పిల్లలు ఏ వయస్సులో యోగా నేర్చుకోవాలి?
పిల్లలు ఏ వయస్సులో యోగా నేర్చుకోవాలి, అన్న విషయంపై సద్గురు జవాబు ఇస్తున్నారు.
ప్రశ్న: ఈ ప్రశ్న నా కుమార్తె విషయంలో. ఆమె వయస్సిప్పుడు తొమ్మిదేళ్లు. ఆమెకు ఈ వయస్సులో యోగా పరిచయం చేయవచ్చునా – ఆమె తన మార్గం వైపు ప్రయాణించడానికి ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా సన్నద్ధం కావాలి కదా!
సద్గురు: యోగా మిమ్మల్ని జీవితానికి దూరంగా తీసుకెళ్లేది కాదు. ఇది మీ జీవితానికి బలమైన ఉన్నతినిస్తుంది. అందువల్ల ఎప్పుడు మొదలుపెట్టాలో చెప్పండి? అరవై ఏళ్లకా, సాధ్యమైనంత త్వరలోనా?
ఏడేళ్ల వయసు సరైన సమయం. అయినా మీరు తొమ్మిదేళ్లు ఎదురు చూశారు. అంటే ఇది సరైన సమయమే. బిడ్డ తెలివైన ఎంపిక చేసుకొనేందుకు తగినన్ని ప్రత్యామ్నాయాలందించడం చాలా ముఖ్యం. ఎంపిక చేసుకునే అవకాశం వాళ్లకు ఇవ్వకపోతే, ప్రపంచం గురించి ఎప్పుడూ బోధించిందే నిజమనుకుంటారు. అప్పుడు వాళ్ళకు తెలిసిన ఎంపిక కేవలం శీతలపానీయాలకూ, పిజ్జాలకూ మధ్యే తప్ప, మరేమీ ఉండదు.
బిడ్డకు చిన్న వయస్సులోనే సరైన విషయాల పరిచయం కలిగించాలి. ప్రపంచంలో మనచుట్టూ మనం చేసే ఏర్పాట్లను కొంతవరకే మనం నిర్వహించగలం. మీ సంక్షేమం బాహ్య పరిస్థితులకు లోబడి ఉన్నంతకాలం, మీరు క్షేమంగా ఉండడం యాదృచ్ఛికమే. ఎందుకంటే బాహ్య పరిస్థితులను ఎవరూ 100% నియంత్రించలేరు. పెరుగుతున్న జనాభాను చూసినట్లయితే తరువాతి తరం ఎటువంటి బాహ్య పరిస్థితులు కల్పిస్తుందో మనకు తెలియదు. 2050 నాటికి మన జనాభా 960 కోట్లు అవుతుందంటున్నారు. నేనింకా అప్పటిదాకా ఉంటాననుకోను, కాని మీ అమ్మాయి మాత్రం ఉంటుంది. ఆమెకు మనుగడ సాగించడానికి ప్రత్యేక నైపుణ్యాలు కావాలి కదా. అదంత తేలిక కాదు.
మీరిది ఒకసారి ఊహించండి, ఇప్పుడు ఉన్న స్థలంలోనే మరో 35% మంది అధికంగా ఉంటే ఎలా ఉంటుందో – ఆ అనుభవాన్ని ఊహించుకోండి. మీరు చాలా చాలా దగ్గరగా కూర్చోవలసి రావచ్చు. కనీసం మీకు యోగా తెలిస్తే కొద్ది స్థలంలో సౌకర్యంగా ఎలా కూర్చోవచ్చో తెలుస్తుంది. మీరు ఏ భంగిమలోనైనా సౌకర్యంగా కూర్చోవచ్చు.
యోగా మన విద్యావ్యస్థలో భాగమవ్వాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం ఈశా ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా భారతదేశంలో 25,000 పాఠశాలల్లో మూడుకోట్లమంది పిల్లలకు సాధారణమైనదే అయినా శక్తిమంతమైన యోగాభ్యాసాలను అందించే లక్ష్యాన్ని పెట్టుకున్నాం.
పిల్లలు ఎటువంటి యోగా నేర్చుకోవాలి?
ప్రశ్న: పిల్లల కోసం ప్రత్యేకమైన యోగా ఏదైనా ఉందా?
సద్గురు: ఆరేడేళ్ల వయస్సు నుండి పిల్లలు చేయగలిగిన సాధారణ యోగాభ్యాస రూపాలున్నాయి. అయితే కొన్ని వారికి బోధించకూడదని జ్ఞాపకం పెట్టుకోవడం ముఖ్యం. కొన్నిచోట్ల పిల్లలకు పద్మాసనం నేర్పడం చూశాను. అలా చేయకూడదు. ఎముకలు పెరుగుతూ ఉన్నప్పుడు, మెత్తగా ఉన్నప్పుడు కొన్ని ఆసన భంగిమలు వారి అస్థి వ్యవస్థపై ఒత్తిడి కలిగించి ఎముకలు వంగిపోయేటట్లు చేస్తాయి.
యోగా నేర్పేవారు పిల్లలకు తగిన పద్ధతి ఏమిటో తెలుసుకోవాలి. వ్యక్తి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా యోగా నేర్పాలి. పెద్దలకు నేర్పేవన్నీ పిల్లలకు నేర్పకూడదు. పెద్దల విషయంలో కూడా గృహస్థులకు నేర్పవలసిన యోగా వేరు, సన్యాసులకు నేర్పవలసిన యోగా వేరు. సన్యాసి పూర్తిగా భిన్నమైన పద్ధతిలో యోగా నేర్చుకుంటాడు. అందరికీ ఒకే విధమైన యోగా నేర్పకూడదన్నది చాలా ముఖ్యం.
పిల్లలకు యోగా ఎలా నేర్పాలి?
ప్రశ్న: పిల్లలకు యోగా పరిచయం చేయడమెలా. వారిలో పిన్న వయస్సులోనే యోగా నేర్చుకోవాలనే తపన కలిగించడమెలా?
సద్గురు: నాద యోగా అని ఒకటుంది. ధ్వనుల మీద నైపుణ్యం సాధించడమే ఇది. పిల్లలకు యోగా బోధించడంలో నాదం అతి సాధారణమూ, అతిసుందరమూ అయిన పద్ధతి. పిల్లల మనస్సు, శరీరాల సముచిత అభివృద్ధికి, స్వస్థతకు అది ఉపయోగపడుతుంది. యోగ నమస్కారాల వంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. వీటిని ఆరేడేళ్ల పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. పిల్లలకూ, పెద్దలకూ కూడా ఉపయోగపడే ఉప యోగా పద్ధతులు కూడా ఉన్నాయి.
యోగా ప్రయోజనాలు వారి అనుభవంలోకి వచ్చినప్పుడు, శక్తి సామర్థ్యాల విషయంలో తాము ఇతరులకంటే మెరుగ్గా ఉన్నట్లు వాళ్లు గుర్తించినప్పుడు, సహజంగానే యోగాలోని ఉన్నత రూపాలను అవలంబిస్తారు. వాళ్లతోపాటు వాళ్ల యోగా కూడా వృద్ధి చెందుతుంది.