కైలాస పర్వతం యొక్క మూడు పార్శ్వాలు
కైలాసంలో భాగం అయిన అనేక పార్శ్వాలను సద్గురు వివరిస్తూ, వాటిని అనుభూతి చెందేటంత గ్రహణశీలురం మనం ఎలా కాగలమో వివరిస్తున్నారు.
సద్గురు: పురాణాల పరంగా,కైలాస పర్వత ప్రాంతం శివుడు నడచిన ప్రాంతం. కైలాసానికి మూడు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం ఉనికి. అక్కడవున్న అనంత జ్ఞానం.మూడవది కైలాస మూలాధారం, అదికూడా అక్కడ ఉంది.
కైలాసం - దృశ్యపరమైన అందానికి అతీతమైన ఉనికి
హిమాలయ పర్వత శ్రేణులలో కైలాస పర్వతం కన్నా ఎంతో పెద్దవి, ఎంతో అందమైనవి, అనేక పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో 24 వేల అడుగులు ఎత్తుకు మించిన పర్వతాలు వందకు పైగా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నడుస్తూ వచ్చినవారికి దారిలో ఎవరెస్టు పర్వతం కూడా చూస్తారు. పరిమాణం పరంగా, వైభవ పరంగా దానిని చూసిన తర్వాత, చూడవలసినది ఏమీ ఉండదు.
మనం అందాన్ని చూడటానికి కైలాస పర్వతానికి వెళ్ళడం లేదు. ఆ శ్రేణిలో ఉన్న ఇతర పర్వతాలు దగ్గరికి వెళ్ళకుండా, ఈ కైలాస పర్వతం దగ్గరికి, తరతరాలుగా ప్రజలు దాని గొప్పదనాన్ని గుర్తించి మరీ వెళ్లారు. కైలాస పర్వతం గురించి ఏదో మహత్తు ఉంది.
ఉదాహరణకు ఒక చిన్న పిల్లవానిగా మీకు ‘అ, ఆ, ఇ, ఈ’ అనే అక్షరాలు మాత్రమే తెలుసుననుకోండి. అప్పుడు ఎవరో మిమ్మల్ని లక్షల కొద్దీ గ్రంథాలు ఉన్న, ఒక పెద్ద గ్రంథాలయానికి తీసుకు వెళితే, మీరు ‘అ’ అనే అక్షరంతో ఎన్నో వేల పుస్తకాలు, ‘ఆ’ అనే అక్షరంతో ఉన్న మరెన్నో వేల పుస్తకాలు, అలా కోట్ల కొద్దీ అక్షరాలతో ఉన్న లక్షల కొద్దీ పుస్తకాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు. కైలాస పర్వతంతో అటువంటి అనుభూతే కలుగుతుంది.
మీరేదో బిగుసుకు పోయిన మనిషైతే తప్ప, లేక ఎప్పుడూ ఆ పర్వతంతో సెల్ఫీ ఫొటోలు తీసుకుని తృప్తి చెందేవారైతే తప్ప, అక్కడవున్న మహత్తరమైన ఉనికిని అనుభూతి చెందకుండా ఎవ్వరూ ఉండరు. మీరు దానిని తప్పించుకోలేరు. మీ రెండు చేతి వేళ్ళ మధ్య కైలాస పర్వతాన్ని ఫోకస్ చేసి ఫోటో తీసేవారైతే దానిని గుర్తించకుండా ఉండగలరేమో తప్ప, లేకపోతే దాని ఉనికిని ఎవరూ గుర్తించకుండా ఉండలేరు. అది అంత మహత్తరమైంది. దానిని అనుభూతి చెందకుండా ఉండడం అంటే ఎలా ఉంటుందంటే, మీ గదిలోని గాలిని అనుభూతి చెందకుండా ఉండడం లాంటిది. మీరు ఎరుక లేకుండా గాలి పీల్చినా, అది మీకు ప్రాణం ఇస్తుంది, పోషణ ఇస్తుంది. కానీ మీరు ఎరుకతో పీలిస్తే మీ అనుభూతి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఈ రాత్రి భోజనంతో ఈ పరిశోధన చేయండి. చాలా బలవర్ధకమైన, ఇష్టమైన ఆహారం తీసుకోండి. దానిని మిక్సీలో వేసి, బాగా గిలకొట్టి, ఒక గరాటాతో మీ గొంతులో పోసుకోండి. దానితో కూడా మీ పోషణ జరుగుతుంది. కానీ తినడంలోని రుచి, అందము మీరు అనుభవించలేరు. కైలాస పర్వతంతో మీకు ఇలాగే జరగవచ్చు, మీకు మీరు అలా చేసుకోవద్దు. మీకు పోషణ ఎలాగూ జరుగుతుంది, కానీ రుచి కూడా చూడటం ఎంతో బాగుంటుంది.
బ్రహ్మాండమైన జ్ఞాన భాండారం
కైలాస పర్వతం రెండవ పార్శ్వం అక్కడున్న బ్రహ్మాండమైన జ్ఞాన భాండారం. మీరు ఆ గ్రంధాలయంతో మంచెత్తబడతారు. కాని ఆ పుస్తకాలు చదవడం అంటే, అది మరొకరకమైన విషయం. మీకు ఇంగ్లీషు భాష నేర్చుకోవాలన్నా, దానిమీద కొంత పట్టుకావాలంటే మీకు పది, పదిహేను సంవత్పరాలు పట్టి ఉంటుంది. అలాగే మీరు కైలాస పర్వతంలోవున్న జ్ఞానం తెలుసుకోవాలంటే మీకు వేరొకరకమైన సన్నద్ధత, సంలగ్నత కావాలి.
కొంత కాలం క్రిందట ఎవరో నన్ను ‘కైలాస పర్వతాన్ని అందుకోవాలంటే ‘ఏమీ తెలియని’ సాధారణ మనుషులకు ఏమి అవసరం?’ అని అడిగారు. మీరు నిజంగా ‘ఏమీ తెలియని’ సామాన్యులైతే, అది అందుకోవడం చాలా సులభం. ‘ఏమీ తెలియని’ సామాన్యుడంటే మీరు ఎలా నిర్థారణ చేస్తారో నాకు తెలియదు. మీరు ‘ఏమీ తెలియని’ సామాన్యుడిని ఒక్కరినైనా చూశారా? లేక మీ భార్య ముందు నేను సామాన్యుడనే అంటారా? మీరు నిజంగా ఏమీ తెలియని వారైతే, నేను మీకు అంతా ధారపోస్తాను, అది చాలా సులభం. సాధారణ అంటే ఏమీ తెలియదని. మీరు అలాంటి వారు కాదు, మీరు చాలా తెలివైన వారు, మిగతా వాళ్ళు అనుకుంటున్నా లేకపోయినా, కనీసం మీరు అలా (తెలివైనవారని) అనుకుంటున్నారు. ప్రతివారూ తమ పరిధిలో చాలా తెలివైన వాడిననే అనుకుంటారు. ఒకరు తమ ఇంట్లో చాలా తెలివైన వాడిని అనుకుంటాడు. మరొకరికి ఇంకాస్త పెద్ద ప్రదేశంలో అలా ఉండవచ్చు, ఏది ఏమైనా ప్రతివారూ ప్రత్యేకమైన వారే?ఏమీ తెలియని సాధారణ మనిషంటూ ఎవరూ లేరు.
మనం జనాన్ని ఈ పర్వతాల్లో ఈడ్చుకుంటూ పోవడమో, మరో విధంగానో చేయడం ద్వారా, మీరు ఏమి చెప్పినా వినడానికి సిద్ధంగావుండే వారిగా తయారు చేస్తే, అప్పుడు వారికి జ్ఞానాన్ని అందించవచ్చు.
లేక వారు నిజంగా తెలివిగల వారు అయ్యుండాలి. తెలివి అనేది మరొకరితో పోల్చేది కాదు. చురుకుతనం ఎప్పుడూ మరొకరితో పోల్చదగ్గది. మీరు చాలా చురుకు అన్నామంటే, మీ ప్రక్కనున్న వారికంటే కాస్త మెరుగు అని. నిజానికి చురుకుతనానికి అంత ప్రాముఖ్యత లేదు. చురుకుదనంతో కాస్త సంపాదించవచ్చు, సమాజంలో ఓ స్థానం పొందవచ్చు. కాని అస్తిత్వపరంగా మీరు ఎక్కడకూ చేరలేరు.
తెలివి మరొకరితో పోలిక కోరుకోదు. తెలివికి పోలికలు చేసుకునే ఉద్దేశ్యంగానీ, సమయంగానీ లేవు, ఎందుకంటే తాను ఎంత చిన్నదో దానికి తెలుసు. మీరు నిజంగా తెలివిగలవారైతే, మీ చుట్టూవున్న ఓ పుష్పంపైనో, పత్రం పైనో పూర్తిగా శ్రద్ధపెడితే, మీ తెలివి ఎంత చిన్నదో మీకు తెలుస్తుంది. ఈ తెలివి స్వభావం తన పరిమితులను తెలుసుకోవడమే.
ఏమీ తెలియని మనిషే, నిజంగా తెలివిగల మనిషి. ఎందుకంటే మీరు మీ చుట్టూవున్న వాటిమీద దృష్టిపెడితే, ఆఖరికి ఒక ఆకు, పువ్వు చివరకు ఒక ఇసుక రేణువు కూడా మీకన్నా చాలా ఎక్కువ తెలివైనదని మీకు తెలుస్తుంది. అందువల్ల మీరు ఏమీ తెలియని మనిషే అవుతారు.
కైలాస మూలాధారం
మూడవ కోణం కైలాస మూలాధారం. అది కూడా ఉంది. కానీ అది చాలా సూక్ష్మమైనది. మీకు భౌతికంగా, మానసికంగా, శక్తిపరంగా మీరు చాలా నిష్ఠ కలవారైతే, మీరు కైలాస మూలాధారాన్ని మీరు స్పృశించే అవకాశం ఉంది. కైలాస మూలాధారం ఒక శూన్యం లాంటిది, అది ఎప్పుడూ ఉంటుంది. ఆకాశం వంక చూస్తే మీరు చంద్రుడు, నక్షత్రాలు చూస్తారు, చాలవరకు ఎవ్వరూ అక్కడ ఉన్న శూన్యాన్ని చూడరు. అదే అక్కడ ఉన్న అతి పెద్ద ఉనికి. అంతరిక్షంలో 99 శాతానికి పైగా శూన్యమే. కాని అది ఎవరూ చూడరు. వారు దానిని అనుభూతి చెందరు, ఎందుకంటే అది మరీ సూక్ష్మమైనది.
అది ఎంతో సూక్ష్మమైనది, కాని అది ఒక అవకాశం. అది చేకూర్చుకోవడానికి సామర్ధ్యం అక్కరలేదు, దానికి కావలసింది నిష్ఠ లేక చిత్తశుద్ధి. కావలసింది ఒకరకమైన శారీరక, మానసిక, శక్తిపరమైన నిష్ఠ. శక్తి పరమైన నిష్ఠ కొద్దికాలంలో జరగదు. దానికి కొంత కృషి అవుసరం. కానీ శారీరక, మానసిక నిష్ఠ కొద్దికాలంలో సృష్టించవచ్చు. దానికి చేయవలసింది కొన్ని సులువైన పనులు.మీరు కైలాసానికి వెళుతుంటే, ఆ కొద్ది రోజులూ, మీరు రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఇక ఆ మధ్యలో ఏమీ తినవద్దు. మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో, మీ ఫోనువంక ఎన్నిసార్లు చూడాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి, మీ ఫోను మొత్తం వదిలేస్తే మరీ మంచిది. లేకపోతే మీ అవసరానన్ని బట్టి, మీరే నిర్ణయించుకోండి.
మీరు మాట్లాడకుండా ఉండలేకపోవడం అన్నది ఒక నిర్భందం. మాటి మాటికీ, మీరు అవే పనికిరాని మాటలు మాట్లాడుతూనే ఉండాలి. కనీసం మీరు కైలాసానికి వెళ్లేటప్పుడు వీటిని వదిలేయండి. మీ వ్యవస్థ తయారుగా ఉండాలి కాబట్టి, మీ అంతట మీరే కూర్చుని ఏదో స్మరణ, స్తుతి చేస్తూ ఉండండి, మీ దృష్టి కేంద్రీకరించండి, మీ చుట్టూ ఉండే వాటిపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే మీ వ్యవస్థ సిద్ధంగా ఉండాలి, లేకపోతే మీరు అంతా చేజార్చుకుంటారు.
నేను ‘కైలాసం’ అనే శక్తి, ఎంతో మహత్తరమైన సంభావ్యత. ‘‘సద్గురూ, నేను భోజనం చేయకూడదా? నేను మూడు రోజులు భోజనం చేయకుండా ఉంటా’’ అంటారా? అలాచేస్తే మీరు వెనక్కి తిరిగి రాకపోవచ్చు. విషయం అదికాదు. మీరు ఏదన్నా లోపలికి తీసుకోవడానికి ఎన్నిసార్లు నోరు తెరవాలో, మాట్లాడడానికి ఎన్నిసార్లు నోరు తెరవాలో నిర్ణయించుకోండి. మీరు మూడు సార్లు తినాలనుకుంటే, ఇక నాల్గవసారి వద్దు. ఇది మీ ఛాయిస్, మీరే నిర్ణయించుకోండి. అలా నిర్ణయించుకుని, ‘అలానే చేస్తాను’ అనడమే నిష్ఠ లేక చిత్తశుద్ధి అంటారు. నిష్ఠ అంటే రోజుకు ఒక్కసారే తినడమో లేక ఐదు సార్లు తినడమో కాదు. నిష్ఠ అంటే నేను నిర్ణయిస్తాను, ఇక అదే చేస్తాను అనడంలో ఉంది.
నేను ఇక్కడ క్రమశిక్షణ గురించి మాట్లాడడం లేదు. మీరు ఏమి చేస్తారో, మీరు ఏమి మాట్లాడతారో, అదే నిష్ఠ. నేను సామాజిక నిష్ఠ గురించి మాట్లాడడంలేదు, నేను శారీరక, మానసిక నిష్ఠ గురించి మాట్లాడుతున్నాను. అది రావాలి. అప్పుడే వ్యక్తి మరోదానిని అనుభూతి చెందడానికి, దానిచే స్పృశింపబడడానికి అర్హుడౌతాడు.
ప్రేమాశీస్సులతో,