సోల్మేట్స్ నిజంగా ఉంటారా? మీరు సరైన వ్యక్తితోనే ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది?
మీరు ఆత్మకు సహచరులు ఉంటారని నమ్ముతున్నారా? మీరు సరైన వ్యక్తినే ఎంచుకున్నారని ఎలా తెలుస్తుంది? సద్గురు సోల్మేట్స్అనే భావనను తీసివేసి, "సరైన" వివాహ భాగస్వామిని ఎలా ఎంచుకోవచ్చో చెప్తున్నారు.
అసలు సోల్మేట్స్ ఉంటారా?
సద్గురు:: శరీరానికి సహచరుడు అవసరం. ఒకవేళ బాగా అభివృద్ధి చెందకపోతే, మీ మనసుకూ సహచరుడు అవసరం కావచ్చు. మీ భావోద్వేగాలు అందరినీ కలుపుకునే విధంగా లేకపోతే, వాటికి కూడా సహచరుడు అవసరం. కనీసం మీ ఆత్మ, సహచరుని కోసం ఆత్ర పడకుండా ఉండగలగాలి !ప్రజలు "ఆత్మ" అని చెప్పినప్పుడు వారు భౌతికతకు మించిన దానిని సూచిస్తున్నారు. భౌతికతకు మించి ఏదైనా ఉంటే, దానికి సహచరుడు అవసరమా? సహచరుడు అంటే తోడు అని అర్థం. ఇది శారీరక, మానసిక లేదా భావోద్వేగ అవసరాలకు కావచ్చు లేదా ఉద్యోగంలో కావచ్చు, కానీ ఒక అసంపూర్ణత్వ భావం ఉన్నప్పుడే ఒక సహచరుడు కావాల్సివస్తాడు. మీరు ఆత్మ అని దేనినైతే సూచిస్తున్నారో - కనీసం అదొక్కటి అయినా సంపూర్ణంగా ఉండాలి.
ఎక్కడో ఒక ఆత్మ బంధువున్నాడని, దేవుడు కేవలం మీకోసమని మరొక వ్యక్తిని సృష్టించాడనే ఒక భావన ఉంది. కానీ ఈ రోజుల్లో, ప్రతి రెండు సంవత్సరాలకూ దేవుడు మీకోసం ఇంకొక వ్యక్తిని సృష్టిస్తూనే ఉన్నాడు. అంటే తప్పకుండా , దేవుడు మీ విషయంలో చాలా తప్పులు చేస్తున్నాడు! అసలు అటువంటిది ఏమీ లేదు. ఆత్మకు సహచరుడు అవసరం లేదు, మీకోసమని తయారుచేసిన ఒక సరైన వ్యక్తి అంటూ ఎవరూ లేరు. మీరొక పరిపూర్ణమైన, లోపం లేని వ్యక్తి అని, మీకోసం దేవుడు ఎక్కడో మరొక పరిపూర్ణ వ్యక్తిని సృష్టించాడని మీరు అనుకుంటే, మీరు వైఫల్యం వైపుకు వెళ్తున్నారు.
సోల్మేట్స్ఇంకా ప్రేమ
జనం అసలు ఎందుకు ఒక సంబంధాన్ని కోరుకుంటారు? అది భౌతిక కారణాల వల్ల కావచ్చు; దాన్ని మనం లైంగికత అని పిలుస్తాము, అది చాలా అందంగా ఉంటుంది. అది మానసిక కారణాల వల్ల కావచ్చు; మనం దాన్ని సాంగత్యం అని పిలుస్తాము, అది కూడా అందంగా ఉంటుంది. అది భావోద్వేగ కారణాల వల్ల కావచ్చు; మనం దాన్ని ప్రేమ అని పిలుస్తాము, ఇది పురాణాల కాలం నుంచి ఒక మధురమైన అనుభూతిగా ప్రశంసించబడింది. ఖచ్చితంగా, శారీరక అనుకూలత, సాంగత్యం ఇంకా ప్రేమ, జీవితాన్ని అద్భుతంగా చేయగలవు, కానీ మీతో మీరు నిజాయితీగా ఉండగలిగితే, అటువంటి అమరికతో పాటు ఆందోళనలు కూడా వెంట వస్తాయనే సత్యాన్ని కూడా మీరు కాదనలేరు. ఒక సంబంధంలో ఉండే పరిమితులు, వాటిలో ఉండే నిబంధనల విషయంలో నిజాయితీగా ఉండటం తెలివైన పని. వాస్తవికతకు దగ్గరగా ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, రేపు మీరు ఆ పరిమితులను ఎదురుకొన్నప్పుడు, వాటిని పరిష్కరించుకోవడానికి ఒక పరిపక్వ మార్గాన్ని కనుగొంటారు. మేము సోల్మేట్స్ అని, లేదా మా వివాహం "స్వర్గంలో నిర్ణయమైంది" అని ప్రకటించి కూర్చుంటే, నిరాశ చెందక తప్పదు.
ఒకవేళ మీకు ప్రేమ గురించి గనక చాలా భ్రమలు ఉంటే, మీరు ఎంత అద్భుతమైన వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ ఆ వివాహం ఖచ్చితంగా చెదిరిపోతుంది, ఎందుకంటే మీరు ఎల్లకాలం ఊహల్లో ఉండిపోలేరు. మీరు వివేకంతో, సంతోషంగా జీవించాలనుకుంటే, వివాహం అనేది మనుషులు చేసుకున్న ఒక ఏర్పాటు, అది ఎక్కడో స్వర్గంలో జరగలేదని గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం. వివాహమే మీ జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయం కాదని మీకు గుర్తున్నంతవరకూ, వివాహం అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం.
ఈ సంబంధాల విజయం మనం వాటిని నిర్వహించే పరిపక్వత ఇంకా వివేకంపై ఆధారపడి ఉంటుంది. నాకు ప్రేమ పట్ల అపనమ్మకం ఏమీ లేదు. ప్రేమ అనేది మానవుడికి ఉన్న అత్యంత అందమైన లక్షణాలలో ఒకటి. అనేక సంస్కృతులు ప్రేమను అణచివేశాయి; కొన్ని దానిని స్వర్గానికి ఎగుమతి చేయడానికి ప్రయత్నించాయి. కానీ ప్రేమ ఈ గ్రహానికి చెందినది, ఇంకా చెప్పాలంటే అది మానవ సంబంధమైనది. దాన్ని ఎందుకు తిరస్కరించాలి?
ప్రేమించడానికి ఒక వస్తువు లేక విషయం అవసరం లేదు. ప్రేమ అనేది కేవలం ఒక గుణం. మీరు ప్రేమించే వ్యక్తి భౌతికంగా మీ సమక్షంలో లేకపోయినా, మీరు వారిని ప్రేమించగలరు. మీరు ఇష్టపడే వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా, మీరు వారిని ప్రేమిస్తూనే ఉంటారు. దీని అర్థం, మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను, మీలోని ప్రేమ అనే ఈ సహజమైన లక్షణం వ్యక్తీకరణ పొందడం కోసం, కేవలం ఉద్దీపనలుగా ఉపయోగిస్తున్నారు. విశదీకరించి చూడగల మీ తెలివితేటలకు కొంత అవగాహన తీసుకువస్తే, మీకు అర్థం అవుతుంది మీరు ఉండగల ఏకైక స్థితి ప్రేమ అని. ప్రేమ అనేది మీరు చేసే ఒక పని కాదు. ప్రేమ అనేది మీరుండగలిగే ఒక స్థితి. ప్రేమ అంటే జీవితం తన కోసం తాను తపన పడటం. తాను అన్నింటినీ కలుపుకొని ఇంకా అపరిమితంగా మారాలి అనే తపన. మీ ప్రేమ అందరినీ కలుపుకునే విధంగా ఉన్నప్పుడే మీరు ఆ అవధులు లేని దానిని తాకగలరు. అప్పుడే మీరు ఈ సత్యాన్ని గ్రహిస్తారు: ఆత్మకు తోడు అవసరం లేదు అని. అసలు ఎప్పుడూ లేదు.
మీరు సరైన వ్యక్తిని కనుగొన్నారో లేదో తెలుసుకోవడం ఎలా?
కొంతమంది, కర్మ సంబంధాల వల్ల ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు అవుతారు. ఇది నిజమే! అంటే దాని అర్థం అవి ఆదర్శవంతమైన సంబంధాలు అని కాదు. ఈ గ్రహం మీద మీకోసం సరిగ్గా సరిపోయే ఒక తగిన వ్యక్తి అంటూ ఎవరూ లేరు. మీరు దేనిమీదైనా పూర్తిగా మనసు పెడితే, అది అద్భుతంగా మారే అవకాశం ఉంది. ఇదే సరైనదా అంటే, సరైనది అంటూ ఏమీ లేదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా మీకు సరిపోయే జోడీని కనుగొన్నారనే అవాస్తవిక ఆలోచనా విధానంలో ఉంటే, చాలా త్వరగా నిరాశకు లోనవుతారు. మీ పిచ్చితనం మీది, వారికుండే పిచ్చితనం వారిది- అది మీరు అర్థం చేసుకుని, మీ అర్ధంలేని పిచ్చితనాన్ని వాళ్ళ అర్ధంలేని పిచ్చితనంతో సర్దుబాటు చేసుకొని సంబంధాన్ని కొనసాగించవచ్చు.
మనం ఇది అర్థం చేసుకోవాలి - సంబంధాలు వివిధ రకాల అవసరాలు తీర్చుకోవడం కోసం ఏర్పరుచుకున్నవి. మీరు మీకున్న అవసరాలు తీరడం కోసం ఒకరి వద్దకు వెళ్తున్నప్పుడు, మీరు ఒక బిచ్చగాడిగా వెళ్తున్నారు, ఒక బిచ్చగాడికి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. మీరు నిజంగా ఈ ప్రపంచంలో దేన్నయినా ఎంపిక చేసుకోవాలనుకుంటే, మొట్టమొదటగా, మీకు మీరుగా ఉన్నపుడు, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండే స్థాయికి మిమ్మల్ని మీరు తెచ్చుకోవాలి. అలా ఉన్నపుడు ఏది మీ వైపు ఆకర్షితమవుతుందో చూద్దాం. మీరు నిజంగా అద్భుతంగా ఉంటే, మీ జీవితంలో అన్ని విషయాలు అద్భుతంగానే జరుగుతాయి. ఉద్యోగ పరంగా, వివాహ పరంగా ఇంకా సంబంధాల పరంగా మీ జీవితంలో అన్నీ ఉత్తమమైనవే జరుగుతాయి ఎందుకంటే మిమ్మల్ని మీరు అలా తీర్చిదిద్దుకున్నారు. ఇంకెవరినో సరిదిద్దాలని ప్రయత్నించడం కంటే, మీ మీదే మీరు దృష్టి పెట్టి, మిమ్మల్ని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకుంటే, ప్రతి ఒక్కరూ మీతో ఉండాలని కోరుకుంటారు, అప్పుడు మీకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
మీకు సంపూర్ణంగా సరిపోయే వ్యక్తి అంటూ ఎవరూ దొరకరు. ఒక సంబంధంలో మీరు గనక చాలా లోతుగా భాగస్వామ్యం పంచుకుంటే, అది చాలా అద్భుతంగా మారే అవకాశం ఉంది. అది అవతలి వ్యక్తి అద్భుతమైనవాడు కావటం వల్ల కాదు. మీరు మూర్ఖుడిని ఎంచుకున్నా ఫర్వాలేదు. మీరు మనస్ఫూర్తిగా నిమగ్నమైతే, అది చాలా అద్భుతంగా మారుతుంది. మీరు ప్రపంచంలోని అతి తెలివైన వ్యక్తిని ఎంచుకున్నా సరే, మీ వివాహం చెదిరిపోవచ్చు. మనిద్దరం "ఒకరి కోసం ఒకరు పుట్టాం" అనే అర్ధం లేని ఆలోచన చేయవద్దు. వాస్తవానికి మీరు, మీకు వ్యతిరేకమైన వ్యక్తిత్వం ఉన్నవారిని ఎంచుకుంటారు. కానీ కొంతకాలం గడిచాక, నెమ్మదిగా వారు మీలాగే ఉండాలని ఆశించడం ప్రారంభిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. అచ్చం మీలాగే ఉన్న మరొక వ్యక్తి ఇంట్లో ఉంటే, మీరు అక్కడ ఉండగలరా? వారు మీకు భిన్నంగా ఉన్నందుకు సంతోషించాలి. ఈ ప్రపంచంలో మీలాంటి వ్యక్తి అంటూ ఎవరూ లేకపోవడం నిజంగా చాలా ఆనందదాయకం. సారూప్యం కోసం వెతకద్దు.