జెన్ కథ : ఒక అంధుడు తన స్నేహితుడితో కొన్ని రోజులు గడిపి, తిరిగి ఒక రోజు రాత్రి తన స్వస్థలానికి బయలుదేరాడు. స్నేహితుడు అతనికి ఒక వెలిగించిన లాంతర దీపం అందించాడు, అతడు దానిని నిరాకరిస్తూ "నాకు దీపం ఏమి ఉపయోగం? ఏదైనా నాకు ఒకటేకదా. గుడ్డివాడు దీపం పట్టుకోవడంలో లాభం ఏముంది"? అన్నాడు.

" ప్రియ మిత్రమా, ఇది నీ కోసం కాదు; నీ ఎదురుగా వస్తున్న వ్యక్తికి నువ్వు కనపడేందుకు. ఈ దీపం నీ చేతిలో ఉంటే నిన్ను వాళ్ళు ఢీకొనరు" అన్నాడు.

"ఆలా అయితే సరే, తీసుకుంటాను" అంటూ అంధుడు దీపం తీసుకుని చీకటిలో బయలుదేరాడు. అయినా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత వీధిలో ఒక వ్యక్తి అతడిని సూటిగా ఢీకొన్నాడు. అంధుడు నిలకడ కోల్పోయి కింద పడిపోయాడు. అతనికి కోపం వచ్చి"నన్నెందుకు ఢీ కొన్నావు? నేను దీపం పట్టుకున్నానుకదా - నువ్వు చూసి వెళ్ళలేవా"? అన్నాడు.

"దీపం ఏమిటి? నాకేదీ కనిపించలేదు" అని ఢీకొన్న వ్యక్తి చుట్టూ చూసాడు. అప్పుడు అతనికి లాంతరు కనిపించింది."ఓఁ, ఇదా ... , కానీ ఇది ఆరిపోయి చాల సేపయ్యింది, మిత్రమా".

సద్గురు : ఆ వ్యక్తి చేతిలో దీపం ఉన్నది వెలుగుని ఇవ్వడానికి. అది ఆరిపోయిన తరువాత కూడా దానిని పట్టుకుని వెళ్లడం అర్థంలేని పనే. అలాగే మన జీవితాలలో మనం మొదలు పెట్టిన అనేక విషయాలు, వాటి ప్రాధమిక ఉపయోగం కోల్పోయి, ఇప్పుడు కేవలం ఆచారంగా మిగిలిపోయాయి. కర్ణాటకలో ఒక సంప్రదాయం ఉంది. ఎవరైనా ఇంట్లో,అతిథికి మాంసాహారం వడ్డిస్తే అతనికి వడ్డించిన విస్తరి పక్కన ఒక రోకలి ఉంచుతారు. ఇలా చెయ్యడంలో ఉద్దేశం ఏమిటని నేను ఎందరినో అడిగాను, కానీ వారికి తెలియదు. సంప్రదాయాలు క్షుణ్ణంగా తెలిసిన చాలామంది పెద్దలను అడిగిన తరువాత నాకు విషయం తెలిసింది.

చాలా కాలం క్రితం పళ్ళు కుట్టుకోవడానికి ఒక చిన్న పుల్లని విస్తరి పక్కన ఉంచడం సంప్రదాయంగా ఉండేది. ఆ పుల్లని మాంసాహారం తిన్న తరువాత పంటి మధ్యన ఏదైనా ఇరుక్కుంటే తీసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉంచేవారు. కొంత సమయం తరువాత ఆ చిన్న పుల్ల బదులు ఓ కర్రని పెట్టడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒక తెలివితక్కువ వాడెవడో దానిని రోకలిగా మార్చాడు. ఎందుకు? అన్న ప్రశ్న వేయకుండానే, ఇదే అలవాటుగా మారిపోయింది. రోకలిని పళ్ళు కుట్టుకోవడానికి టూత్ పిక్ గా ఎవరైనా వాడుకోగలరా?

మన జీవితం మెరుగు పరుచుకోవాలని కొన్ని ప్రక్రియలని ఇలాగే సృష్టించుకుంటాము. అవి ప్రధానంగా ఎందుకు మొదలుపెట్టారో మరచిపోయి, కేవలం మన తాతలు, తండ్రులు చేశారని మనము చేసుకుంటూ పొతే అవి కేవలం ఆచారంగా మిగిలిపోతాయి. తర తరాలుగా ఏదో చేస్తున్నారనే గానీ మన సంప్రదాయంలో ఉన్న పద్ధతుల వెనుక ఉన్న ఉద్దేశ్యం తెలుసుకోకపోతే అవి మన జీవితానికి అవసరమో కాదో తెలియక మనం తికమక పడతాం. అంధుడు దీపం పట్టుకున్నట్టుగా, మన జీవితానికి మార్గదర్శకం కాగల కొన్ని సాధనాలు మనకు మూఢవిశ్వాసంగా మిగిలిపోయాయి. వీటిని అర్థంచేసుకుని వాటిలోని ఉద్దేశం కనుగొని వీటిని తిరిగి మన జీవితానికి వెలుగు చూపించగల దీపాలుగా మార్చుకోవడం అవసరం. అలా కాకపోతే, కనీసం మనకు మార్గదర్శకం కాగల కొన్ని కొత్త సాధనాలను సృష్టించుకోవాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు