ఆవ గింజ సామర్థ్యం - ఒక జెన్ కథ
టాంగ్ సామ్రాజ్యంలోని లీబో అనే పండితుడి గురించిన కథ ఇది. తను జెన్ మాస్టర్ జిజాంక్ ని కలిసి తన తెలివైన ప్రశ్న అడిగినపుడు ఏం జరిగిందో తెలుసుకోండి.
జెన్ కథ: టాంగ్ రాజవంశం పాలించే సమయంలో, చదువంటే బాగా ఇష్టపడే లీబో అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన 10,000 గ్రంథాలకు పైగా చదివాడు. అందువల్ల అతడిని “10,000 గ్రంథాల లీ” అని పిలిచేవారు. ఒకసారి, అతడు జిజాంక్ అనే సన్యాసిని ఇలా అడిగాడు, “ ‘సుమేరు పర్వతాన్ని ఒక ఆవ గింజలో పట్టించవచ్చు’ అని విమలాకీర్తి నిర్దేశ సూత్రాల్లో ఒక భాగంలో రాసి ఉంది. అంతటి పెద్ద పర్వతం ఒక చిన్న ఆవ గింజలో ఎలా ఇముడుతుంది? ”
మాస్టర్ ఇలా బదులిచ్చారు - “ నిన్ను ‘10,000 గ్రంథాల లీ’ అని అంటారు. మరి 10,000 గ్రంథాలు నీ చిన్న బుర్రలో ఎలా పట్టాయి?”
సద్గురు: ఈ ఆవగింజ పోలిక, ముఖ్యంగా యోగ సూత్రాల నుంచి వచ్చింది. అందులో ఎల్లప్పుడూ, ఈ సృష్టి మొత్తాన్ని ఒక ఆవగింజలో పట్టించవచ్చు అనే ఉదాహరణ వాడుతారు. ఆవగింజ మనం నిత్యం ఉపయోగించేది ఇంకా అతి చిన్న వస్తువుల్లో ఒకటి. దేశకాలాలనేవి మన మనస్సులో సృష్టించుకున్నవి. అందుకే ఈ సృష్టిని అంతా ఆవగింజలో ఇమడ్చవచు. తార్కికమైన బుద్ధికి ఇది అర్థం కావడం చాలా కష్టం. కానీ, విజ్ఞాన శాస్త్రం ఇదే విషయాన్ని, మనిషి ప్రస్తుత తార్కిక స్థాయికి మించిన రీతిలో, పలు రకాలుగా చెప్తుంది. కాలం ఇంకా స్థలం రెండింటినీ మనం పొడిగించడం లేదా కుచించడం చేయవచ్చునని ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు స్పష్టంగా చెబుతుంది. అనుభవ పరంగా, ఇది ఎల్లప్పుడూ నిజమే. ఒక మనిషి ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు, కాలం ఇట్టే కుదించుకుపోతుంది. మామూలు స్థితిలో కూడా, ప్రజలు ఇది అనుభవం చెందే ఉంటారు - ఆనందంగా ఉన్నప్పుడు, 24 గంటలు ఒక్క క్షణంలా గడిచిపోతాయి; అదే దుఃఖంలో లేదా బాధలో ఉన్నప్పుడు, 24 గంటలు ఒక సంవత్సరంలా అనిపిస్తాయి.
దేశకాలాలనేవి చాలా సాపేక్షమైన అనుభవాలు. నా స్వానుభవంలో, కొన్ని స్థితుల్లో ఉన్నప్పుడు, ఒక రోజు ఒక క్షణంలా గడిచిపోతుంది. లేదా నేనొక దగ్గర కూర్చుంటే, నాకు రెండు నిమిషాలు అనిపిస్తే అప్పటికీ 7 - 8 గంటలు గడిచిపోతుంది. కొన్ని సార్లు, నాకు తెలియకుండా, ఎన్నో రోజులు అలా కూర్చొని ఉన్నాను. 4 రోజులు, 6 రోజులు లేదా 13 రోజులు నిరంతరాయంగా నేను అలా కూర్చొని ఉన్నప్పుడు, ప్రజలు నేనేదో అసాధారణమైన కార్యం చేస్తున్నానని అనుకుంటారు. కానీ, నా అనుభవంలో అది కేవలం 25 - 30 నిమిషాలు మాత్రమే. అలా కూర్చోవడానికి ఏ విధమైన కష్టం గానీ ప్రయాస గానీ లేదు. ఇదేదో అసాధారణమైన కార్యం కాదు ఎందుకంటే మీ మనస్సు యొక్క పరిమితులను దాటితే, సమయం లేదా దూరం అనేవి ఉండవు. దేశకాలాలు మీ మనస్సులోని సృష్టి. ఈ కథలో, ఆ ప్రత్యేకమైన ధ్యాన స్థితి గురించి చెప్పబడింది - మీరు నిజంగా ధ్యాన స్థితిలో ఉంటే, మీకు దేశకాలాలు రెండూ ఉండవు.