ఒకానొకప్పుడు, మనకు తెలిసిన ప్రపంచం మొత్తంలోనూ ప్రతీ వారూ భారత దేశంలో నేసిన వస్త్రాలు ధరించాలని ఉబలాటపడేవారు. అత్యుత్తమమైన వస్త్రాలు ఈ దేశంలోనే తయారయ్యేవి. ప్రపంచమంతా భారత దేశం నేసిన వస్త్రాలే ధరించేది. ఈనాటికయినా, వస్త్రాల విషయానికొస్తే ఈ దేశానిది ప్రత్యేక స్థానం. నిర్లక్ష్యం వల్ల, దురుద్దేశ్యాలవల్ల ఈ దేశపు నైపుణ్యంలో ఎంతో భాగం ఇప్పటికే నష్టమైపోయింది. కానీ ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నన్ని రక రకాల నేత విధానాలూ, రంగులద్దే విధానాలూ, వస్త్రాలు ఉత్పత్తి చేసే విధానాలూ భూగోళంలో మరెక్కడా కనబడవు.

స్వాతంత్ర్యం రావటానికి ముందు వరసగా రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు, మాన్ ఛెస్టర్ లో తమ జౌళి మిల్లులను బతికించుకొనేందుకు, ఈ దేశంలో నేత పరిశ్రమను పద్ధతి ప్రకారం దెబ్బ తీస్తూవెళ్లారు. 1800-1860 మధ్య అరవయ్యేళ్ల కాలంలో, భారత దేశం నుంచి జరిగే వస్త్రాల ఎగుమతులు 94 శాతం పడిపోయాయి. 1830 లలో ఒక బ్రిటిష్ గవర్నర్ జెనరల్, 'భారత దేశంలో మైదానాలన్నీ చేనేత పని వారి ఎముకలతో 'తెల్ల'వారి పోయాయి' అన్నాడు. లక్షలాది చేనేత పనివారు చనిపోయారు.

చేనేత పని ఒక హస్తకళ

అంత జరిగినా ఈ దేశంలో చేనేత నైపుణ్యాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. భారత దేశంలో ఈ నాటికీ 120 రకాల విభిన్నమైన నేత పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ, ప్రతి జన సముదాయం లోనూ, ఆ మాటకొస్తే కొన్ని కొన్ని కుటుంబాలలోనే, వారి వారి ప్రత్యేకమైన నేత పద్ధతులూ, రంగుల అద్దకం పద్ధతులూ ఉన్నాయి.

నాకు సుమారు పదిహేడేళ్ళ వయసు ఉన్నప్పుడు, నేను మా మామయ్య గారి ఇంట్లో కొన్నాళ్లు ఉన్నాను. అక్కడ వేల సంఖ్యలో పట్టు చీరలు నేస్తూ ఉండేవారు. లక్షలాది దారపు పోగులతో చిత్ర విచిత్రంగా, రక రకాల ఆకృతులనూ, విన్యాసాలను నేతనేసి చూపేవారు. అలా నేత చేసేటప్పుడు వాళ్ళ బుర్రలు వేలాది రకాల లెక్కలతో నిండిపోయి ఉండేవి. వస్త్రం మీద అందమైన పుష్పాలను వాళ్ళు అలా పూయిస్తుంటే, నాకు అదో మాయాజాలంలా అనిపించేది. ఆ నేత పనిలో నమ్మ శక్యం కానంతగా గణిత శాస్త్ర విన్యాసాలూ, హస్త కౌశలమూ, విషయ పరిజ్ఞానమూ ఇమిడి ఉండేవి. నిజంగా అదొక ఇంద్రజాలమే!

మానవుడి మేధాశక్తీ, హస్త కౌశలమూ కలిసి వినియోగమయ్యేచోట - అది వంట పనిలో కానివ్వండి, బట్టల నేతలో కానివ్వండి - దాని స్థాయే వేరుగా ఉంటుంది. మనుషులు తగినంత శ్రద్ధతో, ఆసక్తితో, తపనతో ముట్టుకొనే ఏ పనిలోనయినా ఒక విభిన్నమైన విశేషం ఉంటుంది.

బట్టలు కట్టేది సౌకర్యం కోసమా, ఫ్యాషన్ పిచ్చి కోసమా?

కానీ ఈ రోజుల్లో పరిస్థితి వేరుగా ఉంది. నాకు ఎవరో చెప్పారు, ఈ రోజు మీరు ఏ భారతీయ నగరంలోనైనా జన సమూహాలను మోకాళ్ళ కింది భాగాలు మాత్రమే పడేటట్టు ఫోటో తీసి చూస్తే, వాళ్ళలో నూటికి అరవై మంది అమెరికన్ కార్మికులు ధరించే బట్టలు ధరించి ఉండటం చూడచ్చు అని! అందరూ నీలం రంగు డెనిమ్ బట్టలే! ఒకే ఒక్క రంగు !! ఇక బిజినెస్ వర్గాల వాళ్ళంటారా, వాళ్ళు నలభై డిగ్రీల వేడిలో కూడా సూట్లూ, టైలూ ధరిస్తారు. మనకుండే శీతోష్ణ పరిస్థితులలో, టై కట్టుకోవటం అంటే మెడకొక ఉరి తాడు చుట్టుకోవటమే! మనం జీవించే శీతోష్ణ పరిస్థితులకు అనువుగా, మనకు సౌకర్యంగా ఉండే బట్టలు మనం ధరించాలి.

ఆ దృష్ట్యా చూసినా, మనం వేసుకొనే దుస్తులు ప్రాకృతిక, సేంద్రియ పదార్థాలనుంచి తయారయినవై ఉండటం ముఖ్యం. మూడు రోజుల పాటు ప్రకృతి సిద్ధమైన దారాల (ఫైబర్)తో నేసిన నూలు, లినెన్, జ్యూట్ వస్త్రాల లాంటివి ధరించి చూడండి, ఎంత తేడా ఉంటుందో. మీ శరీరం ఎంతో సౌలభ్యాన్నీ, సౌకర్యాన్నీ అనుభవిస్తుంది.

మరి ఈ రోజులలో ప్రపంచ వ్యాప్తంగా ధరించే దుస్తులలో అరవై శాతం 'పోలి- ఫైబర్' తో చేసినవే. మరో దశాబ్దం కాలంలో దారపు పోగుల తయారీలో నూటికి 98 % కృత్రిమ ఫైబరులే ఉంటాయి అని అంచనా. ఈ భూగోళాన్ని కలుషితం చేసే ముఖ్య విషయాలలో ఫ్యాషన్ రెండో స్థానంలో వస్తుంది. మైక్రో పోలి- ఫైబర్ మీ శరీరాల లోకి దూరిపోతున్నది. నేలనూ నీటినీ విషతుల్యంగా మారుస్తున్నది. మన ఆహార చక్రంలో కూడా భాగమౌతున్నది. ఆ పోలీ-ఫైబర్ ను మనం తింటున్నాం, శ్వాశిస్తున్నాం, ఇంకా అనేక రకాలుగా వాడుతున్నాం. పోలి ఫైబర్, సింథెటిక్ బట్టల వల్ల కాన్సర్లూ, ఇతర వ్యాధులూ కలగవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది మన పిల్లల సంక్షేమాన్ని దెబ్బ తీస్తున్నదనటంలో సందేహమే లేదు. కొన్ని పరిశోధనలలో అమెరికన్ జనాభాలో 80% మందికి రక్తంలోనే ప్లాస్టిక్ చేరిపోయిందని తెలియవచ్చింది.

ప్లాస్టిక్ నుంచి సేంద్రియాలకు

మనం మన ప్రాకృతిక ఫైబర్ లనూ, మన చేనేతపరిశ్రమనూ పునరుద్ధరించవలసిన సమయం వచ్చింది. వేలాది సంవత్సరాల నుంచి, తరతరాలుగా ఎన్నో కుటుంబాలు తమకే ప్రత్యేకమైన చేనేత విధానాలను తమ తరవాతి తరాలకు నేర్పుతూ వచ్చాయి. కానీ ఈ రోజు మనకున్న విద్యా విధానం వేరు. ఓ పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి మగ్గం మీద పని చేయటానికి వెళ్తే, వాళ్ళను బాల కార్మికులుగా పరిగణించటం ఆధునిక సంప్రదాయం. చేనేత పనిలో నిపుణులు కావాలంటే, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. చాలా చిన్న వయసు నుంచి దాని మీద బుద్ధి ఉంచాలి. ఒక బాలుడినో, బాలికనో పదిహేడు సంవత్సరాల పాటు స్కూలుకు పంపి, ఆ తరవాత ఈ విద్య నేర్పిస్తామంటే అది జరిగే పని కాదు.

ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణంగా లేని ఈ విద్యా విధానం మార్చి కొత్త విద్యా విధానం ప్రవేశపెట్టాలని మేమొక ప్రతిపాదన పెడుతున్నాం. అదృష్ట వశాత్తూ, 2018 ఆగస్టు నెలలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం, ఇక ముందు స్కూలు చదువు సమయంలో 50 శాతం మాత్రమే విద్య మీద కేంద్రీకృతం కావాలి. మిగిలిన సమయంలో క్రీడలూ, కళలూ, హస్త కళలూ, సంగీతం మొదలైన కార్యకలాపాల మీద దృష్టి పెట్టాలి. ఈ ఆలోచన సాకారమైతే, అప్పుడు బాలబాలికలు చేనేత కళను చిన్న వయసునుంచే నేర్చుకోవచ్చు.

స్కూల్ యూనిఫారంలకు ప్రాకృతికమైన దారాలతో నేసిన వస్త్రాలు వాడే విషయం కూడా మేము పరిశీలిస్తున్నాం. కేరళ రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలు దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలలో కూడా దీని అమలును ప్రోత్సహించాలి. పిల్లల దుస్తులు సేంద్రియ పదార్థాలతో మాత్రమే తయారు చేయాలనీ, అదే వారి ఆరోగ్యానికి మంచిదనీ తెలిపే సందేశాలను ప్రపంచమంతా వ్యాపింప చేయాలి. ఒక్క స్కూళ్ళ లోనే కాదు, సాంప్రదాయికమైన డిజైనులతో, సేంద్రియ తంతువులతో తయారైన యూనిఫారంలను ప్రభుత్వ ఉద్యోగులకూ, టూరిస్టు గైడులకూ, డ్రైవర్లకూ కూడా వర్తింపజేయాలి.

భారతదేశంలోనూ, ఇతర దేశాలలోనూ ఉన్న ఫాషన్ డిజైనర్లు ప్రాకృతికమైన ఫైబర్ వాడి, అందరికీ ఆమోదకరమైన ప్రమాణాలను స్థాపించేలా ప్రోత్సహించాలి. నా వరకూ నేను ఈ దేశం లోని అద్భుతమైన చేనేత కళా కారుల పనితనానికి నిదర్శనాలుగా నిలిచే దుస్తులు ధరిస్తాను. నేను ఇతరులందరికీ - ముఖ్యంగా సంపన్న వర్గాలకు చెందిన వారికి - చేసే విన్నపం కూడా ఇదే. మీ బీరువాలలో ఉన్న దుస్తులలో కనీసం ఇరవై శాతం చేనేత దుస్తులు ఉండాలి. యంత్రాలు నేసిన దుస్తులు కాదు, మనుషులు తమ స్వహస్తాలతో నేసినవి! కనీసం వారానికి ఒక్క సారి అయినా, భారతీయ వస్త్రాలేవయినా ధరించండి. ఇది మీకు వ్యక్తిగతంగానూ, పర్యావరణ రక్షణ పరంగానూ కూడా క్షేమకరం ! అంతే కాదు, మీరు మన తరవాతి తరాల చేనేత కళాకారుల కళకూ కౌశల్యానికీ చేయూతనిచ్చిన వారు కూడా అవుతారు!

శాంతి కోసం ఫాషన్

ఈ సంవత్సరం మహాత్మా గాంధీ నూట యాభయ్యవ జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా మేము కొందరు సుప్రసిద్ధ అమెరికన్ డిజైనర్లను ఆహ్వానించి, వారి సహకారంతో 'ఫాషన్ ఫర్ పీస్' (Fashion for Peace) అన్న కార్య క్రమాన్ని ఆరంభించాం. ఇది వేదికల మీద జరిగే ఫాషన్ ప్రదర్శన కాదు. ఇందులో మేము దాదాపు పదిహేను, ఇరవై మంది ఫాషన్ డిజైనర్లకు భారతీయ చేనేత వస్త్రాలు చూపించాం. నూట పది విభిన్న విధానాలలో నేసిన వస్త్రాలను తీసుకువచ్చాం. ఆ డిజైనర్లు ఈ వస్త్రాలను పరిశీలించి వాటిని తమ డిజైనులలో వాడటం నేర్చుకోవాలని మా ఆశయం.

అంతేకాదు, చేనేత కళాకారులకు మార్కెట్ తో ప్రత్యక్ష సంపర్కం ఉండాలని కూడా మా కోరిక. ఇందుకోసం కూడా ఒక వేదికను ఏర్పరచబోతున్నాం. అందులో ఒక ఆన్ లైన్ పోర్టల్ కూడా భాగంగా ఉంటుంది. ఈ వేదిక ద్వారా ఆసక్తి వున్న కొనుగోలుదారులు నేరుగా చేనేత పని వారి నుండే, కచ్చితమైన ఉన్నత ప్రమాణాలుగల వస్త్రాలను కొనుక్కోవచ్చు.

దీని వలన, రైతులకు కూడా ప్రయోజనం కల్పించే అవకాశం ఉంటుందేమో పరిశీలిస్తున్నాం. రైతులు ఆహార వస్తువులను పండిస్తే, అవి తొందరగా చెడిపోవటం ఒక సమస్యగా మారుతున్నది. దాంతో, ఉత్పత్తులను వెంటనే అమ్ముకోవటం తప్పనిసరి అవుతుంది. అలా కాకుండా, వాళ్ళకు ఉన్న భూమిలో ఏ 30 శాతమో ప్రాకృతిక ఫైబర్లను అందించే పంటల సాగుకు వినియోగిస్తే, వారికి అదొక లాభదాయకమైన పెద్ద వరమే అవుతుంది.

ప్రపంచానికి దుస్తులు

ఒకప్పుడు భారతదేశం వస్త్రాల ఉత్పత్తి విషయంలో విశ్వ విఖ్యాతి కలిగి ఉండేది. కానీ గడచిన దాదాపు నూరు సంవత్సరాల కాలంలో, భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచం చూడనే లేదు. మన దేశంలోనూ, దేశాంతరాలలోనూ ఈ వైభవం వైపు ప్రజల దృష్టిని మళ్ళీ ఆకర్షించేందుకు మేము కొన్ని కార్యక్రమాలను సంకల్పిస్తున్నాం.

ఇప్పుడు దేశంలో నిరుద్యోగ సమస్య గురించి ఎడతెగకుండా చర్చలు జరుగుతున్నాయి గదా! నిజానికి మనం గనక చేనేతను పునరుద్ధరించగలిగితే, మనకు మనుషులే చాలరు! చేనేత వస్త్రాలకు గిరాకీ అంత అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం సరయిన చర్యలు చేపడితే, అచిరకాలంలోనే భారత దేశం మళ్ళీ ప్రపంచమంతటికీ దుస్తులు - అందునా, ఎంతో సుఖంగా ఉండే అనువైన, ప్రాకృతికమైన దుస్తులు! - సమకూర్చగలదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు