ఆలయాలు ఎందుకు?
ఈ రోజుల్లో గుళ్ళకు వెళ్ళేవారిలో చాలామంది వాటిలోని శక్తికి ఆకర్షింపబడి గుళ్ళకు వెళ్ళడం లేదు. భయంతోనో, ఆశతోనో వెళుతున్నారు. కాని, అసలు 'గుడి’ స్థాపన వెనుకున్న విజ్ఞానమే వేరు! ఆ విజ్ఞానం ఏమిటనేది సద్గురు మాటల్లో తెలుసుకుందాం!
ఈ రోజుల్లో గుళ్ళకు వెళ్ళేవారిలో చాలామంది వాటిలోని శక్తికి ఆకర్షింపబడి గుళ్ళకు వెళ్ళడం లేదు. భయంతోనో, ఆశతోనో వెళుతున్నారు. కాని, అసలు 'గుడి’ స్థాపన వెనుకున్న విజ్ఞానమే వేరు!
ఆకాశాన్ని చూస్తే అది ఎంతో విశాలమైనదిగా గోచరిస్తుంది. కాని సూర్యుడు, నక్షత్రాలూ, మిగతా గ్రహాలే కదా మనల్ని ఆకర్షించేది? అనంతంగా వ్యాపించి ఉన్న శూన్యం మనల్ని ఆకర్షిస్తుందా? ఆ శూన్యం మనకు తెలుస్తుందా?
రూపం లేని ఆ శూన్యంలో ఆనందాన్నిచ్చే అనుభవం ఒకటుంది. దాన్ని తెలుసుకోవడానికే గుళ్ళూ, గోపురాలూ స్థాపించబడ్డాయి. మీరు ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయాగపడేవి మీ పంచేంద్రియాలే - అవే కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. కాని శూన్యాన్ని తెలుసుకోవడానికి మీ పంచేంద్రియాలు సరిపోవు.
పంచేంద్రియాలతో విశ్వాన్ని అర్థం చేసుకోవాలనుకోవడం ఎలాంటిదో తెలుసా? ఒక జెన్ గురువు దగ్గరికి ఒక కోతి వచ్చింది. తనను శిష్యునిగా స్వీకరించమని అడిగింది. "వేరే వాళ్ళ దగ్గర లేని సామర్థ్యం నా దగ్గర వుంది. ఒకే గెంతుతో 100 చెట్లను దాటేస్తాను" అంది. ఆ కోతికి ఒక కత్తి ఇచ్చారు గురువు. "ఈరోజు ఎంత దూరం వెళ్ళగలవో అంత దూరం వెళ్ళి, అక్కడ ఈ కత్తితో ఒక గుర్తు పెట్టి తిరిగిరా. ఆ తర్వాత నా అభిప్రాయం చెప్తాను" అని అన్నారు.
ఆ పందెం తేలిక అనుకుంది కోతి. జెన్ గురువును అదరగొట్టాలని అనుకుంది. మామూలు కన్న ఎక్కువ వేగంతో ఎగురుతూ వెళ్ళింది. అలసట వచ్చాక, ఒక చోట ఆగి ఒక చెట్టు మీద కత్తితో గుర్తు పెట్టి తిరిగి వచ్చింది. "నేను గుర్తు పెట్టిన చెట్టును చూడాలంటే మీరు కొన్ని నెలలపాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది." అంది కోతి. "అక్కర్లేదు!" అని జెన్ గురువు మందహాసం చేశారు. తాను కూర్చొన్న చెక్క పలకను చూపించాడు. దాని మీద కోతి చెక్కిన గుర్తు కనిపించింది. ఈ విశ్వమనే బ్రహ్మాండంలో మానవుడి ప్రయాణం కూడా ఇంతే. దీనిని మించిన పయనం కొరకు నిర్మించబడినవే ఈ కోవెలలు.
ఇంకా తేలికగా చెప్పాలంటే, ఏమీ లేని శూన్యం మీద విశాలమైన ఒక తివాచీ పరిచి ఉందనుకుంటే, మీరు ఆ తివాచీ మీద ఉన్నారనుకోవచ్చు. ప్రత్యక్ష అనుభవం కలవారు శక్తిభరితమైన స్థితిలో శాస్త్రీయంగా ఆ తివాచీ మీద ఏర్పరచిన రంధ్రాలే ఈ కోవెలలు. ఆ రంధ్రాల ద్వారా ఆవల ఉన్న శూన్యాన్ని, ఆ పరిమితిలేని శూన్యాన్ని అనుభూతి చెందగలరు. ఆ అంతుచిక్కని శూన్యాన్ని 'శివ' అని అంటాము. నిరాకార శూన్యం ఒక రూపం సంతరించుకున్నప్పుడు, మొదట ఏర్పడే రూపమే లింగం. దేనినుండి ఉద్భవించావెూ, ఆ శూన్యతత్త్వమైన 'శివ' తో ఏకమైపోవడానికే ప్రారంభంలో ఆలయాలు నిర్మింపబడ్డాయి. మొదట్లో నిర్మింపబడిన వేలకొలది ఆలయాలు ఏ అట్టహాసాలు లేకుండా, కేవలం లింగాలతోనే ఉండేవి. ఎవరినీ ఆకర్షించడం వాటి ధ్యేయం కాదు. కాలక్రమేణా మానవుడి ఆసక్తి మారిపోయింది. చివరకు లభించే ముక్తి కంటే వెంటనే కావలసినవి ముఖ్యంగా తోచాయి. ఆ అవసరాలకు తగినట్లు శక్తులను ప్రసాదించే రూపాలను సృష్టించడం ప్రారంభించారు.
ఆలయాలకు సంబంధించిన విజ్ఞానమెలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న మానవుడు శక్తికి ఒక దైవం, ధనానికి ఒక దైవం, చదువుకు ఒక దైవం, కాపాడి రక్షించేందుకు ఒక దైవం అంటూ ఎన్నో రకాల దేవుళ్ళ కొరకు ఎన్నో ఆలయాలు నిర్మించాడు. కాని ఈ రోజు గుళ్ళకు వెళ్ళే అధికశాతం ప్రజలకు అక్కడ నిక్షిప్తమైవునన్ని శక్తిని గ్రహించే స్థాయి లేదు కనుక, వారు ఆ శక్తిని అనుభూతి చెందలేకపోతున్నారు. శక్తివంతమైన గుడి ఏది? ఏది మామూలు కట్టడం? అనే బేధం తెలుసుకోలేక పోతున్నారు. మహా యోగులవల్ల నిర్మించబడిన గొప్ప శక్తివంతమైన ఎన్నో ఆలయాలు మన దేశంలో ఆదరణలేక పాడై పోవడం, వాటి శక్తిని మనం తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం.
మిమ్మల్ని ఉద్వేగపరిచే ఆలయాలు కావాలకుంటున్నారు. కోరికలు తీర్చే స్థలంగా ఏ కోవెల గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారో, అవి ప్రసిద్ధి చెందుతున్నాయి. ప్రసిద్ధి చెందినంత మాత్రాన, ఒక కోవెల శక్తివంతమైనదని చెప్పలేం. సృష్టిలో కనిపించేవన్ని శూన్యంలో విస్ఫోటనం జరిగి, దానిలోంచి పొంగి పొరలి వచ్చినవేనని ఈనాటి వైజ్ఞానిక పరిశోధనలు నిరూపించాయి. శూన్యం నుండి పుట్టినవన్నీ తిరిగి ఆ శూన్యంలో కరిగిపోతాయనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి స్థాపింపబడినవే నిజమైన ఆలయాలు.
ప్రేమాశీస్సులతో,
సద్గురు