సమదృష్టి లేకపోవడం వల్లనే మన కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని, అలాగే బంధాలు ఎలా కలుగుతాయి, రుణానుబంధం అంటే ఏమిటి, దానిని ఎలా భారంగా చేసుకోకుండా ఉండగలమో సద్గురు ఈ వ్యాసంలో వివరిస్తున్నారు..

ప్రశ్న: నమస్కారం సద్గురూ! సాధారణంగా నాకందరూ నచ్చుతారు. నాకు సంబంధం లేనివాళ్లలో కూడా నాకేదో మంచితనం కనిపిస్తుంది. అందరితోనూ నేను చాలా సమయం గడుపుతాను, అది సమస్య కాదు. కొంతకాలం తర్వాత కొంతమంది తక్కిన వాళ్లకంటే ఎక్కువగా మనల్ని ఇష్టపడతారు. కాలం గడిచే కొద్దీ నాకు వారితో అనుబంధం పెరుగుతుంది. వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు వీళ్లతో చాలా ఎక్కువ సమయం గడిపితే, తక్కిన వాళ్లతో గడపలేదే అనిపిస్తుంది. ఒక సంబంధాన్ని ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం ఎలా?

సద్గురు: మనం అన్నిటినీ సమదృష్టితో చూసినా కూడా కార్యకలాపం విషయానికి వచ్చేటప్పటికి కొందరికంటే మరికొందరితో ఎక్కువగా వ్యవహరించడం, సమయం గడపడం సహజమే. అంతర్గతంగా మనకి అందరి పట్లా సమదృష్టి ఉండవచ్చు. కాని మనం వ్యవహరించే తీరు అందరితో ఒకేలా ఉండదు. నేను వాలీబాల్ ఆడాలనుకుంటే ఒక బృందంతో ఆడతాను. టేబుల్ టెన్నిస్ ఆడాలనుకుంటే మరెవరితోనో ఆడతాను. మనం ఒక్కో పని చేయ దలచుకున్నప్పుడు  సహజంగానే మన ఎంపిక ఒక్కో విధంగా ఉంటుంది. మీరేదైనా చదవాలనుకుంటే ఒకరితో వెళతారు. ఆడాలనుకుంటే మరొకరితో. మరేదో పని చేయాలనుకుంటే మీరెవరితో వెళ్లాలని ఎంచుకుంటారో ఆ ఎంపికకు కారణం ఒక నిర్దిష్ట అభిరుచి, అంతే తప్ప సమదృష్టి లేకపోవడం కాదు. మనం ప్రతివ్యక్తినీ ఒక నిర్దిష్ట దృష్టితో చూసినప్పటికీ, ఒక పని విషయంలో వ్యవహరించవలసి వచ్చినప్పుడు సహజంగానే అక్కడ ఎంపికలుంటాయి. అందులో తప్పేమీ లేదు. జీవితం అట్లాగే ఉంటుంది.

చిక్కుకుపోకుండా ఉండగలడం

కాని ఇప్పుడు మీరు ఒకదాన్ని పట్టుకు వేలాడనుకుంటున్నారు కాబట్టి దానిలో చిక్కుబడి పోతున్నారు. మనలో ఎదో అసంపూర్ణ భావన ఉండడం వల్ల దేనినో ఒక దాన్ని పట్టుకు  వేలాడడానికి ప్రయత్నిస్తున్నాం. చూడండి, నేనిక్కడ చాలా పోక చెట్లు నాటాను. మీరు ప్రతిరోజూ ఒక చెట్టును కౌగిలించుకోవడానికే అవి. మీరెప్పుడన్నా అలా కౌగిలించుకున్నారా? చెట్టును కౌగిలించుకోవడంలో ఒక విశేషం ఉంది. మీకు ఆ చెట్టుతో బంధన ఏర్పడవచ్చు. కాని ఆ చెట్టుకు మాత్రం మీతో బంధన ఏర్పడదు. అద్భుతమైన విషయం కదూ. అందుకే నేనందరికీ బాహాటంగా చెప్తూ ఉంటాను, మీరు నాతో ప్రేమలో పడవచ్చు, సమస్య లేదు అని. మీరు నన్ను పట్టుకొని వేలాడవచ్చు, కాని నేను మాత్రం మిమ్మల్ని పట్టుకొని వేలాడను, మీకు ఆ భయం అక్ఖర్లేదు. మీరు వెళ్లిపోతూ ఉంటే చెట్టు వచ్చి మిమ్మల్ని పట్టుకోదు. ఆ ప్రమాదం లేదు. మీరు ఒకరితో బంధం పెంచుకుంటే, ఆ వ్యక్తీ వచ్చి మిమ్మల్ని పట్టుకోవచ్చు. ఈ విషయంలో చెట్టు, గురువు ఒకటే, ఎందుకంటే వాళ్లిద్దరూ మిమ్మల్ని పట్టుకోరు. మీరు కౌగిలించుకోకపోయినా చెట్టు హాయిగానే ఉంటుంది. అది చేయవలసిన పని చేస్తూ చక్కగా ఉంటుంది. కానీ మనకు ప్రయోగాల వల్ల తెలుసు, మనం కౌగిలించుకున్నా, తాకినా చెట్టుకు సుఖంగా ఉంటుంది.

మీరు కౌగిలించుకోకపోయినా చెట్టు హాయిగానే ఉంటుంది. అది చేయవలసిన పని చేస్తూ చక్కగా ఉంటుంది.

మీరు కూడా చెట్టులాగా ఉండాలి. మీరు కోరుకున్న ప్రతి స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని మీరు ఆనందించాలి. కాని వాటిలో దేనికీ చిక్కుకోవద్దు. మీరు  వ్యక్తులనో, ఏవో విషయాలని మీకు తగిలించుకున్నట్లయితే ఏం జరుగుతుందో చూసుకోండి - ఇవ్వాళ మీకు ఆపాదమస్తకం బంక జిగురు పుశామనుకోండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకేదైనా నచ్చితే, అది మీకు అతుక్కుంటుంది. మీరు దేన్నో ముట్టుకుంటారు, అది మీకు అతుక్కుంటుంది. మీరొక చెట్టును కౌగిలించుకుంటే అది మీకు అతుక్కుంటుంది. మీరు దేన్ని తాకితే అది మీకు అతుక్కుంటుంది. ఇరవై నాలుగ్గంటల్లో మీరెలా తయారవుతారో చూడండి - ఒక పెద్ద గుట్టలా. అందుకే ఆధ్యాత్మికత అన్నది అవసరం. అది మనం సృష్టించుకునే అన్ని జిగుళ్లనూ కరిగిస్తుంది.

మనం అభద్రతగా ఉన్నట్లు భావించుకున్నప్పుడల్లా ఒక జిగురును సృష్టించి దేనికో ఒక దానికి అతుక్కుపోతాం. నాదగ్గర దాన్ని కరిగించే పదార్థముంది. ఇది శరీర తత్వం కాబట్టి మీరీ గుణాన్ని అలవరచుకోవాలి. శరీరానికి రుణానుబంధమనే దొకటుంది. మీరీ మాట విన్నారా? మనం పెరిగి పెద్దవుతున్న క్రమంలో మన చుట్టూ ఉన్నవారు ప్రారబ్ధం, రుణానుబంధం, కర్మ, ముక్తి, మోక్షం వంటి మాటలు వాడడం సర్వసాధారణమై ఉండేది. రోజువారీ సంభాషణల్లో ఈ మాటలు తరచూ దొర్లుతూ ఉండేవి. ఇప్పుడు ఎవరినోట విన్నా షిట్, షిట్, షిట్. నిజంగా చాలా ఎదిగాం కదూ.

స్పృహతో స్మృతుల్ని మోసుకొని రావడం

రుణానుబంధం అంటే మీ శరీరంలోని భౌతిక స్మృతి, మీ ముక్కు ఇలా ఉందేమిటి? ఆమె ముక్కు అలా ఉందేమిటి? దీంట్లో ఒక స్మృతి ఉంది. ఈ స్మృతి కేవలం జన్యు స్థాయిలోనిది కాదు. చూడండి, ఇవ్వాళ ఈ సత్సంగానికి వచ్చి ఒకరిక్కడ కూర్చున్నారనుకోండి, రేపు సత్సంగం జరిగితే ఆ వ్యక్తి మళ్లీ వస్తే వెళ్లి అదే స్థలంలో కూర్చుంటాడు. ఇది స్థలంతో ఉన్న ఒక విధమైన రుణానుబంధం. మనుషులకు మనుషులతో మాత్రమే అనుబంధం ఏర్పడదు. అది ఏ వస్తువుతోనైనా అనుబంధమేర్పడవచ్చు. ఎందుకంటే శరీరం తాను స్పృశించిన ప్రతిదానితోను ఒక రకమైన స్మృతిని పెంపొందించుకుంటుంది.

శరీరం తాను స్పృశించిన ప్రతిదానితోను ఒక రకమైన స్మృతిని పెంపొందించుకుంటుంది.

ఈ స్మృతిని మీరు స్పృహతో ఉపయోగించినట్లయితే మీరు చూసినదాన్ని దాని గురించి ఆలోచించకుండానే గుర్తుపట్టగలుగుతారు. మీరిక్కడ కూర్చుని కళ్లు మూసుకున్నా, మీకు తెలిసిన వ్యక్తి లోపలికి వస్తే, ఫలానా వ్యక్తి లోపలికి వచ్చాడని మీరు చూడకుండానే తెలుసుకుంటారు. ఇది మంచిదే కాని, సమస్య ఏమిటంటే మీరీ స్మృతిని తెలియకుండానే ఉపయోగిస్తున్నందువల్ల, మీరా వ్యక్తికి బంధితులవుతున్నారు. రుణానుబంధమేమీ చెడ్డది కాదు. కాని దాన్ని స్పృహతో కొనసాగించాలి. అప్పుడు మీరు మీ జీవితంలో కలిగిన ఎన్నో స్మృతులను ఆనందించగలరు. లేకపోతే ప్రతి స్మృతీ ఒక తగలాటకం అవుతుంది; అది మిమ్మల్ని తగులుకొంటుంది, మిమ్మల్ని లోబరుచుకుంటుంది. మీ జీవితంలో మీరు సంతరించుకున్న స్మృతులన్నీ మీ జీవిత దృశ్యాన్ని సుసంపన్నం చేయాలి. కాని దీనికి బదులుగా ప్రజలు దాన్నొక భారంగా చేసుకుంటున్నారు. దాన్ని భారం చేయకండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు