సద్గురు: భారత సంస్కృతిలో ఒక అందమైన పిట్ట కథ ఉంది. ఒక మనిషి, తాను ఒక చెట్టుకొమ్మ మీద కూర్చొని, అదే కొమ్మను మరొకవైపు నుంచి నరుకుతూ ఉంటాడు. ఒకవేళ అందులో అతను కనుక సఫలం అయితే అతను జీవితంలో విఫలం అవుతాడు. ప్రస్తుతం ఈ భూగ్రహం మీద మన ఆర్ధిక-వ్యవస్థ, ఈ విధంగానే ఉంది. అది కనుక సఫలమైతే, మనమందరం విఫలం అవుతాం. అది సఫలం అవ్వకూడదని మనందరం ప్రార్థించవలసిరావడం అన్నది ఎంత దురదృష్టం..?! కానీ, ఈరోజున మనం ఉన్న పరిస్థితి అదే.

ఈ గ్రహం మీద మనం ఎవరితోనో ఏవో లావాదేవీలు జరపడం లేదు, మనందరం ఒకరికి-మరొకరం ఓ పొడిగింపు లాంటి వారం మాత్రమే అన్న విషయాన్ని ఎంతోమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం, సామాజిక పరంగా కొన్ని లావాదేవీలు నడిపిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ, జీవితం విషయానికి వచ్చేసరికి, ఇదంతా కూడా జీవమే - ఒకటి మరోకదాని నుంచి విడిపడి లేదు. మీరు నా శరీరం అని దేనినైతే అంటున్నారో, అది ఈ భూమిలో ఒక చిన్న తునక మాత్రమే. దురదృష్టవశాత్తూ; ఎంతోమంది వారిని భూమిలో పూడ్చిపెట్టేవరకూ, ఈ విషయం గ్రహించడం లేదు.

దానికి కొద్దిగా ఇంగిత జ్ఞానం, అందరిపట్ల కొద్దిపాటి ప్రేమ ఉంటే సరిపోతుంది.

మీకు ఒక ప్రత్యేకమైన అస్థిత్వం ఉందన్న అభిప్రాయం కేవలం మీ మనో చట్రంలో మాత్రమే ఉంది. భౌతికంగా మీకు అలాంటి అస్థిత్వం అంటూ ఏదీ లేదు. ఒక జీవశక్తిగా చూస్తే, మీకూ ఈ సృష్టిలో ఉన్న తక్కిన వాటికీ ఎటువంటి బేధం లేదు. మీరు, ఈ సృష్టిలో ప్రతిదానితోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఈ విషయాన్నే, ఈరోజున ఆధునిక శాస్త్రవేత్తలు మనకు నిరూపిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్నదంతా ప్రతీక్షణం ఒక్కటిగానే(ఒకదానికొకటి సంబంధంలో) ఉన్నదని భౌతికశాస్త్రం చెప్తోంది. కానీ ఈ విషయం మనం అనుభూతి చెందవలసినది. అంతేకానీ, ఇలా మనం నిర్ధారణలకి వస్తే, అది  ప్రజలు పిచ్చిపనులు చేసేందుకు దారి తీస్తుంది. మీరు, దానిని అనుభవపూర్వకంగా చేరుకున్నట్లయితే, అదే ఒక పరిష్కారం.

ధ్యానించే నాయకత్వం

అమెరికాలో కొంతమంది పర్యావణవేత్తలు, నన్ను “సద్గురు మనం చెయ్యవలసినది ఏమిటీ..? మనందరం ఏదో చేస్తున్నాం. కానీ; అది పని చెయ్యడం లేదు” అని అన్నారు. అందుకు నేను “మన ప్రపంచంలో ఉన్న నేతృత్వం ధ్యానం చెయ్యాలి” అన్నాను. మనం ధ్యానం చెయ్యడం అని అనగానే; పాశ్చాత్యులు వెంటనే.. “నేను దేనిమీద ధ్యానం చెయ్యాలీ..? ఈ చెట్టు మీదా..?, ఈ గ్రహం మీదా..?, ఈ సృష్తి మీదా..?” అని అడుగుతారు. ధ్యానం అన్నది, దేనికో సంబంధించిన విషయం కాదు. ధ్యానం అంటే, మీ పునాదుల్ని మీరు కదిలించుకోవడమే..! ప్రస్తుతం, ఈ సృష్టి నుంచి మిమ్మల్ని మీరే వేరు చేసుకుంటూ విడిపడుతూ, మీరు ఒక కాంక్రీట్ అడ్డుగోడలా మారారు.

మీరు ధ్యానంలో కూర్చున్నట్లయితే కాసేపటి తరువాత మెల్లిగా మీకు, ‘మీరు ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైన ఉనికి కాదు’ - అన్న విషయం తెలుస్తుంది. ఇది అన్నిటితోనూ ఒక్కటిగా ఉన్నది. ఈ విషయం, ఈ గ్రహం మీద  నేతృత్వంలో ఉన్న నేతలకు ఒక సజీవ అనుభూతిగా మారినప్పుడు, మన ప్రస్తుత పరిస్థితిని మార్చుకోవడానికి, ఎంతో సమయం పట్టదు. నన్ను నమ్మండి. మనం ఇంత వినాశనం చేసినప్పటికీ, దీనిని మనం తిరిగి పునరుద్ధరించడానికి ఎంతో సమయం పట్టదు. కేవలం 25 సంవత్సరాల్లో, ఇంకా మీరూ-నేనూ చనిపోకముందే, మనం దీనిని మార్చవచ్చు. కానీ, దానికి ఎవరైతే నేతృత్వంలో ఉన్నారో వారి సహకారం అవసరం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు