ప్రతిదినం మాతృదినోత్సవమే!
త్యాగం, ప్రేమలకు మారుపేరు మాతృమూర్తి. ప్రతివారి జీవితంలో వారి కన్నతల్లి పాత్ర అమూల్యమైనది. అలాంటి మాతృమూర్తి గౌరవార్థం, కృతజ్ఞతా పూర్వకంగా మాతృదినోత్సవం జరుపుకోవడం చాలా మంచి విషయం. ఐతే, ఒక్క కన్నతల్లే కాక, ఇంకా ఎన్నో మాతృత్వ-పితృత్వ శక్తులు ఉన్నాయని, వాటన్నటి పట్ల నిరంతరం కృతజ్ఞతా భావంతో ఉండాలని సద్గురు అంటున్నారు. సద్గురు ఇలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి!
ఇప్పుడు మీ ఈ శరీరంలో మీ తల్లి గర్భం నుంచి సంక్రమించింది దాదాపు లేనట్లే, అది చాలా వరకు బయటికి వెళ్లిపోయింది. మీరు మోస్తున్న మీ శరీర బరువంతా భూమాత నుండి గ్రహించినదే. ఇలా మాట్లాడి నేను మీకు జన్మనిచ్చిన తల్లిని కించపరచట్లేదు. మీరు ఆధ్యాత్మికాన్వేషకులు అయితే, ప్రతిదానిని సరైన దృష్టి కోణంతో అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. మీరు కనుక ఏ విషయాన్నైనా మీ మనస్సు లేదా మీ మనోభావాలతో ఎక్కువ చేసి చూస్తే, మిమ్మల్ని మీరు తప్పుదోవ పట్టించుకుంటారు. తద్వారా చాలా విలువైన మీ సమయాన్ని, జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటారు.
ఉదాహరణకు, మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే దానిని పదింతలు ఎక్కువ చేసి చూపిస్తారు. ఎవరినైనా ద్వేషించినా అంతే చేస్తారు. అలాగే ఇష్టపడినా ఎక్కువ చేసి చూపిస్తారు. ఇష్టం లేకపోయినా అలాగే చేస్తారు. ఎక్కువ చేసి చూపడమంటే అర్థం, అప్రయత్నంగానో లేక ప్రయత్న పూర్వకంగానో మీరు వాస్తవం నుంచి ప్రక్కకు వెళుతున్నారు. వాస్తవం నుంచి ప్రక్కకు వెళ్ళడమంటే మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. తనకు తానే వ్యతిరేకంగా పనిచేసుకుంటున్న వ్యక్తికి వేరే శత్రువులు అవసరం లేదు. దీనినే తనకు తానే సహాయం చేసుకోవడం అంటాం. మీ జీవితంలోని అందం ఇదే. అంటే మీరు సంపూర్ణ స్వయం సమృద్ధులు.
మరి అటువంటప్పుడు ఈ ప్రకృతికి, మీ చుట్టూ ఉన్న వారు మీకు అందిస్తున్న ప్రతి దానికి మీరు తలవంచి కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం లేదా? మీరు కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే అడగకుండానే సహకారం అందిస్తున్న ఈ శక్తుల సహాయం లేకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగించలేరు. అటువంటి వీటిని మీరు అభినందించకపోతున్నారంటే, మీరు వాటి పట్ల అసలు స్పృహతో లేరంటే, దానికి కారణం మీ బుర్రలో జరుగుతున్న ఏవో వ్యర్ధమైన వాటితో మీరు బిజీగా ఉండటమే. ఇదంతా గమనించ లేకపోవడానికి అదొక్కటే కారణం. మీ గురించి మీరు చాలా ఎక్కువగా భావించడం వల్లే మీ బుర్రలో జరిగేది మీకు ముఖ్యం అనిపిస్తుంది.
నిశితంగా గమనించినట్లయితే ఈ సృష్టిలో ఏ ఒక్కటి కూడా మీకు అవసరం లేకుండా సృష్టించబడలేదు. ఆందుకే మిమ్మల్ని నేను ప్రతిదానిలోను ఒక తల్లిని చూడమంటున్నాను. ఈ రోజు వృక్షమాతృ దినోత్సవం, రేపు పర్వతమాతృ దినోత్సవం, ఆ పై మీకు జన్మనిచ్చిన తల్లికి సంబంధించిన మాతృ దినోత్సవం. ఇలా ప్రత్యేకమైన రోజులను పెట్టింది ఎందుకంటే అవి లేకపోతే ప్రజలు తమ మాతృమూర్తులను అసలే గుర్తుతెచ్చుకోరు. సంస్కృతి అలా తయారైపోయింది. కాని కొంచెం స్పృహతో, మీకు మీరే ఈ విషయాలను గుర్తు చేసుకొని, "ఓఁ, ఈ చెట్లు నాకు ప్రాణవాయువును ఇస్తున్నాయి. ఇవి ప్రతి క్షణం నాకు సహాయపడుతున్నాయి" అని తలచుకుంటే, ఇలా దీనిని మీరు ప్రతి విషయంలో, మీరు వేసే ప్రతి అడుగులో గుర్తించగలిగితే, మీరు చైతన్య మూర్తులవుతారు.