ఇష్టదేవత – నిజామా...? భ్రమా...?
ప్రశ్న: నమస్కారం. హనుమంతుడు నా ఇష్టదైవం. వ్యక్తి తన ఇష్టదేవత ఉనికిని వాస్తవంగా అనుభూతి చెందగలడా? చెందగలిగితే మనం భ్రాంతికీ, నిజమైన అనుభూతికి తేడా ఎలా తెలుసుకోగలం?
ఇష్టదేవత మీరు ఎంచుకున్న దేవుడు. అంటే ఆకాశం నుండి దిగివచ్చినవాడు కాదు. మీరు సృష్టించుకున్న దేవుడు – భావోద్వేగంతో కాని, లేదా మీరు ఏదో విధంగా వ్యవహరించగలిగిన నిజమైన శక్తి రూపం కాని. అది ఒక పరికరం వంటిది. పరికరం అంటే ఏమిటి? మనలో ఉన్న శక్తులకు మరింత అదనపు శక్తిని ఇచ్చేది. కాని పరికరాలు మీకు మీరుగా చేయలేని పనులు కూడా చేయగలవు. ఉదాహరణకు మీరొక పెద్ద సమూహంతో మైక్రోఫోన్ సహాయంతో మాట్లాడగలరు. మైక్రోఫోన్ కేవలం మీ గొంతు స్థాయిని పెంచుతుంది. ఈ భూగోళం మీద మనుషులు ఇంత ప్రాబల్యం ఎలా సంపాదించారు? పరికరాలను తయారు చేసుకోగలిగిన తమ సామర్థ్యం వల్లనే.
మనం శక్తి రూపాలను తయారు చేసుకున్నాం. వాటితో చాలా చక్కని సంబంధం ఏర్పరచుకున్నాం. కాని అన్ని విగ్రహాలు శక్తి రూపాలు కాదు. వాటిలో చాలావరకు భావోద్వేగం మీద ఆధారపడినవి. భక్తుడు తన భక్తికి ఆధారమైన వస్తువు ఉందా, లేదా అన్నది పట్టించుకోడు. అతనికి తెలిసినదల్లా తన భావోద్వేగాల శక్తి మాత్రమే. మీరు మీ మేధాశక్తిని ఉపయోగించినట్లే, మీ భావోద్వేగాల శక్తిని ఉపయోగించి కూడా అద్భుతమైన పనులు చేయగలరు.
మీరు భక్తులయినట్లయితే, మీరు ఆరాధించేది ఈ దేవుడా, ఆ దేవుడా అన్నది ముఖ్యంకాదు. వానరమా, మహిషమా అన్నది కూడా ముఖ్యంకాదు. మీలో ఆ భక్తి ఉండాలి, అంతే. మీలో భక్తి ఉంది కాబట్టి మీలో పరివర్తన కలుగుతుంది, అది దేవుడి వల్ల కాదు, మీ భక్తి వల్ల. మీరెవరితోనో ప్రేమలో పడ్డారు, ఆ వ్యక్తి ఒక మూర్ఖ శిఖామణి కావచ్చు. కాని మీరు ప్రేమలో ఉన్నారు కాబట్టి, మీలో ఎదో సుందర పరివర్తన చెందుతుంది. అయితే, దేవుడితో ప్రేమలో పడడంలో ఒక లాభం ఏమిటంటే, దేవుడు మిమ్మల్నెప్పుడూ అసంతృప్తికి గురిచేయడు. మనుషులు మీకు అసంతృప్తిని కలిగిస్తారు, అది వారిలో ఏదో లోపం ఉండడం వల్ల కాదు - మీరు వారి నుంచి ఆశించేవి అవాస్తవికంగా ఉంటాయి కాబట్టి – మీరనుకున్నవన్నీ నెరవేర్చడం ఎవరికైనా అసాధ్యమే...!
సరే, ఎలాగూ హనుమంతుడొక మానవాతీత వ్యక్తి. ఆయనకు కోతిలాగా తోక ఉంది, కోతి ముఖం ఉంది – తక్కిన దంతా అతిమానుషమే. మీరు హనుమత్ర్పతిష్ఠ జరిగిన ఆలయానికి వెళితే, మీకొక సంబంధం ఏర్పడితే, అందులో కొంత వాస్తవికత చోటు చేసుకోవచ్చు, లేకపోతే అది కేవలం మీ భావోద్వేగం. అది భ్రమా, వాస్తవమా అన్నది నిజంగా ముఖ్యంకాదు. మీ మనస్సులో జరిగే ప్రతిదీ భ్రమే. మీ ఆలోచనలు, భావోద్వేగాలు మీ మానసిక నాటకంలో భాగమే. మీరు వాటిని మీ జీవితాన్ని మరింత ఉజ్వలం చేసుకోవడానికీ ఉపయోగించవచ్చు లేదా మిమ్మల్ని మీరు పరాజితుల్ని చేసుకోవడానికీ ఉపయోగించవచ్చు. మీరిక్కడ కూర్చుని మీ ఇష్టం వచ్చిన రీతిలో ఆలోచించవచ్చు. వాస్తవంతో దానికెలాంటి సంబంధమూ ఉండవలసిన అవసరం లేదు. ప్రశ్న ఏమిటంటే మీ భ్రమలు మీ సంక్షేమానికీ, ఎదుగుదలకూ ఉపయోగపడుతున్నాయా, లేక మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయా అన్నది.
కొన్నేళ్ల కిందట నేను ఈశా హోం స్కూలుకు వెళ్లినప్పుడు ఎనిమిదేళ్ల పిల్లవాడొకడు వచ్చి నన్ను ఇలా అడిగాడు, “సద్గురు, జీవితం ఒక కలా, లేక వాస్తవమా?” అని. దానికి నేను అతనితో, “జీవితం ఒక కల, కాని కల నిజం.”అని చెప్పాను. మీ కల మీకు వ్యతిరేకంగా కాక, మీకు ఉపయోగకరంగా చేసుకోవడమే జీవిత నైపుణ్యం. దయచేసి హనుమంతుడు మీకు ఉపయోగపడేటట్లు చేసుకోండి, మీకు వ్యతిరేకంగా కాదు. హనుమంతుడు అతిమానుష శక్తికీ, భక్తికీ ప్రతీక. అది మీ జీవితంలో భాగం కానీయండి. జీవితం అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అది నిజమా? అబద్ధమా? వంటి ప్రశ్నలతో జుట్టు పీక్కోకండి. మీకు ఆలోచనలు వస్తాయి, పోతాయి – వాటంతట వాటికి ఉనికి లేదు, కాని అవి మీకోసం పనిచేసేటట్లు మీరు చేసుకోగలరు. ఈ మానసిక నాటకాన్ని దేవుడిగానో, దయ్యంగానో మార్చుకోవడం మీ చేతుల్లో ఉంది. దయచేసి దాన్ని దివ్యశక్తిగా మార్చుకోండి. అప్పుడు మీ మనస్సు దివ్యత్వానికి నెలవవుతుంది.
ప్రేమాశీస్సులతో,
సద్గురు