కుల వ్యవస్థ గురించిన నిజా నిజాలు, దానిని నిర్మూలించే విధానం
భారతదేశంలో కుల వ్యవస్థ గురించిన వాస్తవాలను విశదపరచమనీ,, చేర్చుకునేతత్వం, సమానత్వం తీసుకొచ్చేందుకు మనం దాన్ని ఎలా అధిగమించవచ్చో తెలుపవలసిందనీ క్రికెటర్ వీరేందర్ సేహ్వాగ్, సద్గురును కోరారు.
వీరేందర్ సేహ్వాగ్: నమస్కారం సద్గురూ! మన భారతీయ కుల వ్యవస్థ గురించిన నిజాన్ని నాకు తెలుసుకోవాలని ఉంది. మనం ప్రజల మధ్య మరింతగా చేర్చుకునేతత్వం, సమానత్వం ఎలా తీసుకురాగలం?
సద్గురు: నమస్కారం వీరూ! వృత్తి విభజన కారణంగానే ఈ కుల వ్యవస్థ ప్రారంభమైందనే విషయం మనం తప్పకుండా అర్థంచేసుకోవాలి. దురద్రుష్టవశాత్తూ, కొద్ది కాలంలో, ఈ విభజన వివక్షగా మారి ప్రజలు పరస్పరం విరుద్ధంగా పనిచేయడం ప్రారంభించారు.
సమాజం పనిచేయాలంటే, జనాభాలో కొంతమంది తప్పకుండా నైపుణ్యం గల చేతివృత్తుల వారు ఉండాలి, ఇతరులు వ్యాపారం చూడాలి, కొంతమంది పరిపాలన, మరి కొంతమంది విద్య, ఆధ్యాత్మికత నిర్వహంచాలి. ప్రాథమికంగా, పూర్వీకులు ఇలా నాలుగు విభజనలు చేశారు.
ప్రాచీన కాలంలో, ఇంజినీరింగ్ మరియు వైద్య కళాశాలలు లేవనే విషయం కూడా మనం అర్థంచేసుకోవాలి. మీ తండ్రి వడ్రంగి అయితే, బాల్యం నుంచి మీరు ఇంటి వద్దే వడ్రంగి పని చేయడం నేర్చుకొని మంచి వడ్రంగి కావచ్చు. ఈ కుల వ్యవస్థ ద్వారా ఈ నైపుణ్యాలు తరతరాలుగా వస్తున్నాయి.
దురదృష్టవశాత్తూ, ఈ విధానంలోఎక్కడో , కమ్మరి (ఇనుప సామాన్లు చేసేవారు) కంటే తాను గొప్పవాడిననే ఆలోచన కంసాలి (బంగారు ఆభరణాలు చేసేవారు) లో ప్రారంభమైంది. కంసాలి కంటే కమ్మరి పని సమాజానికి చాలా ఎక్కువ ఉపయోగకరమైనప్పటికీ, తాము ఇతరుల కంటే గొప్పవారమనే భావన అలా కొందరిలో ప్రారంభమైంది. ఇలా తరాలు గడచిన కొద్దీ, ఈ ఆధిక్యత పాతుకుపోయింది. ఈ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నంలో, అన్ని రకాల దోపిడీ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా కుల వ్యవస్థ దాదాపుగా వర్ణ వివక్షతలా పురులు విప్పింది.
కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రజలకు ఘోరాలు జరిగాయి. భారతదేశంలోని అనేక గ్రామాల్లో, దళితులుగా పిలవబడుతున్న నిమ్న వర్గాలకు చెందిన ప్రజలకు ఇప్పటికీ కనీస మానవ హక్కులు కరవయ్యాయి. గత పాతిక ముప్ఫై ఏళ్ళల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, మన దేశంలో ఇప్పటికీ అనేక ఘోరమైన అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి? ఒక విధానం ఏమిటంటే, నేడు నైపుణ్యాన్ని అనేక విధాలుగా నేర్పవచ్చు. మనకు విద్య, సాంకేతిక సంస్థలు ఉన్నాయి. నైపుణ్య బదిలీ ఇంకెంత మాత్రం కుటుంబం ద్వారా మాత్రమే కాదు. కాబట్టి కుల వ్యవస్థ ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.
కానీ సామాజిక భద్రత కారణంగా కుల వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తోంది. ప్రజలు తమ సొంత తెగ, కులం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. తమ కులంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి వారు ఎల్లవేళలా బాసటగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా, ప్రతి పౌరునికి సామాజిక భద్రతను మనం అందించేత వరకు, కుల వ్యవస్థ కొంత మేరకు కొనసాగుతూనే ఉంటుంది.
కుల వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నించడం వల్లనో, లేదా దానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్లనో ఫలితాలు లభించవు. కులం కల్పించే సామాజిక భద్రత కారణంగా ప్రజలు ఇప్పటికీ దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. మనం దేశ వ్యాప్తంగా సామాజిక భద్రతా వ్యవస్థను మరియు విద్యా వ్యవస్థను తీసుకురావడం చాలా ముఖ్యం. ఇది ప్రతి ఒక్కరికీ వాళ్ళ అభిరుచి ప్రకారం నైపుణ్యాలను అందిస్తుంది. ఇది జరిగినప్పుడు, కుల వ్యవస్థ సహజంగా అంతమౌతుందని నేను అనుకుంటున్నాను.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.