రసాయన, ఇంజింజీర లేహ్యం
రాబోయే దసరా, దీపావళి పండుగలకు ఈ సాంప్రదాయిక వంటకాలను చేయడం నేర్చుకోండి. నవరాత్రి సమయంలో దేవికి సమర్పించే చక్కని నైవేద్యం రసాయనం. దీపావళి సమయంలో సుష్ఠుగా భుజించిన తర్వాత ఆ భోజనం చక్కగా జీర్ణం కావడానికి ఇంజింజీర లేహ్యం ఉపయోగపడుతుంది.
రసాయనం
కావలసిన దినుసులు:
అరటిపండ్లు (ముగ్గ పండినవి, దేశవాళి రకం): 7-8 మధ్య రకం సైజువి
తాజా కొబ్బరి (తురుము) : 1¼ కప్పులు
ఏలకుల పొడి: చిటికెడు
బెల్లం (పొడి చేసినది): 5 టేబుల్ స్పూన్లు
నేయి (బాదం పప్పులు వేయించడానికి మరికొంచెం నేయి): 1 టీస్పూను.
తేనె: 3 టేబుల్ స్పూన్లు
బాదం పప్పులు: 1 టేబుల్ స్పూను
కిస్‌మిస్ : 1 టేబుల్ స్పూను
కొద్దిగా కుంకుమపూవు (ఉంటే వేసుకోవచ్చు)
తయారుచేసే పద్ధతి:
- అరటి పండ్లు ఒలిచి ½ అంగుళం ముక్కలుగా కోయాలి. వాటిని ఒక గిన్నెలో వేసి బెల్లం కలపాలి.
- తురిమిన కొబ్బరి, ¼ కప్పు గోరువెచ్చని నీళ్లు, ఏలకుల పొడుము మిక్సర్‌లో వేసి మెత్తగా రుబ్బాలి. పలచటి గుడ్డలో వడగట్టి ఒక గిన్నెలోకి కొబ్బరిపాలు తీయాలి.
- దీన్ని అరటిపండ్లు, బెల్లంతో కలపాలి. నేయి, తేనె వేసి బాగా కలపాలి.
- బాదం పప్పులు నానబెట్టి పొట్టు తీయాలి. సన్నగా కత్తిరించి కొంచెం నేతిలో వేయించాలి.
- వడ్డించేముందు కిస్‌మిస్, వేయించిన బాదం ముక్కలతో అలంకరించాలి.
- కొంచెం కుంకుమపువ్వు పాలలో వేసి కల్వంలో నలగగొట్టి మిశ్రమానికి కలపాలి.
సూచన : ఇది కర్ణాటక సాంప్రదాయిక వంటకం. నవరాత్రిలో దేవికి సమర్పించడానికి మంచి నైవేద్యం.
ఇంజింజీర లేహ్యం
కావలసిన దినుసులు:
తాజా అల్లం (పొట్టు తీసి, కడిగి ఆరబెట్టినది): ½ కప్పు
బెల్లం: ½ కప్పు
జీలకర్రపొడి : 2 టీ స్పూన్లు
ధనియాల పొడి : 1 టీస్పూను
నేయి : 2 టీ స్పూన్లు
తేనె : ½ కప్పు
తయారుచేసే పద్ధతి:
- మిక్సర్‌లో అల్లాన్ని మెత్తగా రుబ్బాలి. బెల్లం, మసాలపొడులు కలిపి లేహ్యంలా రుబ్బాలి.
- బాండీలో, మరి ఎక్కువ కాకుండా ఉన్న మంటతో ఉడకబెడుతూ గట్టి లేహ్యమయ్యేవరకు కలియబెట్టాలి. పొయ్యి మీది నుండి దించి నేయి వేయాలి.
- గది ఉష్ణోగ్రతకు చల్లబడిన తర్వాత తేనె వేసి బాగా కలపాలి.
సూచన: దీపావళి పండుగ సమయంలో తయారుచేసే సాంప్రదాయిక వంటకం ఇది. సుష్ఠుగా భోంచేసినప్పుడు చక్కగా అరగడానికి, కడుపు సమస్యలు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది.