‘మీకు మీరే ఆనంద స్వరూపులైతే, మీకు అద్భుతమైన  సంబంధాలు ఉంటాయి’ అంటారు సద్గురు.

సద్గురు: ఈ ప్రపంచంలో వివిధ రకాలైన సంక్లిష్టమైన వ్యవహారాలు జరుగుతుంటాయి. మీ వ్యవహార పరిధి పెరిగీకొద్దీ, ఈ సంక్లిష్టతలు పెరుగుతూనే ఉంటాయి. మీరు ఒక చిన్న గదిలో వేరే ఒక వ్యక్తితో పని చేస్తున్నట్లయితే మీకు అతనిమీద అవగాహన ఉంటే సరిపోతుంది. కానీ మీరు వెయ్యి మందితో పని చేస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరి గురుంచి మీకు ఎంతో అవగాహన అవసరం. మీరు ఒక వెయ్యి మందితో పనిచేస్తూ, వారందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటే మాత్రం మీరు దేనినీ సరిగా నిర్వహించలేరు. మీరు ఈ వెయ్యిమంది సామర్థ్యాలను, పరిధులను అర్ధం చేసుకుని వ్యవహరించాలి. అప్పడు మాత్రమె పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకోగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. కానీ మీరు ఈ వెయ్యి మంది మిమ్మల్ని అర్థంచేసుకోవాలని ఎదురుచూస్తుంటే మాత్రం, అది ఒక నెరవేరని కలే అవుతుంది. అంటే ఎప్పటికీ అది జరుగదు. 

ఎంత దగ్గర సంబంధం అయితే వారిని అర్థం చేసుకోటానికి మీరు అంత శ్రమించవలసి వస్తుంది. మీరు వారిని బాగా అర్థం చేసుకున్నకొద్దీ మీకు వారు దగ్గర వారవుతారు.

ఎంత దగ్గర సంబంధం అయితే వారిని అర్థం చేసుకోటానికి మీరు అంత శ్రమించవలసి వస్తుంది. మీరు వారిని బాగా అర్థం చేసుకున్నకొద్దీ, మీకు వారు దగ్గర వారవుతారు. వారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటే, వారు ఆ సంబంధాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు. మీరు వారిని బాగా అర్థం చేసుకుంటే, మీరు ఎక్కువ ఆస్వాదిస్తారు. 

అవతలి వ్యక్తికి ఏ విధమైన అవగాహనా లేదనుకోవద్దు. వారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకునేటట్లు, సరైన పరిస్థితులు, మీరు మీ అవగాహనతో కల్పించవచ్చు. మీరు అవతలి వ్యక్తి అవసరాలను, పరిమితులను, సామర్థ్యాలను అర్థం చేసుకోకుండా, అవతల వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో ఎప్పుడు ఏకీభవిస్తూ ఉండాలంటే, అప్పుడు ఖచ్చితంగా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అదే ఖచ్చితంగా జరుగుతుంది. దురదృష్టవశాత్తూ, ప్రపంచంలో అతిదగ్గర సంబంధాలతోనే, శత్రువులతోకన్నా ఎక్కువ గొడవలు వస్తుంటాయి.

నియంత్రణ రేఖ

మీ సంబంధాల్లో చాలా ఘర్షణలు జరిగి ఉంటాయి, బహుశా ఇంకా అవి జరుగుతూనే ఉంటాయి. అవునా? ఎందుకంటే మీరు అర్థం చేసుకునే పరిధి, వారి పరిధి వేరువేరుగా ఉంటాయి.  మీరు ఆ పరిధి దాటితే, వాళ్లకి పిచ్చెక్కుతుంది, అదే వారు ఆ పరిధి దాటితే, మీకు పిచ్చెక్కుతుంది. కానీ మీ అవగాహన వారి అవగాహనకి మించినదైతే, వారి అవగాహన మీ అవగాహనా పరిధిలో భాగమైపోతుంది. అప్పుడు వారి సామర్థ్యాలను, పరిమితులను మీరు అర్థం చేసుకోగలగుతారు. ప్రతివారిలోనూ కొన్ని అనుకూల విషయాలు, కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయి. మీరు వాటన్నింటినీ మీ అవగాహనా పరిధిలోకి తెచ్చుకుంటే, మీకు కావాల్సిన విధంగా మీరు ఆ సంబంధాన్ని తయారు చేసుకోవచ్చు. అదే మీరు దానిని వారి అవగాహనకు వదిలేస్తే, అది ఏదో యాదృచ్చికమై పోతుంది. వారు పెద్ద మనసు కలవారైతే మీకు కావలసినవి జరుగుతాయి లేకపోతే బాంధవ్యం తెగిపోతుంది.

మీ అవగాహనని పెంచుకోండి

నేను అనేది ఏమిటంటే, మీ జీవితంలో ఏమి జరగాలో నిర్ణయించాల్సింది మీరే కావాలనుకోవటంలేదా? అవి దగ్గర సంబంధాలు, వృత్తి పరమైన సంబంధాలు, రాజకీయ,  ప్రాపంచక, ఏవైనా సరే, మీ జీవితంలో ఏమి జరగాలో నిర్ణయించవలసింది, మీరే కదా?

మీ అవగాహనని ఎంతవరకు పెంచాలంటే, వారి పిచ్చికి అతీతంగా మీరు చూడగలగాలి.

మీకు అలా కావాలనుకుంటే, మీరు అన్నింటిని, అందరిని, మీ అవగాహనలో భాగం చేసుకోవాలి.  మీ అవగాహనని ఎంతవరకు పెంచాలంటే, వారి పిచ్చికి అతీతంగా మీరు చూడగలగాలి. మీ చుట్టూ ఎంతో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, కానీ ఒక్కోసారి వారికి కొన్ని నిమిషాలపాటు అలా పిచ్చిగా ప్రవర్తించాలనుకుంటారు. అది మీరు అర్థం చేసుకోకపోతే, మీరు వారిని కోల్పోతారు. అదే మీరు వారిని అర్థం చేసుకుంటే, వారితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలుస్తుంది. జీవితం ఎప్పుడూ ముక్కుసూటిగా ఉండదు. అది కొనసాగటానికి మీరు ఎన్నో చేయవలసి వస్తుంది. మీరు మీ అవగాహనని చేజార్చుకుంటే, మీ సామర్ధ్యాన్ని కోల్పోతారు. అది మీ వ్యక్తిగతమైన సంబంధాలైనా, వృత్తిపరమైన వ్యవహారమైనా, ఏదైనా సరే, రెండు చోట్లా మీకు అవగాహన కావాలి, లేకపోతే మీకు సఫలమైన సంబంధాలు ఉండవు.

ప్రస్తుతం మీరున్న పరిస్థితిలో, మీ జీవితం యొక్క స్వభావం, మీకు ఏ రకమైన సంబంధాలు ఉన్నాయో, అవి నిర్ణయిస్తాయి. అందువల్ల ప్రయత్న పూర్వకంగా, మీరు మీ చుట్టూ ఉన్నవారిని అర్థంచేసుకోవలసిన  అవసరం ఉంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు