జ్ఞానం అంటే మనం పోగుచేసుకున్న సమాచారమని, దీని ద్వారా మన రోజు వారీ కార్యకలాపాలు సరిగ్గా నిర్వర్తించడానికి కొంత మేర ఉపయోగపడుతుందని, కాని జీవితాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం కన్నా కూడా స్పష్టత ముఖ్యమని సద్గురు చెబుతున్నారు.

ప్రశ్న: విద్య అత్యంత ప్రాధాన్యం కలది, కాని కొన్నిసార్లు జ్ఞానాన్ని వదిలేయండని మీరంటారు. జ్ఞానం వరమా లేక శాపమా?

సద్గురు: మీరు జ్ఞానం అంటున్నది పొందుపరచిన సమాచారం మాత్రమే. వంట చేయాలన్నా, కారు తయారుచేయాలన్నా, గొప్ప కంప్యూటర్ తయారుచేయాలన్నా, ఒక భవనం కట్టాలన్నా పొందుపరచిన జ్ఞానం చాలా ముఖ్యం. మీరు వైద్య గ్రంథం, వంటల పుస్తకం, ఇంజినీరింగు పుస్తకం అనేవన్నీ పొందుపరచిన జ్ఞానమే. మీరు దీన్ని ఉపయోగించ వద్దనుకుంటే ప్రతిరోజూ మళ్లి చక్రాన్ని కనిపెట్టవలసి వస్తుంది. వేయ్యేళ్ల కిందట కనుగొన్న విషయాలను మళ్లీ కనుక్కోవడానికి ప్రయత్నించేవాడు మూర్ఖుడు. తెలివైనవాడు అంతవరకు కనిపెట్టినవన్నీ ఉపయోగించుకుంటాడు, రేపటి కోసం మరొకదాన్ని కనుక్కుంటాడు.

ఒకరోజు ఒక యువ విద్యార్థి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లాడు. చేతిలో కూల్‌డ్రింకు, పాప్‌కార్న్ ఉన్నాయి. ఒక వృద్ధుడు కూర్చుని ఆట చూస్తున్నాడు. ఇతను వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు. ఒకసారి ఆయన వైపు చూసి, ‘‘మీతరం ముసలివాళ్లు అప్పుడు ఎలా జీవించారోనని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు మీకేమీ తెలియదు. మా తరం చూడండి. మేము కంప్యూటర్లతో పెరిగాం, మాకు నానో టెక్నాలజీ ఉంది, మాకు గ్రహాంతరయానం చేసే వాహనాలున్నాయి. మేమిప్పుడు కాంతివేగంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా మాట్లాడగలం. మీరు నిజంగా ఆదివాసీ జీవితం గడిపారు. అందువల్ల నిజంగానే మీకు మా అత్యాధునికతరం వారు అర్థం కావడం కష్టం. మీరు పెరిగి పెద్దవాళ్లవుతున్న సమయంలో ఈ ఆధునిక వస్తువు లేవీ లేవు కాబట్టి మీరు వెనుకబడినవాళ్లే’’ అన్నాడు. వృద్ధుడు ఇదంతా విన్నాడు. కావాలనే చుట్టూ ఉన్న అందరూ వినాలనే ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు, ‘‘ఔనురా నాయనా! మా చిన్నతనంలో, మేం పెరిగి పెద్దవాళ్లవుతున్న సమయంలో మాకీ వస్తువులేవీ లేవు. అందువల్ల మేమివన్నీ కనిపెట్టాం. మరిప్పుడు ఒరేయ్, తర్వాతి తరం కోసం మీరేం చేస్తున్నార్రా?’’

స్పష్టత-నిర్ధారణ

మనకు తెలిసిందీ, ఎన్నడో కనిపెట్టిందీ మనం కూడబెడతాం. ఈ జ్ఞానాన్ని కూడబెట్టడం ఎందుకంటే, అంతకుముందు కనిపెట్టినవే ప్రతిరోజూ మళ్లీ కనిపెట్టవలసిన అవసరం కలగకుండా ఉండడానికి. చేసినపనే మళ్లీ మళ్లీ చేసే మూర్ఖులుగా మనం తయారుకాకుండా ఉండడానికి. మరి జ్ఞానం ఉపయోగకరమా, కాదా? మీరే నిర్ణయించండి. నేను జీవిత జ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ జీవితం - అంటే మీ గురించి మాట్లాడుతున్నాం. ఈ జీవితం గురించి మీరు జ్ఞానాన్ని కూడబెట్టలేరు, ఎందుకంటే కూడబెట్టిన జ్ఞానం ద్వారా జీవితం గురించి మీరొక తుది నిర్ణయానికి వచ్చేటట్లయితే అది పక్షపాతంతో కూడుకున్న జ్ఞానమవుతుంది. అది మిమ్మల్ని దేన్నీ సరికొత్తగా అనుభవించనివ్వదు.

మీకొకదాని గురించిన జ్ఞానం ఉన్నప్పుడు మీరు దాన్ని తాజాగా అనుభవించలేరు. అప్పటికే దాని గురించి ఒక పక్షపాతంతో కూడిన అభిప్రాయానికి వచ్చేస్తారు. మీరేదైనా శారీరిక లేదా భౌతికమైన కార్యం చేయాలంటే మీకు జ్ఞానం అవసరం, కాని జీవిత నిర్వహణకు మీకు జ్ఞానం అవసరం లేదు, స్పష్టత కావాలి. మనం జ్ఞానాన్ని వదిలివేయాలంటున్నప్పుడు జీవితం గురించి మాట్లాడుతున్నాం, అంతేకాని జీవితంలోని వివిధ అంగాల గురించి కాదు. మీరు వైద్యం, ఇంజినీరింగు, సంగీతం లేదా ఇది, అది ఏది చేయదలచుకున్నా, మీరు గత అనుభవాన్ని కేవలం మీ అనుభవాన్ని మాత్రమే కాదు, లక్షలాది వ్యక్తుల, ఈ భూమి మీద నివసించిన లక్షల తరాల అనుభవాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. మీరు దాన్ని ఉపయోగించక పోయినట్లయితే ప్రతిదాన్నీ మొదటిసారిగా జీవించాలి. ప్రతిదాన్నీ తాజాగా తీసికోవాలి. అదే సమయంలో  మీరు ఈ జ్ఞానాన్ని మీ అవగాహనలోని స్పష్టతలోనికి జొరబడనీయకూడదు. ఒకవేళ అది జొరబడితే మీరు దేన్నీ ఉన్నదున్నట్లుగా చూడలేరు. మీ పాత జ్ఞానం ప్రతిదానిలోనూ నేనున్నానంటుంది. దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. మీకిక కొత్తదేమీ జరగదు.

మీ స్మృతికీ, మీ బుద్ధి అనే కత్తికీ మధ్య స్పష్టమైన భేదాన్ని మీరు చూడగలిగినట్లయితే, సమస్యే లేదు.

జ్ఞానం కలిగి ఉండడమూ, దానితో మిమ్మల్ని మీరు గుర్తించుకోక పోవడమూ, అది మీ దృష్టిలో స్పష్టత మీదికి ప్రభావం చూపించకుండా ఉండేలా చేసుకోవడమూ చాలా ముఖ్యం. విషయ వస్తువులను ఉన్నది ఉన్నట్లుగా చూడాలంటే మీరు ఈ జ్ఞానం నుండి ముక్తులు కావాలి. గతంలో ఉన్నదాన్ని చూడడానికి మీకు జ్ఞానం కావాలి. అంటే జ్ఞానం మీ స్మృతిలో ఉంది. మీ స్మృతికీ, మీ బుద్ధి అనే కత్తికీ మధ్య స్పష్టమైన భేదాన్ని మీరు చూడగలిగినట్లయితే, సమస్యే లేదు. మీ బుద్ధికి మీ స్మృతి పూర్తిగా అతుక్కుపోయినట్లయితే బుద్ధి అనే ఈ కత్తికి పదును పోతుంది, అది దేన్నీ కోసుకొని లోపలికి పోలేదు. ఇటువంటి సన్నివేశం, సందర్భంలోనే నేను జ్ఞానాన్ని విసర్జించాలని చెప్పింది.

బుద్ధి కత్తిలాంటిది: అది ఎంత పదునుగా ఉంటే అంత తేలిగ్గా దేనిలోనుంచైనా దిగుతుంది. దానికి రకరకాల పదార్థాలు అతుక్కుంటూ ఉంటే అది పదునుగా ఉంటుందా? అది దేన్నైనా కోయగలుగుతుందా? అందువల్ల గతాన్ని గతంలో ఉంచగలిగి, వర్తమానాన్ని ఉన్నదున్నట్లుగా చూడడం మీకు తెలిస్తే, సమస్యలేదు. కాని మీకు స్పష్టత లేకపోతే, మీరు గతంలో కూడబెట్టుకున్నదే మీ అస్తిత్వంగా మిగిలిపోతే, అప్పుడు మీరలా కూడబెట్టిన ఒక రాశి మాత్రమే అవుతారు. అప్పుడు జ్ఞానం భారంగా తయారవుతుంది.

ఇప్పుడు జీవితాన్ని జీవించడం విషయానికి వస్తే మీకు దాన్ని గురించిన జ్ఞానం ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే అది జీవితం. మీరు దాన్ని అవగాహన చేసుకోవాలి; దాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. కాని అది బుద్ధుడికి తెలుసు, కృష్ణుడికి తెలుసు, మరొకరికి తెలుసు అని అంటారు. వాళ్లకేం తెలుసో దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. వారి ద్వారా దాన్ని మీరు అనుభూతి చెందలేరు. మీరు వాళ్ల అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చు, కాని వారి అవగాహనను కాదు; మీరే అవగాహన చేసుకోవాలి. మరో మార్గం లేదు. ఇది, ఈ సందర్భంలోనే నేను మీకు చెప్పింది, జ్ఞాన భారాన్ని మీ నెత్తిన వేసుకోవద్దని.

ప్రేమాశీస్సులతో,
సద్గురు