ఇష్టాయిష్టాలను అధిగమించడం ఎలా?
మనమేదో ప్రత్యేకంగా ఉండాలనుకుంటే చివరికి గాయపడవలసి వస్తుందంటున్నారు సద్గురు. అహం యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నారు. గాయపడిన బొటన వేలిని బయటపెడితే, దానికి ఎప్పుడైనా దెబ్బ తగలవచ్చు, మనల్ని బాధ పెట్టవచ్చు. అహం కూడా అటువంటిదే. తక్కిన సృష్టి నుండి మనల్ని వేరుచేసుకోవడం కాదు చేయవలసినది, మనచుట్టూ ఉన్న దానిలో కరిగిపోయి, కలసి పొమ్మంటున్నారాయన.
అహం ఎప్పుడూ విభిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. తన చుట్టూ ఉన్నదానితో సామరస్యంగా ఉండాలని అది కోరుకోదు. జనంలో మీరు విడిగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం, ఉండాలని ప్రయత్నించడం ఎప్పుడూ మిమల్ని బాధే పెడుతుంది. లండన్ నుండి తిరిగివచ్చిన తర్వాత శంకరన్ పిళ్లే కొత్త డెనిమ్ బిగుతు పాంటు, శరీరానికి అతుక్కొని ఉండే శాటిన్ షర్టు వేసుకున్నాడు. కొత్త పద్ధతిలో జుట్టు అలంకరించుకున్నాడు. తనలోని ఈ కొత్తదనాన్ని ప్రదర్శించుకోవడానికి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లాడు. పార్కులో ఒక బెంచీమీద కూర్చున్న వృద్ధుడి దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాడు. ఆ వృద్ధుడు శంకరన్ పిళ్లేని ఎగాదిగా పరిశీలించాడు. చివరికి ఆయన దృష్టి శంకరన్ తలపై ఆరంగుళాల పొడవున నిక్కబొడుచుకొని ఉన్న రంగురంగుల స్పైక్స్ మీద నిలిచింది. స్పైక్స్ మెరిసే రంగుల్లో ఉన్నాయి – ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం, ఆరంజ్, పర్పుల్. శంకరన్ పిళ్లే వ్యంగ్య దృష్టులతో వృద్ధుడివైపు చూసి అన్నాడు, ‘ముసలాయనా! నీ జీవితంలో ఏదైనా కొత్తగా, ఏదీ ఎప్పుడూ చేయలేదా?’ తడుముకోకుండా వృద్ధుడు జవాబిచ్చాడు, ‘ఒకసారి బాగా తాగి ఒక చిలుకతో సంపర్కం పెట్టుకున్నాను. నువ్వు నా కొడుకు వేమోనని అనుమానం వస్తోంది’. ప్రస్తుత కాలంలో మీరంతా లోకానికి భిన్నంగా ఉండేటట్లు ప్రయత్నించే సంస్కృతి ఏర్పడింది. మీరెంత ప్రత్యేకంగా ఉండాలని ప్రయత్నిస్తే జీవితంనుండి, సృష్టినుండి మీరంత దూరమైపోతారు, అందుకే దెబ్బతింటారు.
కరిగిపోవడం, కలిసి పోవడం
మీరెంత విశిష్టంగా ఉండాలని ప్రయత్నిస్తే, అంత దెబ్బతింటారు. మీరు మామూలుగా ఉండండి. మీ చుట్టూ ఉన్న గాలిలో కరిగిపొండి, భాగం కండి, మీ చుట్టూ ఉన్న భూమిలో, సర్వంలో భాగం కండి. మీ సదుపాయాలు మరచిపొండి, మీ సంవేదనలు, ఇష్టాయిష్టాలు అన్నీ మరిచిపొండి. పనికిమాలినదంతా వదిలివేయండి. పాముల లాగా జీవించండి. పాకుతూ ఉండండి, తినండి, ముడుచుకొని చెట్టుకింద పడుకోదలచుకుంటే పడుకోండి – కనీసం కొన్ని రోజులు, అది ఉపయోగకరమే. బయటికి వెళ్లి, ప్రకృతిలో జీవిస్తే, మీలో ఉన్న ఎన్నో అడ్డంకులన్నీ తొలగించుకోవచ్చు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించినప్పుడు అతను హిమాలయాలకో, మరో పర్వతానికో పోవడానికి కారణం అదే. కేవలం ప్రకృతిలో లీనమై అక్కడ జీవించడంతో మీ అహం నాశనమవుతుంది. సాధనలో సగ భాగం అదే.
ఒక సారి కేదార్ నాథ్‌కు పైన, హిమాలయాలలో కొందరు నాగా బాబాలను కలుసుకున్నాను. వారితో అక్కడ రెండు రోజులు కలిసి ఉన్నాను. వాళ్ల దగ్గర డబ్బు అయిపోయింది, ఆకలి, చలితో ఉన్నారు. రెండు రోజులపాటు వాళ్ల ఆహారాది అవసరాలు తీర్చాను, వాళ్లతో సమయం గడిపాను. నా వద్ద కేవలం ఒక ఉన్ని చొక్కా, ఒక టీషర్టు మాత్రమే ఉన్నాయి. అదృష్టవశాత్తు ఎవరో ఒక శాలువా ఇచ్చారు, అదొక వరప్రసాదం అయింది. ఆ శాలువా లేకపోతే నేను చలిలో గడ్డ కట్టుకుపోయేవాణ్ణి. ఎంత చలిగా ఉందంటే నా లోపల కూడా చలితో వణికిపోతూ ఉంది. నా పొట్టలో సంచి వణకిపోవడం కూడా నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ బాబాలు నగ్న సాధువులు, వాళ్లు కుట్టిన బట్టలేవీ ధరించరాదు. మరీ చలిగా ఉంది కాబట్టి ఒక శాలువా లాంటిది కప్పుకున్నారు. వాళ్ల కాళ్లకు చెప్పుల్లేవు, చాయ్‌కి కూడా వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. కుంభమేళాకు వెళ్లడం కోసం పొదుపు చేయగలిగిన కాస్తో కూస్తో వాళ్లు కాపాడుకుంటున్నారు.
ఆహరం కంటే కూడా వాళ్లకది(కుంభ మేళా) ముఖ్యం. వాళ్లు చేస్తున్న సాధన ఏమిటని నేను అడిగితే మేమేమీ చేయడం లేదని వాళ్లన్నారు. కేవలం నాగుల్లాగా తిరుగుతున్నామన్నారు. 12 ఏండ్ల పాటు హిమాలయాల్లో తిరగమనీ ఆ తర్వాతే వారికి దీక్షనిస్తాననీ వాళ్ల గురువు చెప్పాడు. ఇంత కఠినమైన జీవన పరిస్థితులు, క్రూరమైన వాతావరణంలో పన్నెండేళ్ల కాలం ఏకాగ్రతతో దీక్షపొందడం కోసం ఎదురు చూడగలిగినప్పుడు వాళ్లు అత్యున్నత స్థితికి చేరుకోకుండా ఎవరూ ఆపలేరు.
ఇందులో గురువు చేసేది పెద్దగా ఏమీలేదు – ఆయన దగ్గర వాళ్లకివ్వగలిగింది ఏమైనా ఉన్నా లేకపోయినా వాళ్లది సాధించే తీరతారు. ఎందుకంటే వాళ్లు తమనుతాము నిర్మించుకున్న పద్ధతి అది. వాళ్లకొక గురువు అవసరం లేదు. తరువాతి భోజనం ఎప్పుడు దొరుకుతుందో, అసలు దొరకదో తెలియకుండా దీక్ష పొందడం కోసమే భయంకరమైన చలిలో క్యూలో పన్నెండేళ్ల కాలం నిలబడే ఓర్పూ, సామర్థ్యమూ ఉన్న వ్యక్తికి, దక్కవలసింది తప్పక దొరుకుతుంది. అదే వారి సాధన.
తన దగ్గరికి వచ్చిన రోజునే ఆ వ్యక్తికి దీక్ష ఇస్తే అది వ్యర్థమేనని గురువుకు తెలుసు. మొత్తం అవకాశాన్నంతా అతను వృథా చేసుకుంటాడు. అందువల్ల ఆయన వందలాది మందిని పర్వత ప్రాంతాలకు పంపుతూ ఉంటాడు. బహుశా అందులో చివరిదాకా కొందరే మిగలవచ్చు – చాలామంది ఈ కఠిన పరిస్థితులకు తట్టుకోలేక పారిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో జీవించడం చాలా కష్టం. ఆ వ్యక్తి ఇది చేస్తాడా, లేదా అన్నది పక్కనబెడితే అది చేయడానికి సిద్ధపడడమే చాలు. సాధించడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడితే అతనది సాధించితీరతాడు. అదంత సాధారణం. అంటే మీరు సౌకర్యంగా ఉండకూడదని కాదు, కాని మీరు సౌకర్యమే కోరుకునేటట్లయితే సాధన విషయం మరచిపొండి. ఈ మార్గం నిజంగా మీకు పనికిరాదు.
ఇష్టాయిష్టాలకు ఆవల
వ్యక్తిగా మీకు మీరు విధించుకున్న పరిమితులన్నిటికీ మూలం మీ ఇష్టాయిష్టాలే. మీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా గమనించుకోండి; అది కొన్ని ఇష్టాయిష్టాల మూట అని మీకు అర్థమవుతుంది. జీవితపు ద్వంద్వాలకు, అజ్ఞాన తిమిరానికీ మీ బానిసత్వం నుండి ఉత్పన్నమైనవే ఈ ఇష్టాయిష్టాలు. ‘యోగ’ అన్న మాటకు అర్థమే ఈ ద్వంద్వాల నుండి బయట పడి సృష్టిలోని ఏకత్వాన్ని తెలుసుకోవడం. తనను బానిసగా చేసుకొనే ఈ ద్వంద్వాన్ని అధిగమించడంలో ప్రజలకి వివిధ సాధనాలు ఉపయోగపడతాయి. మీరు మీ అంతరాంతరాల్లో ఎక్కడో లోతుల్లో ఒకదాన్ని మంచిగానో, చెడుగానో గుర్తించడం వల్లే మీకు దీనిపై ఇష్టమో, అయిష్టమో ఏర్పడుతుంది. మీరు మంచి అన్నదాన్ని ఇష్టపడకుండానూ, మీకు చెడు అనిపించిన దాన్ని అయిష్టపడకుండానూ మీరు ఉండలేరు.
అందువల్లే భారతీయ సంస్కృతిలో అందం, వికారం, భయంకరం, ఆనందం, మంచి, చెడు అన్నీ కలగలిసిన ‘శివ’ అన్న వ్యక్తిని కల్పించుకున్నాం. ఆయన్ని అత్యున్నత స్థానంలో ఉంచాం. ఆయన్ని అంగీకరించడమంటే సర్వాన్నీ అంగీకరించడమే. ఇష్టాయిష్టాలన్న మీ పరిమితుల్ని మీరు అధిగమిస్తారు. తద్వారా మీ ద్వంద్వాలనీ అధిగమిస్తారు.