ఆధ్యాత్మికత అంటే తనను తాను కోల్పోవడమే
ఆధ్యాత్మికతను ఆత్మ నిర్మూలనంగా చెబుతూ సద్గురు, అది స్వీయ వ్యక్తిత్వాన్ని నశింప చేసుకొని సార్వత్రిక మానవుడిగా మారేందుకు గల ఒక సంభావ్యతగా వివరిస్తున్నారు.
ప్రశ్న: మీరు, ఒక జన్మ నుంచి మరొక జన్మకి ఎరుకను తీసుకెళ్లడం గురించి మాట్లాడారు. మనతో పాటు మనం తీసుకెళ్లగలిగేది కేవలం ఎరుకనే. ఈ ప్రక్రియకి ఎప్పటికైనా ముగింపు ఉందా? దీనికి అసలు మొదలు అంటూ ఉందా? నేను ఒకానొకప్పుడు గడ్డి పరకనై ఉన్నానా? నేను కోతిగా ఉన్నానా, బల్లిగా, కొండ మీద రాయి లాగా ? ఇవన్నీ శక్తి రూపాలే కదా?
సద్గురు::గడ్డి పరకా, ఏమో నాకు తెలీదు; కోతి? కాదనను! మీ ప్రశ్నే అయోమయంగా ఉంది- ఎరుక, జీవశక్తి లేక ఈ ఎరుకను, ప్రస్తుతం మీరు జీవితం అనుకుంటున్న దాన్ని దాటి మోసుకుపోవడం. జీవితం ఎక్కడ మొదలైంది? ఎక్కడ ముగుస్తుంది? ఎక్కడ మొదలైంది అన్నదాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం, ఎందుకంటే అది ఇప్పటికే ఇక్కడ ఉంది కాబట్టి. మీరు "నేను" అనుకునేది ఇక్కడ ఇప్పటికే ఉనికిలో ఉంది. ప్రారంభం మనం చేసినది కాదు, కానీ దీన్ని దాటి వెళ్లడం మన వల్లనే జరుగుతుంది. అది ఎరుకతో జరగాల్సిన ప్రక్రియ. వేరే దారి లేదు.
"ప్రతిదీ శక్తి స్వరూపమే అయితే, నేను ఎక్కడి నుంచి వచ్చాను?". మీరు ఎక్కడి నుంచీ పుట్టుకు రాలేదు, మీరు కేవలం పైపూత పూసుకున్నారు అంతే." అంటే అర్థం నేను వాస్తవంగా లేనా? "ప్రతిదీ మాయ(భ్రమ)" అనే అర్థంలేని మాటలు మీరు చెప్తున్నారా నాకు?". కాదు. కేవలం జీవ ప్రక్రియ సంభవిస్తున్నది అంతే. ఈ జీవం ఎలా మొదలైంది? ఉదాహరణకి, ఈ భూమిని తీసుకోండి, ఇతర గ్రహాలతో పోలిస్తే తన ప్రత్యేక అస్తిత్వం తనకు ఉంది. ఇతరులతో పోలిస్తే మీకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం మీకు ఉన్నట్టుగానే, ఈ భూగ్రహానికి కూడా ఉంది. ఇంతకుముందు ఎన్ని రూపాలు పొందినప్పటికీ, ఈ జన్మలో తనకంటూ ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని ఏర్పరుచుకోగల సామర్థ్యం ఈ జీవానికి ఉంటుంది. ఈ భూగోళం మొత్తం అయినా లేక ఒక వ్యక్తిగా మీరైనా, ఒక చీమ, మీ చేతి చిటికెన వేలు, లేకపోతే మీ తల మీద ఉన్న వెంట్రుక కూడా, దానికంటూ ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది.
భూమి నుంచి మళ్లీ అదే భూమిలోకి
అదే సమయంలో, ఈ విలక్షణత్వం కలకాలం నిలిచిపోదు. మీరు ఒక మనిషిగా, ఈ శరీరంతో ఇక్కడ ఉన్నారు - మీకు తెలుసు ఏదో ఒక రోజు అది ముగిసిపోతుంది అని. ప్రస్తుతం అది విలక్షణంగా ఉంది. కానీ అది పడిపోయిన తర్వాత, ఈ శరీరం, ఇక ఏ మాత్రం తన ప్రత్యేకతను నిలుపుకోలేదు. అది భూమిలో ఒక భాగమైపోతుంది. దీన్ని మనం మాతృభూమి అని పిలుస్తాము ఎందుకంటే మనకి తెలుసు, ఏదో ఒక రకంగా, మనమందరము ఇందులోంచే జన్మించామని. ఈ శరీరం కేవలం, వివిధరకాల రూపాలు తీసుకుని ఈ పనులన్నీ చేస్తున్న, (భూమిలోని) ఒక మట్టి ముద్ద. ఏదో ఒక రోజు మళ్లీ శరీరం భూమిలోకి వెళ్లి భూమిగా మారిపోతుంది.
అయితే, ఇతర గ్రహాలతో పోలిస్తే, భూమి తన ప్రత్యేక అస్తిత్వాన్ని ఇంకా కాపాడుకుంటూ ఉంది. కానీ, మీ శరీరం భూమిలో కలిసి పోతున్నట్టుగానే, భూమి కూడా మరింత పెద్ద పదార్థం ఒడిలోకి చేరిపోతుంది. ప్రస్తుతం, మీకు అది (పెద్ద పదార్థం) ఏమిటో దాని గురించి అవగాహన లేదు కాబట్టి, దాన్ని మనం "శివ" అంటున్నాం. ఇప్పటికి మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా, "శివ" అంటే "ఏదైతే లేదో, అది" అని అర్థం. "ఏదైతే లేదో అది" అని మనం చెప్పినప్పుడు, అది ఉనికిలో లేనిది అని అర్థం కాదు. ప్రస్తుతం మీ అనుభూతిలోకి రానిది అని అర్థం. మీ అనుభూతి కేవలం భౌతికమైనది. ఈ సృష్టికి మూలమైనది మీకు అనుభూతిలోకి రాలేదు. కాబట్టి, ఈ సృష్టికి మూలాధారం అయిన తత్వాన్ని మనం "శివ- ఏదైతే లేదో అది" అని వ్యవహరిస్తున్నాం.
ఏదైతే లేదో అది, ఉన్నదిగా మారి, తనకంటూ ఒక లక్షణాన్ని తీసుకుంది. ఆ క్రమంలో, కోట్లాది రూపాలు బయటికి వచ్చాయి. అవి అన్నీ కూడా వేటికవే స్వస్వభావాలను కొంతకాలం పాటు ఏర్పరచుకున్నాయి. ప్రస్తుతం మీరు మీ జీవితంలో క్షణం తీరిక లేకుండా, చురుకుగా ఉన్నప్పుడు, అదే సర్వం అయిపోతుంది. రేపొద్దున, మీరు మరణిస్తే, హఠాత్తుగా జీవితం మరో విధంగా మారిపోతుంది. నిన్నటి వరకు ఏవేవో పనులు చేస్తూ, తిరుగుతున్నఈ మనిషి, హఠాత్తుగా మాయమై పోతాడు, అయినా అంతా మామూలుగానే ఉంటుంది. కేవలం మీకు దగ్గరైన వ్యక్తుల ఆలోచనలు, భావోద్వేగాలు మాత్రమే కలత చెందుతాయి. ఉనికికి సంబంధించినంతవరకు అయితే, ప్రతిదీ సవ్యంగానే ఉంది ఎందుకంటే, ఏమీ జరగలేదు. శరీరం లేచింది, కొంత సమయం ఆటలాడింది, ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయింది- సముద్రంలో ఒక చిన్ని కెరటంలాగా. అది సుడి తిరిగి వెనక్కి పడిపోతుంది. మీ స్వానుభవంలో, ఇంకా మీ చుట్టూ ఉన్న వారి అనుభవంలో మాత్రం, ఇది ఒక పెద్ద విపత్తు. ఈ ఆపదలన్నీ మీ ఆలోచనలు, ఇంకా మీ భావోద్వేగాల్లోనే ఉంటాయి, వాటికి జీవంతో ఏ సంబంధం లేదు. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంకా భౌతిక శరీర పరిధిని దాటి మీ చైతన్యం ఇంకా మీ సజీవ తత్వం, వెళ్ళగలిగినప్పుడు మాత్రమే, జీవితాన్ని దాటి ముందుకు వెళ్లడం అనే ప్రశ్న ఉదయించగలదు.
బుడగను బద్దలు కొట్టడం
ప్రస్తుతానికి మీ చైతన్యం కేవలం ఈ పార్శ్వాలకే పరిమితమైపోయి ఉంది. కాబట్టి, ఈ జీవితాన్ని దాటి దాన్ని తీసుకువెళ్లే ప్రశ్నే లేదు. కానీ ఒకవేళ మీ చైతన్యం సమగ్రమైనది అయి ఉంటే- ఒకవేళ దానికి ఏది భౌతికమైనది, ఏది కాదు అన్న ఎరుక చాలా స్పష్టంగా ఉంటే- ఇక అదే ముగింపు. సంపూర్ణ చైతన్యంతో ఎవరైనా దేహాన్ని విడిచి పెట్టాలంటే అది కేవలం స్వయంగా తన ఎంపికతోనే జరుగుతుంది. ఒకరు ఎరుకతో ఉన్నప్పుడు, ప్రతీది తన ఎంపికే అవుతుంది. కేవలం మనిషికి ఎరుక లేనప్పుడే ప్రతీదీ నిర్బంధం అవుతుంది. మీరు నిజంగా ఎరుక కలిగిన వారైతే, ఈ శరీరంలో ఉండాలా లేక వద్దా అన్నది కూడా మీ ఎంపిక ప్రకారమే జరుగుతుంది. ఒక్కసారి అటువంటి అవకాశం వస్తే, ఇక ఆట ముగిసినట్టే. "నేను" అని అప్పటిదాకా పనిచేస్తున్నది, ఇక ఆపై తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ప్రతిదీ ఎలా ఉండాలో అలా ఉంటుంది, అంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది.
నేను మాటలతో చెప్తున్నది తప్పు కావచ్చు, కానీ ఒక పోలికగా తీసుకుంటే, దాన్ని ఇప్పుడు మనం దాటుతున్న నదులలాగా అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న నది మందాకిని, ఇంతకు కొంచెం ముందుగా మీరు చూసిన నది అలకనంద, మీరు నిన్న చూసినది భాగీరథి. దిగువన, హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న హరిద్వార్ దగ్గర, అన్నీ కలిసి గంగ అయిపోతుంది. ఈ నదులన్నిటికీ వాటి వాటి స్వంత వ్యక్తిత్వాలు ఉన్నాయి. కానీ హరిద్వార్ దగ్గర అవన్నీ తమ స్వభావాలను పోగొట్టుకొని, మరొక కొత్త తరహా వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాయి. గంగా నది సముద్రంలోకి ప్రవహించి, అక్కడ తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని, హిందూ మహాసముద్రంగా మారిపోతుంది. మీరు ఇంకాస్త లోతుగా చూస్తే, అసలు హిందూ మహాసముద్రము లేదు, పసిఫిక్ మహాసముద్రము లేదు. అది కేవలం ఒక మహా సముద్రం.
కాబట్టి ఆధ్యాత్మికత అంటే అభివృద్ధి పొందడం కాదు. దానర్థం ఆత్మ నిర్మూలనం, ఆత్మ హననం.ఇది భౌతికంగా మిమ్మల్ని మీరు హింసించుకోవడం గురించి కాదు; ఇది వ్యక్తితత్వాన్ని పోగొట్టుకొని సమిష్టితత్వంలో భాగం అవ్వడం. అందుకే శివుడు పూజింప బడతాడు. ఆయనే సంహార కర్త. మీరు గనక వినాశనకారి కాకపోతే, మీకు ఆధ్యాత్మికతతో ఏ సంబంధం ఉండదు.
Editor’s Note: Amalgamating Sadhguru’s discourses during yatras to the Himalayas, “Himalayan Lust” is a blend of the specific and the timeless. It is a chance to make a pilgrimage on the page, travelling through the unpredictable but fascinating terrain of the Master’s words. Download the preview chapter or purchase the ebook at Isha Downloads.