ్స్ ఉద్యమం ఒక సరళమైన ఉపాయాన్ని ఇస్తోంది
ఒక ఆరోగ్యమైన జీవితం గడపటానికి కావలసినవన్నీ విలాస వస్తువులై, మనకి అందుబాటులో లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి. స్వచ్చమైన నీరు, గాలి మరియు ఆహారం చాలా కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది అంటే ఎలా ఉంటుంది?
గణాంకాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్యం మీద ఇంటిలోపలి వాతావరణ కాలుష్యం ఇంటి బయట ఉన్న వాతావరణ కాలుష్యం కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇంటిలోపలి వాతావరణ కాలుష్యం యొక్క దుష్పరిణామాల మూలకంగా ఏడాదికి 20 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవిస్తున్నాయి. అందులో 44 శాతం న్యుమోనియా వల్ల, 54 శాతం శ్వాస కోశ (COPD) వ్యాధుల వల్ల 2 శాతం ఊపిరి తిత్తుల కాన్సరు వల్ల చనిపోతున్నారు. ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది ఆడ వాళ్ళు, చిన్న పిల్లలు కాబట్టి వారి మీద ఈ దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు అస్తమానం గాలి ద్వారా వచ్చే వ్యాధుల వల్ల బాధింప బడుతున్నారు. దీని వల్ల వారి బాల్యం మీద చాలా దుష్ప్రభావాలు ఉండటమే కాక, విద్య, పరిణతి చాలా దెబ్బ తింటాయి.
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, చాలా సాధారణమూ, సులభమూ అయిన ఉపాయాలతో పరిస్తితిని మెరుగు చెయ్యవచ్చు. కమల్ మేటిల్ గారు ఐ.ఐ.టి ఢిల్లీ, టి.ఇ.ఆర్.ఐ (TERI), మరియు నాసా పరిశోధన సాయంతో మనకి కావాలసినంత స్వచ్చమైన గాలిని ఉత్పత్తి చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచే, సామాన్యంగా దొరికే మూడు మొక్కలను కనుగొన్నారు. ఇవి ఆరేకా పాం (Areca Palm), అత్తగారి నాలుక (Mother-in-law's Tongue) మరియు మనీ ప్లాంట్.
ఆరేకా పాం (Areca Palm)
ఒక మనిషికి కావలసిన మొక్కలు: 4
మొక్క పోషణ: ఈ మొక్కలను దక్షిణం లేక పడమర కిటికీలలో నుంచి, మంచి పరోక్ష సూర్య కాంతి కావాలి. అలా కాకుండా ఈ మొక్కలని ప్రత్యక్ష సూర్య కాంతిలో ఉంచితే, ఆకులన్నీ పసుపు ఆకుపచ్చ రంగులలోకి మారు తాయి. పైమట్టి క్రింద కాస్త పొడిగా ఉన్నట్లు అనిపిస్తే, కొంచం తడి మన్ను వేసి నీళ్ళు పొయ్యాలి. ఈ మొక్కలకి ఎక్కువ నీళ్ళు పోయటం మంచిది కాదు,
అత్తగారి నాలుక (Mother-in-law's Tongue)
ఒక మనిషికి కావలసిన మొక్కలు: 6 నించి 8 నడుము అంత ఎత్తు పెరిగిన మొక్కలు
మొక్క పోషణ: వాతావరణ ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం ఈ మొక్కల మీద ఏమీ ఉండదు. వీటిని నీడలో ఉంచి నీళ్ళు కొంచెము తక్కువగా పొయ్యాలి.
మనీ ప్లాంట్
మొక్క పోషణ: దీన్ని కొంచం తేమగా ఉన్న గదిలో పెట్టాలి. దీనికి తరచూ నీళ్ళు పొయ్యక్కరలేదు. దీని పోషణ చాలా తేలిక. ఈ మొక్క గాలిలోనించి ఆవిరి అయ్యే ఫార్మల్ డిహైడ్ లాంటి రసాయనాలను పీల్చేస్తుంది.
ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి?
మొదటి సారి మొక్కలు పెడుతున్న వాళ్ళు ఒక్కో రకానికి ఒక మొక్క పెట్టవచ్చు. నెమ్మది నెమ్మదిగా మొక్కల సంఖ్య పెంచుతూ పోవచ్చు. మొక్కలు పెద్దవి ఐనప్పుడు (దీనికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు) వీటిని కుండీలో నించి తీసి ఎక్కడైనా మీ చుట్టూ పక్కల ఒక మంచి చోటు చూసి నేలలో పాతి పెట్టాలి. ఇవి పెద్దవయిన తర్వాత ఎలాంటి పోషణ అవసరం లేదు. ఈ రకంగా మన వాతావరణ లక్ష్యం, స్వంత లక్ష్యం రెండూ చేకూరతాయి.