కార్తీక మాస ప్రాముఖ్యత
సద్గురు కార్తీక మాస ప్రాముఖ్యతను వివరిస్తున్నారు, ఇంకా ఈ మాసంలో దీపాలు వెలిగించడమనేది ఎందుకు అంత ముఖ్యమో తెలియచేస్తున్నారు.
సంవత్సరంలోని దక్షిణాయన దశను, సాధనపాద అంటారు. కార్తీక మాసం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ సమయంలోనే, సంవత్సరంలోని కైవల్య పాదం అని పిలువబడే దశలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధన పరంగా చుస్తే, దక్షిణాయనం శుద్దీకరణ కోసం, అలాగే ఉత్తరాయణం జ్ఞానోదయం కోసం. సాధనపాదం అనేది దున్ని, విత్తనాలు నాటి, సాగు చేసే సమయం. ప్రస్తుతం ఇది, మీరు చేసిన సాధన యొక్క అంతర్గత ఫలితాలను పొందే సమయం. ఆ సాధన వల్ల కలిగే ఫలితాలను పొందే సమయం. దీని గురించి మీరు అనేక కథలు వినే ఉంటారు.
భీష్మ పితామహుడు, సాధన పాదం సమయంలో చనిపోవడం ఇష్టం లేక, అంపశెయ్యపై ఎలా వేచి ఉన్నాడో ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఆయన తన శరీరాన్ని కైవల్య పాదంలోనే విడిచిపెట్టాలనుకున్నాడు, ఎందుకంటే అది జీవిత ఫలాలను పొందే సమయం. కైవల్య పాదంలో అంతర్గతానికి సంబంధించిన ఫలితాలను చాలా సులభంగా పొందవచ్చు. ప్రస్తుతం ఇది, సాధన నుండి కైవల్యానికి మారే సమయం. దీపం - జ్ఞానోదయం, అవగాహన, ఎరుక ఇంకా అంతిమమైన ముక్తిని సూచిస్తుంది. మనం వెలిగించే దీపాలు వీటన్నిటికీ చిహ్నంగా నిలుస్తాయి.
ఇది కేవలం ఒక దీపం వెలిగించడం గురించి మాత్రమే కాదు. సాధారణంగా, సంప్రదాయం ప్రకారం, కార్తీక మాసం వచ్చినప్పుడు, మీరు వెలిగించే దీపాలను రెట్టింపు చేయాలి, ఎందుకంటే ఒక విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి మీ రోజువారీ కార్యకలాపాలను చేసుకోవడానికి మీకు కొంచెం ఎక్కువ వెలుతురు అవసరం. మరొక విషయం ఏమిటంటే, అది మీరు మీ జీవితంలో వెలుగుని పెంచుతున్నారని సూచిస్తుంది.
ఈ గ్రహం మీద ఉన్న మనుషులందరి కోసం మనకు 700 కోట్ల దీపాలు కావాలి. అన్ని దీపాలు మీ ఒక్కరే వెలిగించలేరు. అయితే నేను ఏమంటానంటే, ఈ నెలలో ప్రతిరోజూ, మీరు కనీసం ఇంత మాత్రం చేయాలి - మీ కోసం ఒక దీపాన్నీ, మీకు ఇష్టమైన వారి కోసం ఇంకో దీపాన్నీ, అలాగే మీకు ఇష్టంలేని వారి కోసం మరొక దీపాన్నీ వెలిగించండి.