విశ్వాసం లేనిచోట విశ్వాసాన్ని కల్పించడమెలా? ఏసుక్రీస్తు జీవితం నుండి ఒక ఉదాహరణ తీసికొని విశ్వాసం మీరు కల్పించేది కాదని, దానికి అనుగుణమైన పరిస్థితులను ఏర్పరచే ప్రయత్నం మీరు చేయవచ్చునని సద్గురు వివరిస్తున్నారు.

ప్రశ్న : సద్గురు, నాకెన్నో సందేహాలున్నాయి. నేను విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోగలను?

సద్గురువిశ్వాసం అనేది మీరు పెంపొందించుకునేది కాదు. అది కలిగితే కలుగుతుంది, కలగకపోతే కలగదు. అంటే దానికోసం మీరేమీ చేయవలసిన అవసరం లేదనీ, ఏదో ఒకరోజు అది ఆకాశం నుండి మీమీద పడుతుందనీ అర్థమా? కాదు, ఈ సృష్టిలో మీరు జీవితంలోని ములికమైన విషయాలను అర్థం చేసుకుంటే, ఏదైనా జరగాలంటే దానికి సరైన పరిస్థితులు కల్పించాలని మీరు తెలుసుకుంటారు.

మీరు పత్తి పండించాలంటే పత్తి మొక్క దగ్గర కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తే సరిపోదు. పత్తి పండించడానికి సరైన పరిస్థితులేమిటో మీరు తెలుసుకోవాలి. నేల ఎలా ఉండాలి, ఎరువు ఎలా ఉండాలి, వాతావరణం ఎలా ఉండాలి, నీళ్లెలా ఉండాలి మొదలైనవన్నీ. ఇటువంటి పరిస్థితులన్నీ మీరు తెలుసుకొని వాటిని కల్పిస్తే పత్తి పెరుగుతుంది.

సృష్టి జరగడానికీ ఆధారం ఇదే - సరైన పరిస్థితులు కల్పిస్తే అది జరుగుతుంది. సరైన పరిస్థితులు కల్పించకపోతే మీరెంత కష్టపడ్డా అది జరగదు. అందువల్ల విశ్వాసం ఏర్పడాలంటే ముందు దానికి అనుగుణమైన పరిస్థితులను కల్పించాలి.

మీరు విశ్వాసపాత్రులుగా ఉండగలరా?

విశ్వాసానికి ఉండవలసిన పరిస్థితులేమిటి? ఏసు క్రీస్తు ఇలా  చెప్పాడు, ‘‘రండి, నన్ను అనుసరించండి’’. ఇదే ఆయన ప్రాథమిక బోధన. ఆయన ఇలా చెప్పినప్పుడు నాటి గొప్ప పండితులు, మేధావులు, విద్యావంతులు, శక్తిమంతులు ఆయన్ను అనుసరించలేదు. కేవలం మత్స్యకారులు, రైతులే ఆయన్ను అనుసరించారు. ఆలోచించే మేధావులు ఎవరినీ అనుసరించలేరు. అతిసాధారణులు, అమాయకులే ఆయన్ను అనుసరించగలిగారు.

మీరు శారీరకంగా దృఢమైన వాళ్లయితే, లేదా చాలా శక్తిమంతులమనే భావన ఉంటే, మీలో నిండుగా భావోద్వేగాలుంటే వాటినే ఉపయోగిద్దాం.

విశ్వాసం కేవలం అమాయకులకే. కాని ఆధునిక విద్య మీలో ప్రవేశించగానే మీ బుద్ధి ఆలోచించేదిగా, ప్రశ్నించేదిగా, సందేహించేదిగా తయారయింది. ఈ బుద్ధితో మీరు విశ్వాస మార్గాన్ని అనుసరించలేరు. అంటే విశ్వాసం అసాధ్యమని కాదు, కాని మీ దగ్గర లేని దానితో మొదలుపెట్టకండి. మీ దగ్గర ఇప్పుడు ఏమి ఉన్నదో దానితోనే మొదలుపెట్టండి. మీలో ఏది ప్రబలంగా ఉందో దానితో మొదలుపెట్టండి. మీరు ఆలోచించే వ్యక్తులయితే దాన్నే ఉపయోగించండి. మీరు శారీరకంగా దృఢమైన వాళ్లయితే, లేదా చాలా శక్తిమంతులమనే భావన ఉంటే, మీలో నిండుగా భావోద్వేగాలుంటే వాటినే ఉపయోగిద్దాం. కాని ఈ నాల్గింటినీ పెంపొందించుకోవాలి, ఉపయోగించుకోవాలి.

శకలాలు కావడం

మీరు భక్తిగా  ఉండాలని ప్రయత్నిస్తే, అది నిజమైన భక్తి కాదు. కాని మీరు ఒక నిర్దిష్టస్థాయి అనుభవాన్ని చేరుకుంటే భక్తి సహజంగానే మీలో భాగమైపోతుంది. విశ్వాసం అనేది మీలో ఉన్నదే. అది మీలోని అంతర్గత లక్షణం, అదేదో మీరు కొనితెచ్చుకునేదికాని, మీరు విశ్వసించే వస్తువుకాని కాదు. విశ్వాసం అనేది మీరు సృష్టిలోకి మళ్లీ వెళ్లిపోవడం - వ్యక్తిగా కాకుండా,  సృష్టిలో మీరొక సాధారణమైన చిన్న తరంగమైపోతారు - ఈ క్షణంలో అది పైకి లేస్తుంది, మరుక్షణంలో అది కిందపడుతుంది. మీరిక్కడ ఒక క్షణిక సంఘటన మాత్రమేనని మీరర్థం చేసుకుంటారు, అనుభూతి చెందుతారు. అదొక మేధాపరమైన అనుభూతికాదు, మీరు ఈ భూమి మీద మొలిచిన చిన్న మొక్క అని మీకు మీరే ఒక సజీవమైన  అనుభూతిని పొందడం. ఇదొక సజీవ అనుభవమైనప్పుడు మీరే విశ్వాసం. అప్పటివరకూ విశ్వాసం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.

మీరు మాట్లాడుతున్న విశ్వాస పాత్రత కేవలం విధేయత మాత్రమే విధేయత గురించి మాట్లాడే వ్యక్తులకు ఎప్పుడూ స్వార్థం ఉంటుంది. మిమ్మల్ని విధేయులుగా కట్టి పడేసుకోవడమే వాళ్ల లక్ష్యం. విశ్వాసం అన్నది మిమ్మల్ని పట్టుకొని ఉంచుకోవడానికి సాధనం కాదు - విశ్వాసం మిమ్మల్ని విముక్తుల్ని చేసేది. విశ్వాసం అన్నది ఈ బృందానికో, ఆ బృందానికో వర్తించేది కాదు - మీరు ఈ సృష్టిలో భాగం కావడానికి. అది మీరు చేసేదికాదు, మీరు అయ్యేది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు 

www.pexels.com