కేవలం ఒక్క జీవిత భాగస్వామికి బద్ధులై ఉండడం శ్రేష్ఠమా?
మనిషి కేవలం ఒక్క భాగస్వామిని మాత్రమే కలిగి ఉండాలా, అలా కేవలం ఒకరి పట్ల నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కలిగిఉండడం శ్రేష్ఠమా? అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు.
పృచ్ఛకుడు: సద్గురూ, మానవులు తమ జీవితకాలం లో కేవలం ఒక్కరే భాగస్వామిని కలిగి ఉండాలని భగవంతుని ఉద్దేశమా ? ఒక వ్యక్తి కేవలం ఒకరి పట్ల నిబద్దతతో కూడిన సంబంధాన్ని కలిగి ఉండడం మంచిదంటారా ?
సద్గురు: భగవంతుడికి మీ గురించిన ఉద్దేశాలుండకపోవచ్చు. అసలు ప్రశ్న ఏంటంటే, మీరు ఏం చేస్తే సమంజసంగా ఉంటుంది? ఇందులో రెండు కోణాలున్నాయి . ఒకటి సామాజికమైనది. సమాజంలో స్థిరత్వం కోసం ఒక పురుషుడు - ఒక స్త్రీ అని చెప్పారు. ప్రపంచంలో కొన్ని చోట్ల ఒక పురుషుడు - చాల మంది స్త్రీలు అని చెప్పిన ప్రదేశాల్లో, అక్కడ సమాజ స్థిరత్వం కోసం వారు కొంత ఎక్కువ శక్తివంతంగా ఉండాల్సి వచ్చింది కాబట్టి అలా చేశారు. ఇంతకంటే నేను దాని గురించి ఎక్కువగా చెప్పాలనుకోవటం లేదు.
మరొక కోణం ఏంటంటే, సృష్టిలో ప్రతీ పదార్ధానికీ, జ్ఞాపక శక్తి ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రిందటి విషయాలు మీ దేహానికి ఇప్పటికీ గుర్తుంటాయి. జన్యువులు కేవలం జ్ఞాపకాల దొంతర మాత్రమే. భారతీయ సంస్కృతిలో ఈ భౌతికమైన జ్ఞాపకాలను "ఋణానుబంధం" అని అంటారు. మీరు మోస్తున్న జ్ఞాపకాలే మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నవాటితో బంధిస్తున్నాయి. ఉదాహరణకి మీరు మీ ఇంటికి వెళ్ళాక మీ అమ్మగారిని, నాన్నగారిని గుర్తుపట్టలేక పోయారనుకోండి , ఏం చేస్తారు ? అది రక్తమూ కాదు, ప్రేమా కాదు, అది కేవలం మీ జ్ఞాపకాలే వీరు మీ తల్లి అని, వీరు మీ తండ్రి అని మీకు చెప్తున్నాయి. జ్ఞాపకాలే సంబంధ-బాంధవ్యాలను ఏర్పడేలా చేస్తున్నాయి. మీరు గనక మీ జ్ఞాపక శక్తిని కోల్పోతే , అందరూ మీకు కొత్త వాళ్ళలా కనిపిస్తారు.
మీ మెదడుకి ఉన్న జ్ఞాపక శక్తి మీ శరీరానికి ఉన్న జ్ఞాపక శక్తితో పోలిస్తే చాలా చిన్నది. మీరు దేనినైనా, లేక ఎవరినైనా ఒక్కసారి స్పృశించారనుకోండి. ఆ స్మృతిని మీ మెదడు మర్చిపోతుంది కానీ, భౌతిక శరీరంలో, అది శాశ్వతంగా ముద్రితమైపోతుంది. వ్యక్తులు శృంగారం జరిపినపుడు వారి బుద్ధి దాన్ని మరిచిపోవచ్చు కానీ దేహమెప్పటికీ మర్చిపోదు. అందుకనే, ఒకవేళ మీరు విడాకులు తీసుకుంటే, మీరు ఎంతగా మీ భర్త లేక భార్యని ద్వేషించినప్పటికీ, మీరు చాలా బాధని అనుభవిస్తారు -కారణం మీ భౌతిక శరీరానికి ఉన్న స్మృతులు ఎప్పటికీ చెరిగిపోవు.
సన్నిహితంగా అనుభూతి చెందుతూ ఒకరి చేతిని కొంతసేపు పట్టుకున్నా చాలు , ఆ స్మృతి ఎప్పటికీ చెరిగిపోదు ఎందుకంటే మీ అరచేతులూ, అరికాళ్ళూ చాలా సమర్ధవంతమైన గ్రాహకాలు. మీరు ప్రమేయం పెట్టుకోవద్దనుకున్నవారు ఎదురైనప్పుడు, రెండు చేతులూ జోడించి నమస్కారం చెయ్యండి, ఎందుకంటే , మీ రెండు అరచేతులూ కలిసినప్పుడు , ( లేదా మీ రెండు పాదాల బొటన వేళ్ళూ దగ్గరికి చేర్చండి ) మీ శరీరం జ్ఞాపకాలను జోడించడం నిలిచిపోతుంది.
భౌతిక శరీరపు స్మృతులను కనీస స్థాయిలో ఉంచడం ఇక్కడ ముఖ్యోద్దేశం. లేకపోతె, మీకు భౌతికతను మించిన ఉన్నత స్థాయి అనుభవం కలిగేలా చెయ్యటం కష్టమవుతుంది. ఎవరైతే అతిగా సుఖాలు అనుభవిస్తూ కాలం గడుపుతుంటారో, వారి మొఖంలో ఒక కుటిలమైన ఆధిపత్యం ఒలికించే నవ్వు కనిపిస్తూ ఉంటుంది. కానీ , వారిలో నిజమైన ఆనందం ఉండదు. భౌతికమైన స్మృతులు ఎంతగా మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయంటే, అది మీ బుద్ధికి అందదు. వాటినుండి బయటపడటానికి చాలా ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ శరీరానికి ఎటువంటి అనుభవాలను అందిస్తున్నారన్న విషయంలో మీరు జాగరూకతతో ఉండడం చాలా ముఖ్యం.
చెల్లించాల్సిన మూల్యం
ఎక్కువ మందితో అతిగా సాన్నిహిత్యం పెంచుకోవడం వల్ల, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది, మీకు మీనుంచి మీ భౌతిక శరీరాన్ని దూరం పెట్టగల సామర్ధ్యం ఉంటే తప్ప. అటువంటి సామర్ధ్యం ఉన్న వ్యక్తి ఏం చేసినా అతనికి ఫరవాలేదు. కానీ అటువంటి వ్యక్తికి ఇటువంటి పనులు చేయాలన్న ఆసక్తే ఉండదు. అతను భౌతిక శరీరపు పరిమితులు, నిర్బంధతల చేత ప్రభావితం కాడు. అతను శరీరాన్ని కేవలం ఒక సాధనంగా వాడుకుంటాడు. అంతే. ఆలా మీరు కాలేనప్పుడు ఇతరులతోటి సాన్నిహిత్యాన్ని కనిష్ఠ స్థాయిలో ఉంచుకోవటం ఉత్తమం. అందుకే మనం చెప్పాము ఒకరికి ఒకరు అని - అందులో ఒకరు మరణించి, మిగిలిన వారు మరొక వివాహం చేసుకుంటే తప్ప. కానీ ఇప్పుడు, మీకు పాతికేళ్ళు రాకముందే పాతికమంది భాగస్వాములు - ఇప్పటికే ప్రజలు దీనికి మూల్యం చెల్లిస్తున్నారు – అమెరికా జనాభాలో పది శాతం మంది డిప్రెషన్ పోగొట్టుకోడానికి మందులేసుకుంటున్నారు. దానికి దోహదంచేసే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, వాళ్ళకి తాము దేనికి చెందినవారమో తెలియదు. ఎందుకంటే వాళ్ళ శరీరాలు గజిబిజి గందరగోళంలో ఉన్నాయి.
శరీరానికి స్థిరమైన స్మృతి కావాలి - మనుషులు దీన్ని అనుభూతి చెందగలరు. వారి జీవిత భాగస్వామి భౌతికంగా గొప్పగా ఉండకపోవచ్చు, పెద్ద తెలివితేటలున్నవారు కాకపోవచ్చు, వాళ్ళు రోజూ కీచులాడుకుంటూ ఉండవచ్చు, అయినా కానీ వారు కలిసి ఉండటానికి ఎన్నో త్యాగాలు చేస్తూంటారు, ఎందుకంటే , ఎక్కడో, వీరితోనే తమకు సౌకర్యమూ, శ్రేయస్సూ దొరుకుతుందని వాళ్ళు అర్ధంచేసుకున్నారు. ఇది ఎందువల్లనంటే , మీ బుద్ధి కంటే కూడా మీ భౌతిక స్మృతి మీ జీవితాన్ని చాలా ఎక్కువగా శాసిస్తూ ఉంటుంది. మీ మెదడులో ఉన్న జ్ఞాపకాలను రేప్పొద్దున్న విసిరి పారేయచ్చు కానీ మీ భౌతిక స్మృతులను మాత్రం ఎప్పటికీ తోసెయ్యలేరు. అది చెయ్యడానికి మీలో పూర్తిగా విభిన్నమైన ఆధ్యాత్మిక పరిణామం రావాలి.
భౌతిక స్మృతులను కనిష్ట స్థాయిలో ఉంచుకోవడం
ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం చెప్తోంది.., యోగ శాస్త్రంలో మనకిది ఎప్పట్నుంచో తెలుసు పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం - వీటన్నిటికీ గొప్ప/బలమైన జ్ఞాపక శక్తి ఉందని. నేను శక్తిపరంగా ఎంతోకొంత ప్రాధాన్యత కలిగిన ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నజనాన్ని ఆ విశేషాల గురించి అడగను, అక్కడ ఉన్న రాతి మీద చేతులు ఆనిస్తాను, అంతే. ఆ రాతితో కాసేపు ఉంటే ఆ ప్రాంతపు కధంతా నాకు తెలిసిపోతుంది. చెట్టు కాండంలోని వలయాలు అక్కడి జీవావరణపు చరిత్ర ఎలా తెలియచేస్తాయో, అలాగే శిలలు కూడా - మరింత ప్రగాఢమైన స్మృతి శక్తిని కలిగి ఉంటాయి.
సాధారణంగా, పదార్ధం ఎంత ఎక్కువ మందంగా ఉంటే అంత బాగా దానికి గుర్తు పెట్టుకునే శక్తి ఉంటుంది. జీవం ఉన్నవాటికంటే , నిర్జీవ పదార్ధాలకి ఈ శక్తి మరింత బాగా ఉంటుంది. ఇవాళ్టి సాంకేతిక పరిజ్ఞానం దీన్ని ఋజువు చేస్తోంది.. చూడండి మీ కంప్యూటర్ కి మీకంటే మెరుగైన మెమరీ ఉంది. మానవునికి మెదడు ఉన్నది జ్ఞాపకాలు నింపుకోటానికి కాదు - అవగాహన కోసం. ప్రాణం లేని వస్తువులు దేన్నీ గ్రహించలేవు, అవి కేవలం గుర్తు పెట్టుకోగలవు. దేవతా విగ్రహాలు మరియు ఇతర ప్రతిష్ఠించబడిన వస్తువులు ఇవన్నీ సృష్టించడానికి కారణం ఇదే, అవి చాలా శక్తివంతమైన స్మృతి రూపాలు.
భారతదేశంలో ఒకానొక సమయంలో శివాలయం లోకి నగ్నంగానే ప్రవేశించేవారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇటువంటి సంప్రదాయాలన్నీ నిషేధించడం వల్ల, మనం ఎక్కడ లేని సిగ్గునూ ప్రదర్శిస్తున్నాం. దేవాలయంలోకి వస్త్రాలు విడిచి వెళ్లడంలో అర్ధం, ఆ దివ్యత్వపు స్మృతులను మన దేహంలోకి గ్రహించుకోవాలని. మీరు నీటిలో ఒక మునక వేసి, ఆ తడి దేహంతో నేల మీద సాష్టాంగ పడడం వల్లనే మీ శరీరం ఆ దివ్యత్వపు అనుభూతులను మరింతగా ఇనుమడింపజేసుకుంటుంది. బుద్ధి చుట్టుపక్కల అందరినీ చూస్తూ ఉంటుంది కానీ శరీరం మాత్రం అక్కడి శక్తిని తనలో శోషింపచేసుకుంటుంది.
ధ్యానలింగ, లింగ భైరవి ఆలయాల ముఖద్వారాల దగ్గర సాష్టాంగం చేస్తున్న భక్తుల ప్రతిమలు ఉంటాయి.అవి దైవ శక్తిని బుద్ధి కన్నా భౌతిక దేహం ఎక్కువగా గ్రహిస్తుందని తెలియజేయడం కోసం ఏర్పాటుచేసినవే. మనం అతి నాగరీకులమైపోయాం కాబట్టి మనం ఇక వస్త్రాలు లేకుండా దేవాలయాల్లోకి వెళ్లలేం - ఇప్పుడు మనం చాలా ఎక్కువగా బట్టలు వేసుకుంటున్నాం. ఎంతగా ఆంటే, అసలు వాటి వెనుక శరీరం ఉందా లేదా అని కూడా తెలియటం లేదు. కేవలం శృంగార వాంఛలు తలెత్తినప్పుడు మాత్రమే మనుషులకి తమకు దేహం ఉందని గుర్తొస్తోంది.
భౌతిక స్మృతులను తుడిచివేయడం
ప్రగాఢమైన భక్తితో, లేక కొన్ని విధములైన సాధనలతో మీరు భౌతిక స్మృతులను చెరిపేసుకోగలరు. నేను ఇటువంటి వారిని చాలా మందిని చూసాను. కానీ ఒక వ్యక్తి నన్ను చాల ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. దక్షిణ భారత దేశపు చివరి అంచున ఉన్న కన్యాకుమారి అనే ప్రాంతానికి ఒక స్త్రీ వచ్చారు. ఆమె నిజంగా ఎక్కడినించి వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఆమె ముఖ వర్చస్సుని బట్టి, నేపాల్ నుండి వచ్చిఉండవచ్చు. ఆమె ఊరికే ఆలా తిరుగుతూ ఉండేవారు , ఏమీ మాట్లాడేది కాదు,ఆమె వెంట ఎప్పుడూ కుక్కల గుంపు ఉండేది. ఆ కుక్కలకి పెట్టడానికి ఆమె అప్పుడప్పుడు ఆహారాన్ని దొంగిలిస్తూ ఉండేది, ఈ కారణంగా చాల సార్లు, దెబ్బలు కూడా తింటూ ఉండేది. కానీ తరువాత, జనం ఆమె అలలపై తేలుతూ ఉండగా చూశారు. కన్యాకుమారి పట్టణం, మూడు సముద్రాలు కలిసే తీరప్రాంతం. ఆవిడ రేవు కి వెళ్లి, నీళ్ల మీద బాసింపట్టు వేసుకు కూర్చుని, హాయిగా తేలుతూ ఉండేది. అది చూసినప్పట్నుంచీ జనం ఆమెను పూజించడం మొదలు పెట్టారు. ఆమె నించి తమ ఆహారపదార్ధాలని రక్షించుకునే వారు కానీ, ఆమెని కొట్టేవారు కాదు, ఎందుకంటే ఆమె సాధారణ స్త్రీ కాదు.
ఆమె జీవితకాలం అంతా ఆరుబయటే గడిపింది. ఏ ఆశ్రయమూ లేక తీరం లోనో లేక వీధిలోనో నిద్రపోయేది. వాతావరణ మార్పులకి ఆమె ముఖం అంతా కొట్టుకుపోయి, ఆమె అచ్చం, మనకి చిత్రపటాల్లో కనిపించే పాతకాలపు నేటివ్ - అమెరికన్ లాగా ఉండేది. ఆమె అంత్య కాలంలో , సుమారు 70 ఏళ్ల వయసులో, ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ఆమెని చూసి, తన భక్తుడుగా మారాడు. అతను ఆమెను తమిళనాడు లోని సేలం కి తీసుకు వచ్చి ఆమెకి ఒక చిన్న ఇల్లు కట్టించాడు. ఆమె చుట్టూ మరి కొంత మంది భక్తులు చేరారు.
దాదాపు 15 , 16 సంవత్సరాల క్రితం, నేను సేలం దగ్గర ఒక హిల్ స్టేషన్ లో ఉన్నాను. అక్కడ ఉన్నవారు ఈవిడ గురించి చెప్పారు. ఆమె పేరు మాయమ్మ. అప్పటికే ఆవిడ జీవించి లేరు. ఆరోజు పౌర్ణమి రాత్రి , మాయమ్మ సమాధి దగ్గర పూజ జరుగుతుందని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను, నా భార్య , నా కూతురు - అప్పటికి తనకి ఐదారేళ్ళుంటాయి, ఆ సాయంత్రం అక్కడ గడుపుదామని బయల్దేరాం. అది చాలా మామూలుగా ఉన్న కాంక్రీట్ సమాధి. అక్కడికి వెళ్ళంగానే నాకు మొఖం మీద ఛెళ్ళున తగిలింది -- అక్కడ ఉన్న శక్తి, అది ఒక విస్ఫోటనం లాగా ఉంది. అక్కడ కూర్చుండగా, గంటలు గడిచి పోయాయి. ఆ తరువాత అక్కడ ఉచితంగా భోజనం పెట్టారు. ఆవిడ భక్తుడొకరు మాకు భోజనం వడ్డిస్తున్నారు. నేనతనివంక చూసి, నమ్మలేకపోయాను.అతను అచ్చంగా ఆవిడ లాగే ఉన్నాడు. అతనొక దక్షిణ భారత దేశపు పురుషుడు కానీ, అతనొక నేపాలీ స్త్రీలాగా కనిపిస్తున్నాడు. ఆవిడ పట్ల తనకున్న అపారమైన భక్తితో అతను దాదాపు ఆవిడలాగా మారిపోయాడు.
మీరు మీ భౌతిక స్మృతులను చెరిపివేసుకోగలిగితే, అప్పుడు మీ శరీరం, మీరు దేనినైతే అత్యున్నతమైనదిగా భావిస్తారో, దానిలాగా మారిపోతుంది. మీలోని ప్రతి అణువు ఆకృతీ మారిపోతుంది. అంటే అర్ధం మీరు జన్యుపరంగా వస్తున్ననిర్బంధాలను వదిలించుకున్నారని. ఎవరైనా సన్యాసం తీసుకుంటే, వాళ్ళు మొట్టమొదట వాళ్ళ తల్లిదండ్రులకు, పూర్వీకులకు కొన్ని క్రియలు చేయాలి. మామూలుగా ఈ క్రియలను మరణించిన వారికి చేస్తారు, కానీ ఇక్కడ సన్యాసికి , వాళ్ళ తల్లిదండ్రులు బతికి ఉన్నప్పటికీ, చేస్తాము. ఇక్కడ మా ఉద్దేశం వాళ్ళు చనిపోవాలని కాదు, ఆ సన్యాసి తన భౌతిక స్మృతుల నుంచి విముక్తుడు కావాలి. మీకు పద్ధెనిమిదేళ్ళప్పుడు, మీ అమ్మ నాన్నలను మీరు ఎదిరించి వుంటారు. అదే మీకు 45 వచ్చ్చేసరికి మీరు కూడా వాళ్లలాగే మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇష్టమున్నా లేక పోయినా, వాళ్లలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కేవలం మీ తల్లిదండ్రులేకాదు , మీ తాత ముత్తాతలు కూడా ప్రస్తుతం మీ ద్వారా వ్యక్తమవుతున్నారు. మీ ప్రవర్తన జనిస్తున్నదీ, నియంత్రించబడుతున్నదీ వాళ్ళ చేతనే. అందుకే, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలని మీరు ఖచ్చితంగా నిర్ణయించుకుంటే, మొదటగా చేయాల్సిన పని మీ పూర్వీకుల స్మృతుల నుంచి దూరంగా జరగడం. ఆలా చేయకుండా మీరు మీ పూర్వీకుల ప్రభావాన్నించి బయటపడలేరు. వాళ్ళు మీ ద్వారా జీవిస్తారు, ఎన్నో రకాలుగా మిమ్మల్ని శాసిస్తారు.
దేహానికి ఉన్న స్మృతులు (మిమ్మల్ని) ఇంతగా ప్రభావితం చేస్తున్నప్పుడు, వాటిని ఈ జన్మలో ఎంత తక్కువగా ఉంచుకుంటే అంత మంచిది. వెనుకటి లక్షల సంవత్సరాల మీ పూర్వీకుల స్మృతులన్నీఇంకా వదిలించుకోవాల్సి ఉంది కదా. మీ మెదడు ఒక సరీసృపానికి ఉన్న మెదడు లాంటిది. పాకే పాములు, బల్లులు ఇంకా తేలు, ఇవన్నీ మీలో ఇంకా జీవిస్తున్నాయి. మెదడు అంటే బుద్ధి అనుకోకండి. మెదడు కూడా శరీరమే. కనీసం ఈ ఒక్క జీవితకాలంలోనైనా దానిమీద వేసే ముద్రలను పరిమితం చేసుకోండి, మీ దేహం తికమక పడకుండా ఉంటుంది.
ఈ మర్మం తెలిసిన వారు, మన దేహానికి సహాయకారిగా ఉండే విధంగా ఆధ్యాత్మిక ప్రక్రియలకు రూప కల్పన చేశారు. ప్రపంచం నలువైపులా ఎటు చూసినా మనకి అర్ధమవుతుంది, ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో తీవ్రంగా ముందుకు వెళ్లాలనుకుంటే, వారు మొదట చేసే పని తమ సంబంధాలన్నిటినీ దూరంగా పెట్టటం, ఎందుకంటే, తాను భౌతికంగా బంధాలను పెంచుకుంటే , అవి విషయాలను క్లిష్టతరం చేస్తాయి. ఒకవేళ అతను వాటిని వదిలి ఉండలేడు, అతన్ని ఇంతకుమించి ముందుకు తీసుకెళ్లలేం అని అనుకుంటే , లేక అతను పరిణతి పొందిన స్వేచ్చాజీవియ తన దేహంతో తనను గుర్తించుకోని స్థితిలో ఉంటే, వారి భౌతిక సంబంధాలను కొనసాగించుకోనిస్తాము.అలా కాకపొతే, సాధారణంగా వద్దనే చెప్తాము. మీకు తప్పదంటే, కేవలం ఒక్కరితోనే మీ సంబంధం కొనసాగించండి, ఎందుకంటే , చాలా మందితో అయితే మీ శరీరం తికమక పడుతుంది.
ప్రేమాశీస్సులతో,