బ్రహ్మచారిలో నిగూఢశక్తి
ఈ వ్యాసంలో సద్గురు బ్రహ్మచర్య స్థితి మూలాలను తరచి చూసి, ఆ ప్రక్రియ గురించి, దాని ప్రభావం గురించి, ప్రయోజనం గురించి చర్చిస్తున్నారు.
ప్రశ్న: నమస్కారం, సద్గురు! హనుమంతుడూ, ఆది శంకరాచార్యుల లాంటి శక్తిశాలులు తమ జీవితకాలంలో ఎన్నో ఘనకార్యాలు చేయగలిగారు. వాళ్ళు ఆ ఘన కార్యాలన్నీ సాధించటానికి వాళ్ళ బ్రహ్మచర్యమే కారణం అంటూ ఉంటారు. నిజంగా బ్రహ్మచర్యం అంతటి శక్తిమంతమైనదా?
సద్గురు: మీరు బ్రహ్మచారి అయితే, అందులో గొప్ప విషయమేమంటే కనీసం ఒక జీవితం రక్షించబడుతుంది! అంటే సహజంగానే మీరు మీలాంటి వాడిని మరొకడిని పుట్టించరు. ఇవి అందరికీ గోచరమయ్యే ప్రయోజనాలు.
బ్రహ్మచర్యం అంటే ఏమిటి? 'బ్రహ్మాండం' అనే మాటకు రకారకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. సంగ్రహంగా చెప్పాలంటే, బ్రహ్మాండం అంటే అనంతంగా వ్యాపించి ఉన్న సృష్టి మూలం. బ్రహ్మ అంటే సృష్టికర్త కూడా. ఇక్కడి సంప్రదాయంలో, సృష్టికర్త అనేవాడు స్వర్గలోకంలో కూర్చొని ఉండేవాడు కాదు. సృష్టికర్త తనకు తానే సృష్టిలోని అణువణువులో అంతర్లీనమై ఉన్నాడు. ప్రతి పరమాణువులోనూ ఎక్కువ భాగం ఆయనే ఆక్రమించి ఉంటాడు. ఒక పరమాణువులో 99.99999 శాతం శూన్యమే (ఖాళీయే). అంటే పరమాణువులో దానికి సంబంధించిన వస్తురూపం 0.00001 శాతం కన్నా తక్కువే. మిగిలిందంతా శూన్యమే!
బ్రహ్మాండంలో కూడా ఇదే నిష్పత్తి కనిపిస్తుంది: 99.99999 శాతం శూన్యమే. నిష్పత్తి ప్రకారం చూస్తే, బ్రహ్మాండంలో ఉన్న నక్షత్రాలూ, గ్రహ వ్యవస్థలూ ఇవన్నీ చాలా తక్కువ సంఖ్య అనే చెప్పాలి బ్రహ్మాండంలో చాలా భాగం శూన్యమే. ఇది మన బుద్ధికి అలవాటయిన మామూలు తర్కంలో ఇమిడే విషయం కాదు. అందుకే ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ విచిత్రాన్ని వివరించాటానికి ఎంతో తంటాలు పడాల్సి వస్తుంది. దీన్ని అంధకార బంధురమైన శక్తి (Dark Energy) అని, విశాల శూన్యమని వాళ్ళు వర్ణిస్తారు. 'ఇది కేవల శూన్యం కానీ...' అంటారు వాళ్ళు.
మనం 'బ్రహ్మ' అన్నాం. దాన్నే వర్ణనాత్మకంగా చెప్పుకోవాలంటే, 'శివ' అంటాం. అంటే అది 'అ-వ్యక్తం' అని. సంభావ్యత విషయంలో మనం దానిని ప్రస్తావించినప్పుడు దానిని బ్రహ్మ అని పిలిచాం. దేనినయితే శివ అంటామో అది బ్రహ్మ అయింది. కేవలం ఒక విశాల శూన్యం, సృష్టికంతటికీ మూల కారణమైంది.
బ్రహ్మచర్యం అంటే, మీరు మిమ్మల్ని అల్పపరిమితులలో పట్టి ఉంచిన భౌతికతను పరిసమాప్తి చేసి, సృష్టికి ఆదికారణమైన బ్రహ్మ దిశగా కదులుతారు. సృష్టికి మూలకారణమైన దాన్ని మీరు ఛేదించుకు పోగలిగితే, అప్పుడు మీరు మనం 'శివ' అని ప్రస్తావించే తత్త్వం వైపు పయనిస్తారు. శివ అంటే 'ఏదయితే లేదో అది'.
మనం అక్కడికి వెళ్లాలనుకోవటం ఎందుకు? ఎందుకంటే, ఒకసారి మీరు ఏదైనా చట్రంలో ఇరుక్కుపోయారంటే, ఆ చట్రపు పరిమితులను అధిగమించిపోవాలని మీలో ఉన్నది సహజంగానే తపన పడుతుంది కనుక. మీ తపన ఆ చట్రం పరిమితులను పెంచేందుకు కాదు. పరిమితులు ఎంత పెద్దవైనా సరే, ఆ పరిమితులను దాటిపోవాలనే ఈ తపన. ఈ తపన హద్దులు లేని అనంతత్వం కోసం. సృష్టి చేయబడినది ఏదయినా సరే అది అనంతం కాలేదు. సృష్టి చేయబడనిదయితేనే ఎలాంటి పరిమితులు లేని అనంతత్వం పొందగలుగుతుంది. ఈ సృష్టి చేయబడని ఆ పార్శ్వాన్నే 'శివ' అంటాం.
రాకెట్ లాంటి శక్తి
బ్రహ్మచర్యం అంటే సృష్టికి మూలకారణమైన బ్రహ్మాండాన్ని చేరేందుకు మీరు ఏర్పరచుకొన్న మార్గం. దానీతో 'శివ' అనే ఒక పరిధులే లేని పార్శ్వంలోకి ప్రవేశించాలని మీ ఆకాంక్ష. మీరు 'బ్రహ్మ', 'శివ' లాంటి పదాలు వాడితే, చాలామంది ఆ పదాలు ఒక మతానికి సంబంధించినవనుకొంటారు. అది సరి కాదు. ఆ పదాలు ఈ దేశపు సాంప్రదాయికమైన భాషలోని పదాలు.
బ్రహ్మచర్యానికి సంబంధించి మరో పార్శ్వాన్ని ఇలా చెప్పుకోవచ్చు. మీరు రాకెట్లో ప్రయాణానికి కూర్చున్నారంటే,ఇప్పుడు మీకు ఉన్న పరిమితులనన్నిటినీ బద్దలు చేసి, మరొక కక్ష్యను, దశను చేరుకోవాలని మీ కోరిక అన్న మాట. అందుకు చాలా పెద్ద మోతాదులో ఇంధనం కావాలి. రాకెట్ పైపైకి పోయిన కొద్దీ అది తన బరువు తగ్గించుకొంటూ వెళుతుంది. అలా బరువు తగ్గించకపోతే, అది గమ్యస్థానం చేరేందుకు దానిలో ఉన్న ఇంధనం సరిపోదు.
మీరు మీ ఆఫీసుకు వెళ్లాలనుకోండి. మీరు ఒక టీవీయస్ మోపెడ్ ఎక్కి వెళ్లవచ్చు. లేదంటే ఒక కారులో అయినా వెళ్లవచ్చు, కానీ ఎక్కువ ఇంధనం కావాల్సి ఉంటుంది. మీరు హెలికాప్టర్లో కూడా వెళ్లచ్చు. అది మరింత ఎక్కువ ఇంధనం వాడేస్తుంది. కానీ మీరు ఒక రాకెట్ ఉపయోగించాలనుకుంటే, ఆ రాకెట్ ఇంతకు వెయ్యి రెట్లు ఎక్కువ ఇంధనాన్ని భూమి మీద నుంచి ఇంకా పైకి ఎగరక ముందే ఖర్చు చేసేస్తుంది. అయితే, మీరు ఆఫీసు కెళ్ళటానికయితే రాకెట్ వాడరు. రాకెట్టును వాడేది దాని పరిమితులనన్నిటినీ ఛేదించుకొని మరొక మండలంలోకి ప్రవేశించేందుకు.
అలాగే మీరు కేవలం ఆఫీసుకు వెళ్ళటం, తిరిగిరావటం, వచ్చి 'అది బాగాలేదు, ఇది బాగా లేదు' అని సణగటం కోసమే అయితే, మీకు కొద్దిపాటి శక్తి సరిపోతుంది. కానీ మీరు బ్రహ్మాండాన్ని చేరటమే కాక, దాన్ని మిమ్మల్ని దివ్యత్వానికి చేర్చే మార్గంగా కూడా వాడుకోవాలని వాంఛిస్తుంటే, మీకు బోలెడంత శక్తి కావాలి. మీకు అంతటి శక్తి కావాల్సివచ్చినప్పుడు, మీరు మీ జీవితంలో మీ శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తున్న వ్యాపకాలు ఏమున్నాయో గమనించుకొని, వాటన్నింటినీ తగ్గించుకోవాలి. మీరు ముందుకు పోతున్న కొద్దీ, సాధ్యమైనంత బరువును తగ్గించుకొంటూ వెళ్ళాలి. మీ ఆలోచనలూ, మీ భావజాలాలూ, మీ సర్వస్వమూ క్రమంగా వదిలించుకొంటూ వెళ్ళాలి.
పార్వతి సాధన
మీరు పార్వతీదేవి చేసిన సాధనల గురించి వినే ఉంటారు. పార్వతీదేవి ఒక రాజకుమారి, కానీ ఆమె శివుడిని పెళ్లాడాలనుకొన్నది. శివుడు ఆమెను తోసిపుచ్చాడు. 'ఎవరైనా మంచి మొగుడిని చూసుకో. నీకు కావాల్సింది ఒక మంచి మొగుడు' అన్నాడు. ఆమె 'అలా వీలు లేదు నేను మిమ్మల్ని ప్రలోభ పెడతాను' అంది. ఆయన ముందు అద్భుతమైన దుస్తులు ధరించి తిరగి తన అందాన్ని ప్రదర్శించటం వల్ల ఉపయోగం ఉండదని ఆమెకు తెలుసు. ఆయనను ఆకర్షించేందుకు కావాల్సింది కఠోరమైన సాధన అని కూడా ఆమెకు బాగా తెలుసు. అందుకని ఆమె తపస్సులో కూర్చొంటుంది. శివుడు ఆమెను చూశాడు గానీ ఏ మాత్రం లక్ష్యపెట్ట లేదు. ఊరికే 'ఓం నమః శివాయ' అనుకొంటూ ఆమె చేసే సాధన ఆయనకు ఏ మాత్రం అర్ధం లేనిది.
“నేను నా శరీరం మీద ఇంత అభిమానం చూపుతున్నాననీ, ఈయన నన్ను చూసి పరిహాసం చేస్తున్నాడు. శరీరాన్ని దుస్తులతో కప్పి, శరీర పోషణ కోసం ఆహారం స్వీకరిస్తాననీ ఈయనకు నా మీద చులకన భావం!” అని ఆమె గ్రహించింది. దాంతో, ఆహారం స్వీకరించటం మానేసింది. శరీరాన్ని నిలిపి ఉంచటానికి రోజుకు రెండు ఆకులు మాత్రం తినసాగింది. మరో రెండు ఆకులతో శరీరాన్ని కప్పుకోసాగింది. ఆ కారణంగానే ఆమెకు 'ద్విపర్ణ' అని పేరు వచ్చింది. ఆమె తల్లి మీనాదేవికి మాత్రం కూతురు వెళ్ళి అలా అడవిలో కూర్చొని, శరీరాన్ని పూర్తిగా శుష్కింప జేసేసుకొంటుంటే రక్తపోటు పెరిగిపోతుంది. ఇలా అస్థిపంజరంలాగా అయిపోతే, ఈ అమ్మాయికి పెళ్లి చేయటం ఎలా? కూతురు బట్టలు వదిలేసి ఆకులు ధరించటం మీనాదేవికి మరో చింత అయి పోయింది.
శివుడి ధోరణిలో మాత్రం ఇప్పటికీ ఏ మార్పూ లేదు. దాంతో, పార్వతి ఒక ఆకు వదిలి వేసింది. ఆమె ఒకే ఆకుతో భుజిస్తూ మరొక ఆకుతో శరీరాన్ని కప్పుకోసాగింది. ఇప్పుడామె 'ఏకపర్ణ'. అయినా శివుడు ఆమెను పట్టించుకోలేదు. అందుచేత, ఇక ఆమె ఆ ఒక్క ఆకు కూడా తినటం మానేసింది, తన శరీరాన్ని కప్పేఆకును కూడా వదిలి వేసింది. పూర్తిగా ధ్యాన నిమగ్నురాలై అలా కూర్చొండిపోయింది. ఇప్పుడామె 'అపర్ణ'- ఇప్పుడు ఎటువంటి ఆకులు లేవు. శరీరాన్ని నిలిపేందుకూ, కప్పేందుకూ ఎలాంటి ఆధారమూ లేదు. అన్ని వలయాలనూ ఆమె ఛేదించేసింది. బ్రహ్మచర్యం అంటే అది! ఆ తరవాత ఆమె పెళ్లి చేసుకొన్నది. అది వేరే విషయం.
భౌతికత్వపు పరిధులూ, సరిహద్దులూ అధిగమించటం
బ్రహ్మచర్యం అంటే అలా అన్ని వలయాలనూ ఛేదించుకు వెళ్ళేందుకు సరిపోయేలా మీ శక్తిని పెంచుకోవటం. భౌతిక అవసరాల వంటివి మిమ్మల్ని ఏ రకంగాను వెనకకు లాగే అవకాశం లేనంతగా శక్తి పెంచుకోవటం. శక్తిని ఊరికే వ్యర్థం చేసే వ్యాపకాలన్నీ వదిలించుకోవటం. ఇది రాకెట్లో ఇంధనం వాడకం లాగా. రాకెట్లో ఇంధనం వల్ల వచ్చే శక్తి అంతా ఒకే లక్ష్యం కోసం వినియోగించబడుతుంది. అందుకే రాకెట్ అలా పైపైకి దూసుకుపోగలుగుతుంది. ఇంధనం వాడకం వల్ల వచ్చిన శక్తి అయిదారు భిన్న దిశలలో వెళ్ళి వ్యర్థమైపోతే, రాకెట్ ఎక్కడికీ వెళ్లలేదు. మీ విషయంలోనూ అంతే. శక్తి అంతటినీ ఒక దిశ వైపే ఏకోన్ముఖం చేయగలిగితే, మీరు ఏదయినా గమ్యానికంటూ చేరగలుగుతారు. అది అయిదు విభిన్న గమ్యాల వైపు చెదిరిపోతున్నదంటే, దానికి ఏ గమ్యమూ చేరే ఉద్దేశ్యం లేనట్టే.
రామాయణంలోనూ, మహాభారతంలోనూ కొన్ని కొన్ని కథలు కనబడతాయి. వాటిలో ఒకరిని చంపటానికి ప్రయత్నిస్తే, అతని రక్తపు బొట్టు నేల మీద పడినప్పుడల్లా మరొక యోధుడు పుట్టుకొస్తుంటాడు. వంద నెత్తురు చుక్కలు నేలమీద పడితే, వంద మంది పుట్టుకొస్తారు. అంటే, ఆ మనిషి తన శక్తిని ఎంత పెంచుకోగలిగాడో చూడండి. వాడి ఒక్కొక్క నెత్తురు చుక్క, ఒక వీర్యకణం లాగా పని చేస్తున్నది కనక ప్రతి చుక్క నుంచి ఒక్కొక్క యోధుడు పుట్టుకొస్తాడు. జీవితంలో ఈ (బ్రహ్మచర్య) స్థితి కి సంబంధించిన విశిష్టత ఇది.
ఒక్క కణం ఒక మానవుడిని పుట్టించ గలిగిందంటే, దాని శక్తి నిజంగా అపారమే అయ్యుండాలి. మీరు పైపైకి దూసుకు పోయి భౌతిక పరిమితులను అధిగమించాలంటే, అంత అపార శక్తి గలిగిన దాన్ని గొప్ప ఇంధనంగా మార్చుకోవాలి. అలా అధిగమించగలగటమే ఒక గొప్ప శక్తి. మీరు మీ భౌతిక పరిమితులు అధిగమించగోరితే, మీ శరీరాన్ని పూర్తిగా విభిన్నమైన పద్ధతిలో వినియోగించుకోవాలి. బ్రహ్మచర్యం అందుకోసమే. బ్రహ్మచర్యానికి ఇతర పార్శ్వాలు కూడా చాలా ఉన్నాయన్నది వేరే విషయం.
ప్రేమాశీస్సులతో,