మనస్సాక్షి అంటే ఏమిటి - నేను అది చెప్పేది వినాలా?
మన మనస్సాక్షి చెప్పేది వినడం ముఖ్యమా? ఏది సరైనది, ఏది చేయవచ్చునో, ఏది చేయకూడదో మనం ఎలా నిర్ణయిస్తాము? సద్గురు నైతిక పరిమితులను శోధిస్తూ, దానికీ మన మానవత్వానికి గల భేదాన్ని తెలుపుతారు.
ఏ పని సరైనది …ఏది చేయవచ్చునో, ఏ పని చేయకూడదో మనం ఎలా నిర్ణయిస్తాము? మన మనస్సాక్షి సహాయం చేయగలదా? యోగి, మార్మికుడు అయిన సద్గురుతో మనస్సాక్షి అంటే ఏమిటో చూద్దాం. ఆయన నైతిక పరిమితులను శోధిస్తూ, దానికీకి మన మానవత్వానికి గల భేదాన్ని తెలుపుతారు.
ప్రశ్న: మనస్సాక్షి అంటే ఏమిటి? జీవితంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి మనం దానిని అనుమతించాలా?
సద్గురు: మనస్సాక్షి అంటే మిగతావన్నీ గొప్పగా అనిపించినప్పుడు బాధ కలిగించేది! మీరు దేని గురించి అపరాధభావంతో ఉన్నారో, మీకు ఏది సరైనది లేదా ఏది తప్పు అని భావించడం అనేది తప్పనిసరిగా సామాజిక దృగ్విషయం. అది సామాజిక నిబంధనల ద్వారా మీలోకి ఎక్కించబడింది. నైతికత సమాజానికి సంబంధించినది, అంతేకాదు ఇది ఒక సమూహానికి ఇంకొక సమూహానికి భిన్నంగా ఉంటుంది. చరిత్రలో వివిధ కాలాలు ఇంకా వివిధ భౌగోళిక ప్రదేశాలలో విభిన్న నైతికతలు ఉండేవి. మీ అమ్మమ్మ ఏది అనైతికంగా భావించిందో అది ఈ రోజు మీరు సిగ్గు లేకుండా చేస్తారు. కాబట్టి నైతికత ఎల్లప్పుడూ వ్యక్తికీ వ్యక్తికీ ఇంకా కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి భిన్నంగా ఉంటుంది. దానికి అస్తిత్వంతో సంబంధం లేదు. కానీ మీ మానవత్వానికి అస్తిత్వపరమైన సంబంధం ఉంది.
మీ జీవితంలోని ప్రతి క్షణం మీ మానవత్వం సజీవంగా, చురుగ్గా ఉంటే, ఈ విధంగా లేదా ఆ విధంగా ప్రవర్తించమని ఎవరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ మానవత్వాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైనందున సమాజం దానిని నైతికతతో సరిదిద్దడానికి ప్రయత్నించింది. కానీ ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన ప్రతి నైతికతను పొందినప్పటికీ మనం ప్రపంచాన్ని సరిదిద్దలేకపోయాము. నైతికతతో మీరు మీ చుట్టూ ఉన్న మిగిలిన వ్యక్తులతో నటించడం నేర్చుకున్నారు. మీలోపల అర్ధంలేనివి అన్నీ ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. మీ మానవత్వం సంపూర్ణంగా ఉంటే మీకు నైతికత అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే బాగా జీవిస్తారు.
Manasakshi and Chaitanyam - చైతన్యం ఇంకా మనస్సాక్షి
నైతికతతో మీరు మనస్సాక్షిని అభివృద్ధి చేస్తారు, చైతన్యాన్ని కాదు. మీ మానవత్వం సంపూర్ణంగా ఇంకా పూర్తి చురుగ్గా ఉన్నట్లయితే మీకు ఎటువంటి నైతికత అవసరం లేదు. నైతికత అనేది మానవత్వానికి అనుకరణ. నైతికత ద్వారా సమాజంలోని కొన్ని విషయాలను పరిష్కరించవచ్చు కానీ అది మానవుని అంతర్గతంలో అల్లకల్లోలం కలిగిస్తుంది. మానవత్వం కూడా సామాజిక క్రమాన్ని తీసుకువస్తుంది కానీ ఎటువంటి బలవంతము లేకుండా వదులుగా ఉంటుంది. అది మనిషిని అందంగా మారుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. మానవత్వం వికసించి, అది పొంగిపొర్లితే ఇక సహజంగానే, దైవత్వం తదుపరి దశ అవుతుంది. మీలో మానవత్వం పొంగిపొర్లడానికి మీరు అనుమతిస్తేనే దైవత్వం పుష్పిస్తుంది. మానవత్వం అనే గొప్పతనం లేకుండా మీరు ఏమి చేసినా దైవత్వం జరగదు.
నైతికత ఎప్పుడూ దైవత్వాన్ని తీసుకురాలేదు. ఇది అపరాధభావం, అవమానం ఇంకా భయాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే నిర్దేశించిన నైతికతలను ఎవరూ నెరవేర్చలేరు. ప్రపంచంలోని ప్రధాన మతాలు పాపం అని పిలిచే అన్ని విషయాల జాబితాను రూపొందించండి. మీరు అసలు జీవించడంమే పాపం అని చూడొచ్చు. మీరు చేసేది ఏదైనా పాపం. మీ జన్మ పాపం. జీవిత ప్రక్రియ పాపంగా భావించబడుతోంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ అపరాధ భావంతో ఇంకా భయంతో ఉంటారు.
భారతదేశం నైతికత లేని సంస్కృతి. "మీరు ఇదే చేయాలి లేదా మీరు ఇది చేయకూడదు" అని మీకు చెప్పడానికి రాతిలో చెక్కబడిన నీతులు ఏవీ లేవు. మనం ఎన్నడూ నైతికతపై ఆధారపడలేదు. ఎందుకంటే మానవాళిని పెద్ద ఎత్తున కదిలించగల సామర్థ్యం ఉన్న మనుషులను మనం సృష్టించాము. కాబట్టి నైతికత లేదా నైతిక నియమావళి అవసరం ప్రతి తరంలో ఎప్పుడూ తలెత్తలేదు.
మానవాళికి మూడు ముఖ్యమైన అంశాలు
ఈ మానవత్వాన్ని కదిలించడానికి మేము మూడు ప్రాథమిక అంశాలను ఏర్పాటు చేసాము. ఒకటి సృష్టి మూలం పట్ల సంపూర్ణ మక్కువ కలిగి ఉండటం. ఇది ఈ సంస్కృతిలో ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. ప్రజలు ఒక పట్టణాన్ని లేదా నగరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు, ముందుగా ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించేవారు. ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తులు గుడిసెలలో నివసించారు కానీ వారు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బాగా కనబడుతుంది. ఇతర రెండు ప్రాథమిక అంశాలు ఏమిటంటే మీ చుట్టూ ఉన్న అన్ని జీవుల పట్ల అనురక్తితో ఉండటం ఇంకా మీ పట్ల వైరాగ్యం కలిగి ఉండటం. మీరు ఈ మూడు విషయాలను పాటిస్తే మీ మానవత్వం ఎల్లప్పుడూ వికసించి ఉంటుంది. లేకపోతే మీ మానవత్వం స్విచ్ ఆఫ్ అవుతుంది, మీరు నైతికత ఉన్న ఒక నకిలీ మనిషిలా నటించవలసి ఉంటుంది. అప్పుడు మీరు మనస్సాక్షిని అభివృద్ధి చేసుకుంటారు.