దీర్ఘకాలిక వ్యాధికి కారణం - ఒక విష పాషాణం
మనం చేసే ఆలోచనలు ఇంకా భావోద్వేగాల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఎలా సంభవిస్తాయనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు, అలాగే అవి మన శరీరంలోని రసాయనికతని ఎలా విషపూరితం చేస్తాయో కూడా వివరిస్తునారు.
ప్రశ్న: సద్గురు, మీరు ఇంతకు ముందు, 70 శాతం అనారోగ్యాలు, కేవలం మనస్సు వల్ల సృష్టించబడినవే అని అన్నారు. అయితే, అందుకు కారణమయ్యే భావోద్వేగ, ఆలోచనా ధోరణి ఏమై ఉంటుంది, దాన్ని ఎలా సరి చేయాలి?
సద్గురు: మీరు ఫ్రాయిడ్ శిష్యుడిలా ఉన్నారు. ఆధునిక మానసిక విశ్లేషణకి పితామహుడిగా చూడబడే ఈ వ్యక్తి, ఎంత డొల్లగా ఉన్నాడు అనేదాన్ని చూపించే కొన్ని ఉత్తరాలు ఇటీవలే బయటపడ్డాయి. దీనితో వ్యవహరించే మార్గం ఇది కాదు.
మీకు ఒక తేలికైన పోలిక చెప్పాలంటే- ఉదాహరణకి మీ కుడి చేయి వింత చేష్టలు చేస్తుంది అనుకుందాం. అది మిమ్మల్ని కొడుతూ, గొంతు పిసుకుతూ, ఇలా ప్రతిరోజూ మిమ్మల్ని హింసిస్తూ ఉంటే - ఇది ఒక అనారోగ్యం కాదా? ఖచ్చితంగా అది అనారోగ్యమే. మీ మనస్సు చేస్తున్నది సరిగ్గా అదే. అది వింతగా ప్రవర్తిస్తుంది, మిమ్మల్ని నొప్పిస్తుంది, మిమ్మల్నిపొడుస్తుంది, ఏడిపిస్తుంది, బాధ పడేలా చేస్తుంది - ఇది అనారోగ్యం కాదా? కానీ చాలా మంది మీలానే ఉన్నారు - మీరు జబ్బుమనుషుల సైన్యాన్ని ఏర్పాటు చేయవచ్చు. మీ ఎదురుగా ఒక పెద్ద సైన్యం ఉన్నప్పుడు, వారు రోగిష్టివాళ్లు అయినా కాకపోయినా, వారితో వాదించడంలో ఉపయోగం ఉండదు- వాళ్లకి నమస్కరించి, ముందుకు వెళ్ళడమే. చాలా మంది జ్ఞానోదయం పొందిన వారు చేసినది ఇదే - వారు అలా కళ్ళు మూసుకుని కూర్చున్నారు.
అనారోగ్యం భౌతిక శరీరంలో అనేక విధాలుగా వ్యక్తమవుతుంది. ప్రతి ఆలోచన, మానసిక స్థాయిలో చోటుచేసుకునే ప్రతి ప్రకంపమూ కూడా, మీలోని రసాయనిక సమతౌల్యాన్ని మారుస్తుంది. మీరు పులుల గురించి ఆలోచిస్తున్నారు అనుకుందాం, ఒక రకమైన రసాయన మార్పు జరుగుతుంది. మీరు పువ్వుల గురించి ఆలోచిస్తే, మరొక రకమైన రసాయన మార్పు జరుగుతుంది. మీరు సృష్టించే ఆలోచనల రకాన్ని బట్టి, మీరు నీచమైన ఇంకా విషపూరితమైన ద్రావకాన్ని ఉత్పత్తి చేయవచ్చు.
మీరు రోజూ ఈ విషపూరిత ద్రావకంలో తడుస్తూ ఉంటే, బాగుండడం అనేది ఎలా సాధ్యపడుతుంది? ఈ రోజున, మనం తినే దానిపైన, త్రాగే దానిపైన, మనం పీల్చుకునే దానిపైన మనకి నియంత్రణ కొంత మాత్రమే ఉంది - అవి అన్నీ కూడా ఎంతో కొంత విషపూరితం చేయబడి ఉన్నాయి. ప్రపంచం మిమ్మల్ని ఏదో ఒక విధంగా విషపూరితం చేయడానికి ప్రయత్నిస్తోంది, కానీ మీరు పారిశ్రామిక సహాయానికి తోడుగా, స్వయం సహాయాన్ని కూడా కలిగి ఉంటే, మీరు ఎంత కృషి చేస్తున్నారు అన్నదాన్ని బట్టి, మీరు విజయం సాధిస్తారు. మీకు తెలుసు కదా, “స్వయం సేవ అన్నింటికన్నా ఉత్తమమైన సేవ”, అని.
ప్రాచీన సమాజాలలో ఎప్పుడూ కూడా వ్యాధి అనగానే, ఎక్కడో ఏదో తేడా వచ్చిందని భావించేవారు - ఒక మనిషి ఎప్పుడూ కూడా అనారోగ్య స్థితిలో ఉండకూడదు. కానీ ఆధునిక సమాజాలు వ్యాధిని సాధారణమైనదిగా పరిగణిస్తున్నాయి, ఎందుకంటే దానిపైబడి అభివృద్ధి చెందుతున్న ఒక పూర్తి పరిశ్రమే ఉంది. ఈ గ్రహం మీద ఉన్న అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి మందుల కంపెనీలు, అంటే అర్థం విష రసాయనాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి అని. ప్రతిరోజూ, మీరు దానిని చక్కగా చేయడానికి దానిలో ఏదైనా వేస్తూ ఉండాలి. మీరు సుముఖంగా ఉంటే, బాహ్య రసాయనాలు లేకుండానే, మనము దీనిని(మనలోని రసాయనాన్ని) అద్భుతమైన పానీయంగా మార్చుకోవచ్చు. ఒకసారి మీ రసాయనికత అద్భుతమైన స్థితిలో ఉంటే, ఇక ఆనందంగా ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. ఆ విధంగా, ఈ గ్రహం పైన 70% వ్యాధులను మాయం చేయొచ్చు. మిగిలిన 30% జబ్బుల విషయంలో, చాలా బాహ్య ప్రభావాలు ఉన్నాయి, అవి ఎల్లప్పుడూ మీ నియంత్రణలో ఉండవు. కానీ మీరు లోపలి నుండి తయారు చేసుకుంటున్నవి మాత్రం, నూరు శాతం మీ నియంత్రణలోనే ఉండే అవకాశం ఉంది.
మీరు నిరంతరం మీలో ఒక దుష్ట రసాయనికతని సృష్టిస్తుంటే, మీలో ఉన్న జీవానికి మీరు మీ శ్రేయస్సుని కోరుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? అది మీకు రోగాలంటే ఇష్టంలా ఉందనుకుని, మీకు వాటినే ఇస్తుంది. కొంతమందికి బలమైన వ్యవస్థ ఉండవచ్చు, అది చాలా దెబ్బలను తట్టుకోగలిగి ఉండొచ్చు - కొంతమంది మొదటి దాడిలోనే పడిపోతారు. కానీ మీరు సృష్టించే ఆలోచనలు ఇంకా భావోద్వేగాల ద్వారా మీ వ్యవస్థను లోపలి నుండే విషపూరితం చేస్తుంటే, వెంటనే అయినా లేదా మెల్లగా అయినా, అది తప్పకుండా మీపై దుష్ఫలితాన్ని చూపిస్తుంది.
ప్రేమాశీస్సులతో,
సద్గురు
Editor’s Note: Isha Kriya is a simple but powerful 15-minute guided meditation available online. Daily practice of Isha Kriya brings health, dynamism, peace and wellbeing. It is a powerful tool to cope with the hectic pace of modern life.
This article is based on an excerpt from the May 2014 issue of Forest Flower. Pay what you want and download. (set ‘0’ for free). Print subscriptions are also available.