మూఢ నమ్మకాలకు శాస్త్రపరమైన ఆధారాలున్నాయా?
మూఢ నమ్మకాలకు శాస్త్రపరమైన ఆధారాలున్నాయా? లేక ఇవి మానవాళిని తప్పుదారి పట్టించే హేతుబద్ధంకాని నమ్మకాలా? సద్గురు రెండు వైపుల నుంచీ తరచి చూస్తున్నారు.
సద్గురు: చాలా మంది లక్కీ స్టార్, లక్కీ ప్లానెట్, లక్కీ నెంబర్, అలాంటి వాటికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో తమకై తాము,తేలిగ్గా సృష్టించుకోగలిగే వాటినెన్నో కోల్పోతున్నారు. మీ జీవితంలో ఏపార్శ్వమైనా సరే, అది కేవలం మీ చేతుల్లోనే ఉంది, మీరే చేసుకోవాలి. మీ ప్రశాంతత, మీ బాధ, రెండూ మీకు సంబంధించిన విషయాలే. మీ ఆనందం మీ దుఃఖం ఈ రెండూ కూడా మీ వ్యవహారమే. అంతే కాదు, చివరికి మీలో ఉన్న దైవం .. దెయ్యం... ఇవి కూడా మీ తలనొప్పులే. మీరేదో అలా గాలికి బ్రతుకుతున్నప్పుడు, ఎప్పుడూ భయాందోళనల్లోనే జీవిస్తారు. అలా కాకుండా మీ సామర్థ్యాలతో, కావలనుకున్నట్లు జీవిస్తుంటే, అది జరిగినా, జరగక పోయినా బాధపడనవసరంలేదు, కనీసం మీలో జరిగే దానిపట్ల మీకు నియంత్రణ ఉంటుంది. అది మరింత స్థిరమైన జీవితం.
కోనేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది.. నాకు తెలిసిన ఒక మహిళ ఒకరోజు ఓ ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ కి తయారౌతోంది. తమిళనాడులో చాలా మంది ఇది నమ్ముతారు-- అదేమిటంటే మీ కారుని ఉదయాన్న స్టార్ట్ చేసినప్పుడు అది రివర్స్ గేర్ లో, అంటే వెనక్కి వెళ్లకూడదని. ఒకవేళ అలా జరిగితే మీ జీవితమంతా వెనక్కి వెళుతుందని వాళ్ళు నమ్ముతారు. అందుకే ఉదయాన్నే కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకి తీసుకెళతారు. ఈమె ఈ ఉద్దేశ్యంతోనే కార్ స్టార్ట్ చేసింది కానీ, మీటింగ్ గురించి ఉన్న ఆందోళన వల్ల కొద్దిగా ముందుకి తీసుకెళ్లవలసిన కార్ ని క్లచ్ గట్టిగా నొక్కి పెట్టి, ఎదురుగా ఉన్న గోడని కూల్చి ఏకంగా బెడ్ రూంలోకి నడిపించేసింది!
మనక్కావలసింది జరగడానికి కావలసిన బాహ్య అంతర్గత పరిస్థితులను ఏర్పరచుకునే బదులు, అది సాధించుకోవడానికి ఎప్పుడూ మరిదేనికోసమో వెతుక్కుంటూ ఉంటాం. ఈ రోజుని మీరెలా అనుభూతి చెందుతున్నారన్నది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది, అంతేగానీ మీరు విశ్వసించే మూఢ నమ్మకాలు దీన్ని నిర్ణయించలేవు. మీ చుట్టూ ఉన్న జీవితాన్ని మీరెంత తెలివితో, ఎంత వివేకంతో, ఎంత ఎరుకతో చూడగలుగుతున్నారు, అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
అయితే ఇదంతా బూటకమేనా? అలాగనీ అనలేము. చాలా మూఢనమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలున్నాయి, అయితే కాలక్రమేణా ఇవి ఘోరంగా వక్రీకరించబడ్డాయి, తరాలు మారుతున్నకొద్దీ ఈ శాస్త్రం తన సారాన్ని పూర్తిగా కోల్పోయి ప్రస్తుతం మరేదో అయింది. అంతే కాదు, ఈనాడు ఉన్న రాజకీయ, ఇతర ప్రాబల్యాల వలన పాశ్చాత్య దేశాలనుండి వచ్చినదే విజ్ఞానమనీ, తూర్పు నుండి వస్తే మూఢనమ్మకమన్న నిర్ధారణకు వచ్చేసాం మనం. మన సంస్కృతిలో ఇన్నాళ్ళూ అనుకున్న అనేక విషయాలను, ఈనాడు ఎన్నో కోట్ల డాలర్లు వెచ్చించి చేసిన పరిశోధనల తర్వాత మానవ స్వభావం గురించిన గొప్ప ఆవిష్కరణలుగా చెబుతున్నారు. మనకివన్నీ అనాదిగా తెలిసినవే, ఎందుకంటే ఇది ఏ నిర్బంధనలనుండో పుట్టిన సంస్కృతి కాదు. ఋషుల, మునుల మార్గదర్శకత్వంలో ఎదిగిన సంస్కృతి ఇది. దీని వెనుక ఓ ప్రగాఢ శాస్త్రీయత ఉంది. మనమెలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఆహారమేలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మానవ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినవే. దురదృష్టవశాత్తూ, ఈవేళ మనం చూసే ఈ ఆధ్యాత్మిక సంస్కృతి ఎన్నో దండయాత్రలకు, మరెన్నో క్షామాలకు గురై చిన్నాభిన్నమైయింది. అయినప్పటికీ, ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మూలాలు నాశనం కాలేదు, అవి నాశనం కావు కూడా. ఈ ప్రగాఢ సంస్కృతిని పునరుద్ధరణ చేసి, మళ్ళీ దాని ప్రయోజనాలను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది.
ప్రేమాశీస్సులతో,