లౌకికమా, పారమార్ధికమా అనేది మీ చేతిలోనే ఉన్నది.
ఒక సాధకుడు చిన్న చిన్న కోరికల భారంతో నిస్పృహ వ్యక్త పరుస్తున్నాడు. మనం ప్రస్తుత, పారమార్ధికాలను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాము అంటారు సద్గురు. మన చుట్టూ ఉన్న అతి చిన్న వాటి నుంచి అతి పెద్ద వాటిదాకా, అన్నింటిలో సృష్టి కర్త ప్రమేయం సమంగానే ఉందని సద్గురు వివరిస్తున్నారు.
ప్రశ్న: ప్రణామం సద్గురూ. నా సమస్య నన్ను నిజంగా దహించివేస్తున్నది. చిన్న చిన్న కోరికలతో పాటు, నేను పరమోత్తమమైనది పొందాలని కూడా కోరుకుంటున్నాను. చిన్న చిన్న కోరికలు కూడా ఉన్నాయి కాబట్టి నేను సందిగ్ధావస్ధలో ఉన్నాను. ఈ చిన్న కోరికలను, పరమోత్తమమైన కోరికనూ మనసులో ఉంచుకుంటే, నేను ఏదైనా సాధించగలనా లేదా అని నేను మదన పడుతున్నాను. ఈ దాటిపోవడం అనేమాటకు అర్థం తెలియడం లేదు. జీవితంలోని ఈ చిన్న చిన్న సౌఖ్యాలకు అతీతంగా పోయి, పరమోత్తమమైన దానిని సరిగా చూడడం ద్వారా, నా గమనాన్ని త్వరితం చేసుకోవడం ఎలా?
సద్గురు: అంటే మీరు చిన్న చిన్న కోరికలతో రగిలిపోతున్నారు. మీరు చేస్తున్న అసలు పొరబాటు, మీరు ప్రస్తుత, పారమార్ధికాలను విడదీసే ప్రయత్నం చేయడం. మీరు వాటిని విడదీయలేరు. బహుశా ఈ నగరంలో చాలా సంపంగె పూల చెట్లు ఉన్నాయి. రోడ్డు ప్రక్కన ఈ చిన్నపువ్వు విరబూస్తే, అది ఎంతో సువాసనతో అందంగా ఉన్నా, మీరు బహుశా వాటిని సరిగా పట్టించుకుని ఉండరు. మీరు పట్టించుకోని ఈ చిన్న పువ్వు, అది వికసించాలంటే సృష్టికి మూలం దానిలో పనిచేస్తూ ఉండాలి. మరి, ఆ సృష్టి మూలం మీలో కూడా పనిచేస్తోంది అనుకుంటున్నారా? మరి చీమలో? మీరు చీమను గమనిస్తే, దాని ఆరు కాళ్లతో, దాని గమనంలోని ప్రావీణ్యం అత్యద్భుతం. అది ఎంతో చక్కని యంత్ర నిర్మాణం. సృష్టి కర్త ప్రమేయం దానిలో ఖచ్చితంగా ఉంది, సృష్టి కర్త ప్రమేయం మిగతా వాటిలో ఎంత ఉందో, చీమలో కూడా అంతే ఉంది.
పూర్తిగా శ్రద్ధ చూపడం
అతి చిన్న దాని నుంచి అతి పెద్ద దాని వరకు, దేనిలోనైనా దివ్య ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. దివ్య ప్రమేయం ప్రతి క్షణం, ఎంతో చురుకుగా అన్నిటిలో పాలు పంచుకుంటుంది. మీ చిన్న ఆలోచన, మీ పెద్ద ఆలోచన, మీ లౌకిక ఆలోచన, మీ అలౌకిక ఆలోచన, వాటన్నిటి వెనకా అదే శక్తి పని చేస్తున్నది. మీ ఆలోచన ఎంత అపవిత్రమైనదైనా లేక బాహ్యమైనదైనా, మీరు దాని మీద శ్రద్ధ పెడితే అది ఆధ్యాత్మిక ప్రక్రియే అవుతుంది. అతి సులువుగా చేయగల పని - మీ చిటికిన వేలు కదపడం తీసుకోండి, మీరు మీ చిటికిన వేలును దానిపై పూర్తి శ్రద్ధ పెడుతూ కదిలించండి - అది కూడా మీకు ఆధ్యాత్మిక ప్రక్రియే అవుతుంది.
మీకు ఏది లౌకికమో, ఏది పార మార్ధికమో అన్నది, మీరు చేసుకున్నదే. నిజానికి, సృష్టిలో అలాంటిదేదీ లేదు. లౌకికం, పార మార్ధికం అనేది వాటి లక్షణాన్ని బట్టి కాదు, వాటి పట్ల మీరు చూపే శ్రద్ధను బట్టి అవుతాయి. మీరు అన్నింటి మీదా అదే విధమైన శ్రద్ధపెడితే అన్నీ పవిత్రమైనవే అవుతాయని మీరు గ్రహిస్తారు. అదే మనదేశ విధానం. అదే మన దేశపు సౌభాగ్యం.
ఈ రోజు మీరు రోడ్డువెంట నడుస్తుంటే, మీరు కొన్ని రాళ్ళున్న తోట మీదగా నడచి పోవచ్చు, రేపు ఒక రాయి మీద ఎవరన్నా కాస్త పసుపు, కుంకుమ లేక విభూది, ఒక పువ్వు ఉంచితే, మీరు మరోసారి ఆతోవన వెళ్లినప్పుడు, వంగి నమస్కరిస్తారు. మీరు చూసిన శ్రద్ధ దానిని వెంటనే పవిత్రం చేస్తుంది. అది ఎప్పుడూ అదే, కాని మీరు దానిని గ్రహించలేదు. కాని ఇప్పుడు దాని మీద ఏదో చిహ్నం ఉంచారు, మీరు అది గ్రహించారు.
అందుకే మీరు విగ్రహానికి పెట్టేవే, మీకు మీరు పెట్టుకుంటున్నారు. మీరు దేవునికి కుంకుమ పెడతారు, మీరూ పెట్టుకుంటారు. మీరు విభూది రేఖ దేవునికి ధరింపజేస్తారు, మీరూ పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి మానవునికీ అదే శ్రద్ధ చూపడం ముఖ్యం. మరో వ్యక్తి ఎదురుగా నుంచుంటే మీరు గుళ్ళో దేవుని ఎదురుగా నుంచున్నట్లే, నుంచుంటే, అదేవిధంగా జరగడం మీరు గమనిస్తారు.
మీరు ఒక దానిని పవిత్రమైనదానిని గానూ, మరొక దానిని అసహ్యమైన దానిని గానూ చూస్తే, మీరు దారి తప్పుతున్నట్లే. జీవాన్ని చూడడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ప్రతి దాన్నీ - మిమ్మల్నీ, మీ అమ్మనీ, నాన్ననీ, దేవుడినీ, అన్నింటినీ - అసహ్యమైన వాటిగా చూడండి, మీరు కృతార్ధులౌతారు. అది చాలా కఠినమైనది, కాని త్వరిత మార్గం. లేక అన్నింటినీ మీరు పవిత్రమైనవిగా చూడండి. మీరు కృతార్ధులౌతారు. ఇది ఇంపైన మార్గం. మీకేది నప్పితే అది చేయండి.