మంచివాడిగా ఉండే ప్రయత్నం చేయడం తప్పా??
నైతికత లేకుండా జీవించడమెలానో, ప్రతిదీ ఆనందంగానూ, చక్కగానూ చేయడమెట్లానో సద్గురు వివరిస్తున్నారు.
శంకరన్ పిళ్లై చాలా మంచివాడు, కొద్దికాలం జబ్బు చేసి చనిపోయాడు. మంచివాడు కాబట్టి సహజంగానే సర్వార్గానికి వెళ్లాడు. స్వర్గంలో దేవతలు అతనికి స్వాగతం చెప్పారు. అతని లెక్కల పుస్తకం తెరిచారు. మీకు తెలుసుకదా. వాళ్ల ఖాతా పుస్తకాల్లో మన లెక్కలన్నీ ఉంటాయి. వాళ్లు పేజీలు తిప్పుతుంటే ఒకటి తర్వాత ఒకటి ఈ చివరినుండి ఆ చివరిదాకా అన్నీ మంచి పనులే ఉన్నాయి. దేవతలకిది కొంచెం గందరగోళం కల్పించింది. వాళ్లు శంకరన్ పిళ్లై దగ్గరికి వచ్చి అన్నారు, పిళ్లైగారూ! చిన్న సమస్య వచ్చింది. ఇక్కడ స్వర్గంలో భిన్నరకాల వసతులున్నాయి. ఒక తప్పు చేసినవారికో వసతి, రెండు తప్పులు చేస్తే అంతంకంటే కొంచెం తక్కువస్థాయి నివాసం, మూడయితే అంతకంటే తక్కువ – ఈ విధంగా ఉంటాయి. ఇట్లా ఎన్నో స్థాయిలుంటాయి. కాని అసలు ఏ తప్పూ చేయనివారికి ప్రత్యేకించి ఏ నివాసమూ లేదు. ఇంతవరకూ మీ వంటి వ్యక్తి ఎవరూ ఇక్కడికి రాలేదు. ఒక్క తప్పూ చేయని వారెవరూ రాలేదు. ఇప్పుడు మీకిక్కడ ఎటువంటి నివాసం ఏర్పరచాలో మాకు తెలియడం లేదు.
“ఏమిటీ గోల, నేను ఎంత మంచి మనిషిని, నాకు దగ్గరగా రావడానిక్కూడా ప్రపంచంలో ఎవరూ ప్రయత్నించలేదు. స్వర్గానికి రావాలనే ఆశతోనే నేను జీవించాను. ఇప్పుడిక్కడ కూడా సమస్య ఉందంటే ఎలా” అన్నాడు పిళ్లై. దేవతలు తమలోతాము చర్చించుకొని, “పిళ్లైగారూ! మీరేమీ చింతించకండి. మేము పరిష్కారం కనుక్కున్నాం. మీకు మరో మూడు గంటలు సమయమిస్తున్నాం. ఎలాగూ మీ శరీరం ఇంకా అలాగే ఉంది. మీరు భూలోకానికి వెళ్లి ఒక్క తప్పు చేయండి. మేమప్పుడు మిమ్మల్ని అత్యున్నత స్వర్గంలో ఉంచుతాం. ఇంకా ఏమి మించిపోలేదు. అలా చేయండి.” అన్నారు. శంకరన్ పిళ్లై మళ్లీ బతికోచ్చాడు. అతను కూర్చుని ఏమి చెడ్డపని చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అతనెప్పుడూ చెడ్డపని చేయలేదాయె. అప్పుడతనికి గుర్తుకొచ్చింది, తన పొరుగునే మధ్య వయస్సులో ఉన్న ఒక స్త్రీ తనవైపు కొంటె చూపులతో చూస్తూ ఉండడం. తాను ఉత్తముడు కాబట్టి ఎన్నడూ ఆమెవైపు చూడలేదు. “సరే. వ్యభిచారం చెడ్డపనేకదా” అని ఇప్పుడనుకున్నాడు.
ఆమె ఇంటికి వెళ్లాడు. తలుపు కొట్టాడు. ఆమె తలుపు తెరిచింది. ‘నాకు నువ్వుకావాలి’ అన్నాడు పిళ్లై వెంటనే. “ఏమిటి? పిళ్లైగారూ! మీరు నిన్న సాయంత్రం మరణశయ్య మీద ఉన్నట్లు విన్నానే. ఇదేమిటి?” అన్నదామె. “అదలా ఉంచు. ముందు నువ్వు కావాలి” అన్నాడు పిళ్లై. లోపలికి వెళ్లాడు. స్వర్గానికి వెళ్లే ఉత్సాహం అతనిలో శక్తినింపింది. ప్రకృతి తన పని తాను చేసింది. జరగవలసింది జరిగిపోయింది. పిళ్లై చేతి గడియారం వైపు చూసుకున్నాడు. తన సమయం అయిపోతూ ఉంది. ఆమె ఇంట్లో చనిపోవడం అతనికిష్టం లేదు. ‘నేను వెళ్లిపోవాలి, నేను వెళ్లిపోవాలి’ అని తొందరపడ్డాడతను. చకచకా తలుపు దగ్గరకు వెళ్లాడు. అతన్ని పంపించడానికి ఆమె ద్వారం వరకూ వచ్చింది. అతను వెళ్లిపోతూ ఉంటే ఆమె, “పిళ్లైగారూ! ఇవ్వాళ మీరు నాకింత సంతోషమిచ్చి ఎంత మంచిపని చేశారో తెలుసా?” అన్నది. మళ్లీ మరో మంచిపని..!! మీరు మరీ మంచి వాళ్లయితే మీరు రెంటికీ చెడ్డ రేవడి అవుతారు. మీ మంచితనం మరొకరితోనో, మరొకదానితోనో పోల్చుకోవడం వల్లనే వస్తుంది. అవునా? మిమ్మల్ని మీరు మంచి మనిషి అని ఎలా చెప్పుకోగలుగుతారు? మీరు ఇతరులవైపు చూస్తారు – అతను బాగా లేడు, ఆమె బాగా లేదు – వాళ్లందరితో పోలిస్తే నేను మంచివాణ్ణి. మీరు మంచి వాళ్లు కావాలంటే లోకంలో తక్కిన అందరూ చెడ్డవాళ్లు కావాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, తాము చాలామంచి వాళ్లమనుకునే వారి అభిప్రాయంలో లోకంలోని ఇతరులంతా మంచివాళ్లు కారనే. మీరిది గమనించారా?
మీ నైతికత మిమ్మల్ని పరిణమింపచేయలేదు. ప్రస్తుతం మీరు అతి కష్టం మీద మంచివారుగా ఉండగలుగుతున్నారు. మీకు చైతన్యం లేదు కాబట్టే మీ నైతిక సూత్రాలను పట్టుకొని వేలాడుతున్నారు. మీరీ నైతిక సూత్రాలను వెలుపలి నుండి తీసుకున్నారు – మీ సమజం నుండి, మీ మతం నుండి, మీ వృత్తినుండి. మీరు జీవితాన్ని గుర్తించి, ఆ జీవితానికి స్పందించినట్లయితే మీకు ఈ నీతుల అవసరం లేదని అర్థమవుతుంది. మీరెట్లా ఉండాలో మీకే తెలిసిపోతుంది. హానికరమైనదేదీ మీరసలు చేయనేలేరు. మీరీ విధంగా ఉండాలని ఎవరో చెప్పారని మిమ్మల్ని మీరు నియంత్రించుకోరు. మీరున్న పద్ధతిలోనే కీడు, చెడు అన్నవి ఉండవు. అదసలు మీలో ఉండనే ఉండదు. ఎటువంటి ప్రయత్నం లేకుండానే మీరు మంచివారుగా ఉంటారు. సృష్టిలో ఉన్న ప్రతిదీ ఒకే శక్తి అని, ఆధునిక శాస్త్రవిజ్ఞానం నిస్సందేహంగా నిరూపించింది. ఆ శక్తే కోట్లాది రూపాలను తీసికున్నదని చెప్పింది. మరోవిధంగా చెప్పాలంటే, మీరూ,నేనూ ఒకే శక్తి. ఒక్కక్షణం ఇలా అనుకోండి; మీ చుట్టూ ఉన్న మనుషులందరూ వాస్తవానికి మీలో ఒక భాగమన్న అనుభూతి మీకు కలిగిందనుకోండి.
కేవలం ఆలోచన కాదు, వాస్తవానుభవంలో, మీరు మీ చేతులకున్న పదివేళ్లను ఎలా అనుభూతి చెందుతున్నారో అలా. ఇది జరిగితే నేను మీకు నైతికత గురించీ, నీతిసూత్రాల గురించీ చెప్పవలసిన అవసరం ఉంటుందా? అతనికి కీడు కలిగించవద్దు, ఇతన్ని చంపవద్దు, వాణ్ణి దోచుకోవద్దు అని చెప్పవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. యోగా అంటే సరిగ్గా అదే. యోగం అన్నమాట కలయిక అన్న అర్థంలో వచ్చింది. అక్కడ మీ అనుభవంలో సర్వాన్నీ ఒక్కటిగా చూడగలుగుతారు. మొత్తం యోగ ప్రక్రియ అంతా మీ అవగాహనా భావనను అధిగమించి మొత్తం సృష్టినంతటినీ ఒకటిగా మీరు అనుభూతి చెందే వైపు నడిపించే ప్రక్రియ. లోకంలోని ప్రతి ఒక్కరూ మీలో భాగంగా మీరు అనుభూతి చెందినప్పుడు మీకు ఎవరూ నీతిసూత్రాలు బోధించనవసరం లేదు. మీరు ఆనందంగా ఏది అవసరమో అది చేయగలుగుతారు.