20 ఏళ్ళ ప్రాజెక్ట్ కి సిద్ధమైతేనే పిల్లల్ని కనండి
మీరు తల్లిదండ్రులవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఎలా తెలుస్తుంది..? మీరు పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి..? మానవాళి అధిక జనాభా సమస్యతో బాధపడుతోంది. పిల్లలు కావాలనుకునే ఎంపిక గురించి సద్గురు మనకి ఒక అవగాహన కలుగజేస్తున్నారు.
పునరుత్పత్తి అన్నది, కేవలం మీకు, మీతో సహచర్యం చేస్తున్న వారికి మాత్రమే సంబంధించినది కాదు. మనం భావి తరాలని సృజిస్తున్నాం. అది అఖండమైన బాధ్యత. ఈరోజు మనం ఎటువంటి పిల్లల్ని తయారు చేస్తున్నాం అన్నదాన్ని బట్టి ఈ ప్రపంచంలో రాబోయే 25 సంవత్సరాలు ఉంటాయి. ఇది కాకతాళీయంగా కాదు, ఎంతో ఎరుకతో జరగాలి, ఇది ప్రేమ లేకుండా జరుగకూడదు, వారు ఎంతో ఆహ్లాదమైన వాతావరణంలో కలగాలి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు పిల్లలు కలగాలా వద్దా అన్న ఎంపిక మీకు లేదు. కానీ ఈ రోజున ఇది అలా కాదు. ఇప్పుడు పూర్వంలాగా కాదు. పూర్వం పిల్లలు పుట్టేవాళ్ళు. అందులో ఎటువంటి ఎంపికా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మనకు ఒక ఎంపిక ఉంది. అందుకని, ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే తల్లిదండ్రులకు ఎటువంటి ఆకాంక్షలు ఉన్నప్పటికీ, వారికి ఎటువంటి గమ్యాలు చేరుకోవాలని ఉన్నప్పటికీ, పిల్లలు కావాలనుకుంటే మీరు ఇది ఒక 20 సంవత్సరాల ప్రాజెక్ట్ అని అర్ధం చేసుకోవాలి. అదీ, ఒకవేళ, మీ పిల్లలు ఎంతో చక్కగా పెరిగితే, అది 20 సంవత్సరాల ప్రాజెక్ట్. ఒకవేళ అలా కాకపొతే, అది జీవితాంతం కొనసాగే ప్రాజెక్టే..! మీరు 20 ఏళ్ల ప్రాజెక్ట్ ని ఎంచుకోవాలనుకుంటే, కనీసం మీకు 20 ఏళ్లపాటూ నిబద్ధత ఉండాలి.