మీరే కల్పవృక్షంగా మారండి
కల్పవృక్షం అంటే ఏంటో అందరికీ తెలుసు, కాని అది ఎవరి అనుభవంలో లేదు. ఈ వ్యాసంలో సద్గురు మన మనస్సుని కల్పవృక్షంగా ఎలా చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు.
సద్గురు: మీ మనసు ఐదు విభిన్న స్థితులలో ఉండగలదు. అది జడంగా, అంటే ఏమాత్రం చురుకుదనం లేకుండా ఉండవచ్చు. ఇలాంటప్పుడు అది చాలా ప్రాథమిక స్థితిలో ఉంటుంది. దానికి కొంత శక్తిని అందిస్తే చురుగ్గా అవుతుంది గాని, చెల్లా చెదరైపోతుంది. మరికాస్త ఉత్తేజితం చేస్తే, అది చెల్లా చెదరైపోదు గాని, ఊగిసలాడుతుంది. మరి కొంచెం శక్తినందిస్తే, అది ఒకే దిశలో కేంద్రీకృతమౌతుంది. ఇంకా శక్తినందిస్తే అది పూర్తిగా చైతన్యవంతమై స్పృహలో ఉంటుంది. స్పృహలో ఉన్న మనసు ఇంద్రజాలం లాంటిది. అదొక అద్భుతం. అది అలౌకికానికి వారధి. జడత్వంలో ఉన్న మనసులతో సమస్య లేదు. చాలా సాదా సీదాగా ఆలోచించే, మేధస్సు ఇంకా పూర్తిగా వికసించని వ్యక్తికి ఎటువంటి సమస్యా లేదు. శుభ్రంగా తిని హాయిగా పడుకోగలడు. అతిగా ఆలోచించే వాళ్ళతోనే సమస్య: వాళ్ళు సరిగా తిననూ లేరు, పడుకోనూ లేరు. ప్రపంచంలో మేధావులనబడేవాళ్ళ కంటే, సీదా సాదాగా ఆలోచించే వ్యక్తులే వాళ్ళ శరీరావసరాలని సరిగ్గా చూసుకోగలరు. వాళ్ళలో ఒక విధమైన ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే, మిమ్మల్ని కలత పరచాలన్నా, గందరగోళానికి గురి చెయ్యాలన్నా కొంత వివేచన అవసరం. జడత్వంలో ఉండే మనసు, మనిషి స్వభావంకంటే జంతు నైజానికి దగ్గరగా ఉంటుంది.
మీ మనస్సే కల్పవృక్షం కాగలదు
సృష్టిలో అద్భుతమైన వస్తువు ఏదంటే, అది మీ కంప్యూటరూ కాదు, కారూ కాదు, అంతరిక్షనౌకా కాదు - చైతన్యంతో వాడగలిగితే మీ మనసే. సఫలత అనేది కొందరికి అలవోకగా సిద్ధించి, కొందరికి ఎంతో శ్రమపడితేనేగాని లభ్యం కాకపోవడానికి ముఖ్యకారణం, మొదటి రకం వారు మనసుని తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలిగితే, రెండవ రకం వారు తమ శ్రేయస్సుకి వ్యతిరేకంగా ఆలోచించడమే. బాగా స్థిరంగా ఆలోచించగలిగిన మనసుని అన్ని కోరికలూ తీర్చే "కల్పవృక్షం" అంటారు. అటువంటి మనసుతో మీరేది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు చెయ్యవలసిందల్లా మనసుని ఓ కల్పవృక్షంగా ఎదగగల ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయడం, అంతే కానీ అది అశాంతికి పుట్టిల్లు కాకూడదు. ఏది కోరుకుంటే దాన్ని అభివ్యక్తం చేయగల మానసిక స్థితిని యోగ పరిభాషలో "సంయుక్తి" అంటారు.
ఈ నైపుణ్యం సమదృష్టి నుండి ఉద్భవిస్తుంది. ఒకసారి మీ ఆలోచనల్లోకి ఓ క్రమం వస్తే, మీ భావావేశాలు వాటంతటవి క్రమపద్ధతిలోకొస్తాయి. క్రమంగా మీ అంతశ్శక్తులూ, శరీరమూ కూడా అదే దిశలోకి కేంద్రీకృతమవుతాయి. కాకపోతే, మీరు ఈ ప్రమాణాలను అందుకోవడానికి చేసే ప్రయత్నంలో, దేనికి సిద్ధంగా ఉన్నారన్నదానిని బట్టి, వాటి క్రమం మారవచ్చు. ఈ రోజు ఉన్న వాస్తవ పరిస్థితి గమనిస్తే, మనుషులు వారికి హేతుబద్ధంగా కనిపిస్తేనే తప్ప, ఏ పద్ధతినీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. క్రమేపీ, మీ ఆలోచనలూ, భావాలూ, శరీరమూ, అంతర్గత శక్తులూ- అన్నిటినీ ఒక మార్గంలోకి తీసుకురాగలిగితే, మీరు కోరుకున్నది సృష్టించి చూపగల శక్తి, మీరు నమ్మలేనంతగా పెరుగుతుంది.