సెల్‌ఫోన్ వ్యామోహం నుంచి బయట పడడం ఎలా?
సాంకేతికత మనల్ని ముంచెత్తిన ఈ సమయంలో, ప్రజలు తమ మొబైల్ ఫోన్ తో ఎంతగానో మమేకమయ్యారు. అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉహించుకోలేరు, మరి ఇటువంటి స్థితిలో ధ్యానం చేయడం సాధ్యమా? అనే ప్రశ్నకు సద్గురు సమాధానం చెబుతున్నారు.
ప్రశ్న: సద్గురూ! ఈ రోజుల్లో మన దృష్టిని మళ్లించే సాధనాలెన్నో ఉన్నాయి - మొబైల్ ఫోన్లు, ఫేస్‌బుక్, వాట్స్‌యాప్... ఇటువంటి స్థితిలో ధ్యానం చేయడమెలా?
సద్గురు: మీ ఫోన్ మీ దృష్టిని మళ్లిస్తుందని మీరనుకుంటే, కైలాస పర్వతం మీద మైనస్ పదిహేను డిగ్రీల సెల్సియన్ వాతావరణంలో ‘ఆదియోగి’ లాగా కూర్చోవడం ఊహించుకోండి. అది మరింత కష్టం కాదా! మొబైల్ ఫోన్ మీ సౌకర్యార్ధమే ఉంది. సాంకేతికంగా మనకు సాధికారాన్ని అందించి, మన కార్యకలాపాలను సులభం చేసి, మన జీవనాన్ని మెరుగుపరిచేది మీ ఫోను. దాని సహాయంతో చేయవలసిన పని మీరు తొందరగా చేస్తే ధ్యానానికి ఎక్కువ సమయం లభిస్తుంది కదా.
మీకు జ్ఞాపకముందా? రెండు దశాబ్దాల కిందట భారత దేశంలో ఒక లాంగ్ డిస్టన్స్ కాల్ చేయాలంటే ఎంత కష్టంగా ఉండేదో. తొంభై దశకంలో మన ఈశాఫౌండేషన్ నిర్మాణం ప్రారంభంలో ఉండగా, నేను ఎప్పుడూ ఒక పట్టణం నుండి మరో పట్టణానికి ప్రయాణిస్తూ రోడ్డుమీదే ఉండవలసి వచ్చేది. వారానికొకసారి నేను దేశంలోనూ, విదేశాలకూ యాభై నుండి వంద ఫోన్ కాల్స్ చేయవలసి వచ్చేది. ‘ఇవ్వాళ ఫోన్‌కాల్స్ చేయాలి’ అని నేను నిర్ణయించుకున్న తర్వాత ఒక చిన్న పట్టణంలోనో, గ్రామంలోనో ఎస్‌టిడి అని రాసి ఉన్న ఫోన్ బూత్ దగ్గర ఆగేవాణ్ణి. ఆ బూత్ యజమానికి ముందే కొన్ని వేలరూపాయలు చేతిలో పెట్టి, తర్వాత ఫోన్‌కాల్స్ మొదలు పెట్టేవాణ్ణి. నా కాల్స్ పూర్తయ్యేటప్పటికి నా వేళ్లు నొప్పి పెట్టేవి, ఆ నల్లఫోను, ఆ ఫోన్ బూత్ లు కూడా ఘోరంగా ఉండేవి. అక్కడ కూర్చోవడం బాధాకరంగా ఉండేది. మరి ఈ రోజుల్లో, అసలు చేత్తో డయల్ చేయవలసిన అవసరం కూడా లేదు - పేరు చెప్తే చాలు, ఫోన్ కాల్ చేస్తుంది.
సౌకర్యాల మీద ఫిర్యాదులు
ఇటువంటి సౌకర్యం ఆనందించడానికి బదులు, మీరు ఫిర్యాదు చేస్తున్నారు. అదొక సమస్యగా ఇప్పుడు పరిణమిస్తుందంటే, ఏదైనా చేయడం ప్రారంభించిన తరవాత దానిని ఎక్కడ ఆపాలో అన్నది, మీకు తెలియకపోవడం వల్లనే - అవి ఎంత చిన్న పనులైనా సరే. ఉదాహరణకు, మీరు తినడం మొదలుపెడితే ఎక్కడ ఆపాలో మీకు తెలియదు. అసలు సమస్య మనకున్న సౌకర్యాలతో కాదు - అసలు సమస్య, మనకు స్పృహ లేకపోవడమే. మన జీవితాలను మెరుగుపరిచే పరిష్కారాలుగా ఉండవలసిన విషయాలను, మనం మన అజ్ఞానం వల్ల సమస్యలుగా మార్చుకుంటున్నాం. వాట్స్ యాప్ నిరంతరం మోగుతూ ఉంటే మీరు కదలకుండా కూర్చోవడం సాధ్యమా అన్నది ఇప్పుడు మీ ప్రశ్న? ఇది సాధ్యమే. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవచ్చు. మీ జోక్యం లేకుండా ప్రపంచం ఎంతో చక్కగా నడుస్తుంది.
మీరు మీ ఫోన్ ఆపివేస్తే ఈ విషయం మీకు ఇప్పుడే అర్థమవుతుంది. మీరిది అర్థం చేసుకుంటే మరింత అర్థవంతంగా చాలా పనులు చేస్తారు. మీరు ప్రపంచంతో ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉంటే, ప్రజలు మీరున్నందుకు సంతోషిస్తారు. మీరు అతిగా జోక్యం చేసుకుంటూ ఉంటే, మీరు మరణించినప్పుడు సంతోషిస్తారు. నేను ఒక ప్రదేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు సాధారణంగా ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. కాని, ఎలాగో కొద్దిమంది విమానాశ్రయానికి వచ్చేస్తారు. వాళ్లతో ‘‘నేను వెళ్లిపోతుంటే మీకింత సంతోషమెందుకు?’’ అని అంటుంటాను, అప్పుడు వాళ్లు ఏడవడం మొదలుపెడతారు. నేనప్పుడు ‘‘లేదు. లేదు. పరవాలేదు - నాకర్థమయింది’’ అంటుంటాను. ప్రజలు పండుగ చేసుకునేందుకు మీరు చనిపోయే వరకు ఎదురుచూడాలా లేక ఇప్పుడే సంతోషాన్ని వ్యాపింపజేయాలా అన్న..! ఎంపిక మీదే.