'అతడిని బుద్ధుడు రక్షిస్తాడా?' - ఒక జెన్ కథ
ఒక జెన్ ఆచార్యుడు తన శిష్యులకు చెప్పిన నీతి కథను సద్గురు వినిపిస్తున్నారు. కథంతా చెప్పిన తరవాత, ఆ జెన్ మతగురువు, 'ఈ కథలో ఉన్న తప్పేమిటో చెప్పుకోండి!' అని ఆ శిష్యులను అడుగుతాడు. కథలో తప్పేమిటో ఆయన శిష్యులైతే చెప్పలేక పోయారు. మీరు చెప్పగలరేమో చూడండి!
నీతి కథ:
ఒక జెన్ మత సన్యాసుల మఠంలో సన్యాసులందరూ, తమ ఆచార్యుడి చుట్టూ చేరారు. 'నేను చెప్పబోతున్న కథను మీరంతా శ్రద్ధగా వినండి' అంటూ ఆచార్యుడు ఒక నీతి కథ చెప్పటం ఆరంభించాడు.
ఒక రోజు బుద్ధుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు. ఉన్నట్టుండి ఆయనకు, 'రక్షించండి! రక్షించండి! ' అంటూ ఎవరో పెద్దగా కేకలు వేయటం వినిపించింది. ఆ కేకలు వేస్తున్నవాడు నరకంలో ఉన్న ఒక కూపంలో పడిపోయి అక్కడ నానా యాతనలూ అనుభవిస్తున్న ఒక నిర్భాగ్యుడు అని బుద్ధుడికి అర్థమయింది. అంతే కాదు , ఆ అరుస్తున్న వాడు బ్రతికి ఉండగా ఎన్నో దొంగతనాలూ, హత్యలూ చేసిన వాడనీ, అందుకు శిక్షగానే ఇప్పుడీ నరక బాధలు అనుభవిస్తున్నాడని కూడా బుద్ధుడు గ్రహించాడు. అయినా, ఆయనకు ఆ పాపి మీద జాలి కలిగింది. అతడికి ఏదో విధంగా సహాయం చేయాలనిపించింది.
ఆ మనిషి జీవించి ఉన్న కాలంలో ఏదయినా ఒక్క మంచి పనైనా చేసి ఉండక పోతాడా అని బుద్ధుడు సమీక్ష చేసి చూశాడు. ఒకానొక్కసారి మాత్రం, అతగాడు నడుస్తూ వెళ్తుంటే త్రోవలో ఒక సాలె పురుగు కనిపించగా, దాని మీద అడుగువేసి చంపేయకుండా, పక్కకు అడుగు వేశాడు. బుద్ధుడు ఆ సాలెపురుగును 'ఇప్పుడు అతగాడికేదయినా ప్రత్యుపకారం చేయరాదా?' అని అడిగాడు. దారాలు అల్లి వలలు పన్నటం సాలెపురుగుకు బాగా చేతవును కనక ఒక పొడవైన, దృఢమైన దారాన్నిఅల్లి దాన్ని ఆ నరకకూపంలోకి అందించింది. కూపంలో ఉన్న పాపి ఆ దారం అంది పుచ్చుకొని పైకి పాకటం ఆరంభించాడు. ఆ కూపంలో అతడిలాగే శిక్షలు అనుభవిస్తున్న ఇతరులు కొందరు అదే దారాన్ని పుచ్చుకొని తాము కూడా పైకి పాకబోయారు. దాంతో అతగాడు కంగారుపడిపోయాడు. ' ఈ దారం నాకోసం పంపించబడ్డ దారం. ఇంతమంది దీన్ని పుచ్చుకొని పైకి పాకటానికి ప్రయత్నిస్తే, ఇది పుటుక్కున తెగిపోతుంది!' అని కోపంగా అరిచాడు. అతడలా కేకలు పెట్టిన మరుక్షణమే ఆ దారం టప్పున తెగిపోయి, అతగాడు మళ్ళీ నరక కూపం లోకి పడిపోయాడు.
పడిపోయిన వాడు కాస్తా మళ్ళీ అరవటం మొదలు పెట్టాడు, 'రక్షించండి! రక్షించండి!' అని. ఈ సారి బుద్ధుడు ఆ కేకలను అసలు పట్టించుకోలేదు.
ఇక్కడి దాకా చెప్పి, జెన్ ఆచార్యుడు కథను నిలుపు చేశాడు. 'ఈ కథలో ఒక తప్పున్నది. అదేమిటో చెప్పగలరా?' అని శిష్యులను ప్రశ్నించాడు.
'సాలెపురుగు అల్లే సన్నటి దారానికి మనిషిని పైకి లాగేందుకు పనికి వచ్చేటంత బలం ఉండదు!' అని బదులిచ్చాడు ఒక శిష్యుడు.
'స్వర్గం, నరకం అనేవి అసలు ఉండనే ఉండవు గదా, అదే ఈ కథలో తప్పు' అన్నాడు మరొక శిష్యుడు.
మూడో శిష్యుడొకడు, ' అసలు బుద్ధ భగవానుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొన్నప్పుడు, ఆయనకు వినిపించిన ధ్వని మరేదో అయి ఉంటుంది' అన్నాడు.
'ముఖ్యమైన అసలు విషయాన్ని మీరెవ్వరూ పట్టుకోలేకపోయినట్టే!' అంటూ ఆచార్యుడు చిరునవ్వు నవ్వి, అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.
సద్గురు: నిజమైన కారుణ్యభావం, 'ఫలానా వారు' అని కొందరిని ఎంచుకొని వారిపట్ల మాత్రమే చూపేది కాదు. 'నేను ఈ వ్యక్తి పట్ల కారుణ్య భావం చూపిస్తాను' అని ఒకరిని ఎంచుకోవటం గానీ, ' ఈ వ్యక్తి నా కారుణ్య భావానికి అర్హుడు కాదు ' అని మరొకరి గురించి భావించటం గానీ, అసలు కారుణ్యభావం లక్షణమే కాదు. సహాయం చేసే విషయంలో ఫలానా వాళ్ళు ఆ సహాయానికి పాత్రులు అని ఎంపిక చేసుకోవటం ఉంటే ఉండచ్చు. కారుణ్య భావం విషయంలో మాత్రం అలాంటి ఎంపిక ఉండదు. బుద్ధుడు నిజంగా నరకకూపంలో యాతనలు పడుతున్న ఆ పాపిని రక్షించ దలచుకొంటే, ఆ పాపి ఒక్క సారి స్వార్థపూరితంగా వ్యవహరించినంత మాత్రాన , అతడిపట్ల తన మనసు మార్చుకొనే వాడు కాదు.
పుణ్య పాపాలూ, మంచీ చెడులూ ఇవన్నీ నైతికతను దృష్టిలో ఉంచుకొని నిర్వచించబడ్డ విషయాలు.జీవ కారుణ్య భావం నైతికతకూ, నమ్మకాలకూ, న్యాయ నిర్ణయాలకూ అతీతమైంది. కరుణాభావం కొందరిపట్ల మాత్రమే ప్రదర్శించి, మరి కొందరి విషయంలో ఉపసంహరించుకొనేది కాదు.
ఇక్కడ జెన్ ఆచార్యుడు తన శిష్యులకు చెప్పిన కథ ఒక నీతి కథ. ఎవరో కల్పించిన కట్టుకథ. ఈ కథ ద్వారా చెప్పే నీతి ఏమిటంటే, సాక్షాత్తూ బుద్ధ భగవానుడు కూడా ఇతరుల కష్టాలను పట్టించుకోలేని పరమ స్వార్థపరులను రక్షించడు అని. సామాజికులను ప్రభావితులను చేసి సంఘాన్ని సంస్కరించి, సరయిన మార్గంలో నడిపించాలనే సదుద్దేశ్యంతో కల్పించిన కథ ఇది.
నిజంగా జ్ఞాని అయిన ఆచార్యుడు కారుణ్య భావాన్ని చూపేందుకు అవకాశం గానీ అవసరం గానీ కనిపించిన ప్రతిచోటా, నిస్సంకోచంగా, అలాంటి భావాన్ని ప్రదర్శించి తీరతాడు. అలా తనలో తను అంతర్గతంగా పరిపూర్ణమైన స్వేచ్ఛనూ, విముక్తిని సాధించి, స్వీకరణ-తిరస్కరణ భావాలకు అతీతుడైపోయినవాడే బుద్ధుడవుతాడు. బుద్ధిశక్తి, మేధాశక్తి ఇత్యాదులతో నిమిత్తంలేని బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న వాడే అసలైన కారుణ్య భావం చూపగలుగుతాడు.
ఇలాంటి నీతిబోధకమైన కట్టు కథలు, బౌద్ధ మతాన్ని కూడా ఇతర మతాలలాగా వ్యాపింపజేయాలన్న ఉద్దేశ్యంతో కొందరు మత ఛాందసులు కల్పించినవి. అందుకే ఆ జెన్ ఆచార్యుడు 'ఈ కథలో ఒక పొరపాటు ఉన్నది సుమా!' అని హెచ్చరించింది!
ప్రేమాశీస్సులతో,