జీవిత భాగస్వామి... ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకా...??
ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి, జీవిత భాగస్వామి సహకారం తప్పని సరి. అలాంటి సహకారం లేనప్పుడు వారి మధ్య సంఘర్షణ తప్పక పోవచ్చు. ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక సాధన వల్ల ఎదుటి వ్యక్తికి కలిగే లాభాన్ని జీవిత భాగస్వామికి అర్థమయ్యేలా చేయగలిగితే, జీవిత భాగస్వామి నుంచి ఖచ్చితంగా సహకారం లభిస్తుందని సద్గురు వివరిస్తారు.
ప్రశ్న: యోగ కార్యక్రమానికి వెళ్ళేందుకు జీవిత భాగస్వామి నుంచి సరైన సహకారం లభించకపోతే, అలాంటి వారు ఏం చేయాలి. ఇందులో ఉండే ప్రయోజనాల్ని జీవిత భాగస్వామికి ఎలా తెలియజేయాలి.?
సద్గురు: ఎవరైనా సరే మీ ఆధ్యాత్మిక సాధనకు సహకారించాలని మీరు కోరుకుంటున్నట్లైతే, ఈ సాధనను మీరు ఎదుటి వారికి లాభదాయకంగా ఉండేలా చేయాలి. సాధనతో మీరు ఎంతో ఆనందగా, ఉల్లాసంగా అద్భుతంగా మారడాన్ని ఎదుటి వారు గమనించాలి. అప్పుడు వారే “ఈ రోజు ధ్యానం చేశావా, ధ్యానం చేసుకో..”అని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.. అలా కాకుండా మీ ఉద్దేశ్యంలో ఆధ్యాత్మికత అంటే, ‘నేను ఈ రోజు వంట చేయడం లేదు, ఈ రోజు నుంచి నానపెట్టిన వేరుశనగ గింజలనే తిందాం. ఈశా తరగతుల్లో నానబెట్టిన వేరుశెనగ గింజల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయని చెప్పారని’ మీరు అంటే, అప్పుడు మీకు సరైన సహకారం దొరకదు.