దేవుడిని గురించి, మీకున్న నిర్ధారణలన్నీ వదిలేయండి
సద్గురు, మత విశ్వాసాల మూలాల్ని ప్రశ్నిస్తూ, చిత్త శుద్ధిగల అన్వేషకులను ఈ విశ్వాసాలకు అతీతంగా వెళ్లి, అంతరంగ పరిణామం కోసం చూడమంటున్నారు.
సద్గురు : ఒక వ్యక్తికి, తన నమ్మకాల వ్యవస్థ నుండి బయటకి వచ్చి, జీవితంలోని మౌలిక విషయాల గురించి కూడా తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడానికి అపారమైన ధైర్యం కావాలి. మీకు రెండు చేతులున్నాయని మీరు నమ్ముతున్నారా లేదా రెండు చేతులున్నాయని మీకు తెలుసా ? వాటిని చూడటానికి మీరు మీ కళ్ళు ఉపయోగించనప్పటికీ, మీకు రెండు చేతులున్నాయని మీకు తెలుసు. అది అనుభవ పూర్వకంగా విదితమే. కానీ దేవుని విషయానికి వస్తే, మీకు, నమ్మమని చెప్పారు; దివ్యత్వాన్ని అన్వేషించమని ఎవరూ చెప్పలేదు. ఒక దాన్ని నమ్మడం, మిమ్మల్ని పరివర్తన చేయలేదు. అయినప్పటికీ అది మీకు అనుభవపూర్వకమైతే, అది మిమ్మల్ని సంపూర్ణంగా పరివర్తింప చేస్తుంది. ఒకవేళ మీరు పుట్టినప్పటినుండి, నా చిటికెన వేలు దేవుడని చెప్తూ, నేను నా చిటికెన వేలు చూపెడితే, మీలో దైవిక భావాలు వస్తాయి. మీరు పుట్టినప్పడి నుండి, నా చిటికన వేలు ఒక దయ్యం అని బోధిస్తే, నా చిటికెన వేలు చూపగానే, మీలో భయం పుడుతుంది. అది మీ మనసు యొక్క స్వభావము.
మీ మనసు చేసిన నిర్ధారణలకు ప్రాముఖ్యత లేనే లేదు. ఒక పరికరంగా, సరే, కానీ పరమోత్తమ జ్ఞానంగా దానికి అర్థమే లేదు, ఎందుకంటే అది ఈ రోజు ఒక విధంగా, రేపు మరొక విధంగా ఉండవచ్చు; మనసు ఒక నిశ్చియమైన రూపంలేని ద్రవం లాంటిది, మీరు దానితో ఏదైనా చేయవచ్చు. దాని రూపం, దానిని ఎలా ప్రభావితం చేసామన్న దానిపై ఆధార పడి ఉంటుంది. లోతుగా చూస్తే, మీరు "నా మనసు" అని పిలవ బడేది, మీ చుట్టు పక్కలున్న వేలాది మంది నుండి సంగ్రహించినది. ఈ మనసు మీరు కొద్ది కొద్దిగా పోగు చేసుకున్నారు. మీ మనసు - మీరు ఏ విధమైన కుటుంబం నుండి వచ్చారు, మీ విద్య, మతము, ఏ దేశము లేదా సమాజానికి చెందిన వారు ఇంకా మీరు నివసించే లోకం, అనే వీటన్నిటి ఆధారంగా ఉన్న - మీ నేపథ్యం.
మీ మేధస్సు అనేది కేవలం బతకడానికి ఒక సాధనమే, మీ జీవితంలో ఒక పరిమితమైన అంశం. బతకడమనేది అవసరమే, కానీ సంతృప్తి పరచేది కాదు. జీవితంలోని గంభీర విషయాలకు వెళ్లాలంటే, ముందు మీకు అవసరమైన పనిముట్లు కావాలి. ప్రస్తుతానికి మీరు జీవితాన్ని పంచేద్రియాల ద్వారా అనుభూతి చెందుతున్నారు - చూడటం, వినడం, స్పర్శించడం, రుచి చూడ్డం, వాసన చూడటం ద్వారా. ఈ పంచేద్రియాల ద్వారా భౌతికానికి అతీతమైన వాటిని గురించి మీరు తెలుసుకోలేరు. మీరు సముద్ర గర్భ లోతుల్ని ఒక కొలబద్దతో కొలవలేరు. ప్రస్తుతానికి ప్రజలతో అదే జరుగుతోంది. వారు అవసరమైన పనిముట్లు లేకుండా జీవితంలో లోతయిన విషయాలను తెలుసుకోగోరుతున్నారు. కాబట్టి తప్పుడు నిర్ధారణలు చేస్తున్నారు.
ప్రజలు నిర్ధారణలు చేసేందుకు త్వరపడుతున్నారు, ఎందుకంటే, ఒక నిర్ధారణ లేకుండా వారికి తమదైన సత్తా లేదు. మీరు "నేను" అనే వ్యక్తిగాని లేదా వ్యక్తిత్వంగాని, మీరు జీవితం గురించి చేసుకున్న నిర్ధారణల మూట. మీరు ఏ నిర్ధారణ చేసుకున్నప్పటికీ, మీరు చేసేది తప్పే అవుతుంది. ఎందుకంటే జీవితం అనేది మీరు చేసే ఏ నిర్ధారణలోనూ ఇమడదు కనుక.
దాన్ని సులువుగా చూడటానికి, ఒక మానవుడిని తీసుకోండి. ఒక ఇరవై సంవత్సరాల క్రితం మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు అతను చేస్తున్నది మీకు నచ్చ లేదనుకోండి. మీరు అతను మంచి వ్యకి కాదని నిర్ధారణ చేసుకున్నారు. అదే వ్యక్తిని ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోజు కలిశారనుకోండి, అతను అత్యద్భుతమైన వ్యక్తిగా మారి ఉండవచ్చు, కానీ మీ మనస్సు అతను ఉన్న ప్రస్తుత స్థితిని అనుభూతి చెందనీయదు. ఒక సారి మీరు నిర్ధారణ చేసుకున్నట్లయితే, మీ పురోగతిని మీరు ఆపినట్లే. మీరు జీవితంలోని అన్ని సంభావ్యతలను నిలిపివేసి, జీవితాన్ని ధ్వంసం చేసుకున్నట్లే.
ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే త్వరగా మరేవో నిర్ధారణలకు రావడం కాదు. మీరు ఎప్పుడయితే ఏ నిర్ధారణలు లేకుండా ఇక్కడ ఉండటానికి సాహసిస్తారో, ప్రతి క్షణం గమనించడానికి సుముఖంగా ఉంటూ, ఈ విశ్వంలో కేవలం ఒక అణువుగా ఉండటానికి ఇష్టపడితే, అప్పుడు ఈ విశ్వం యొక్క అనంతత్వం తెలుసుకుంటారు.
ప్రేమాశీస్సులతో,