ప్ర: నమస్కారం సద్గురు. నా ప్రశ్న, లింగ భైరవి పుణ్యపూజ గురించి. నేను కొన్ని వారాల క్రితం మా ఇంట్లో పుణ్యపూజ జరిపించుకున్నాను. ఈ పూజ ఎలా పనిచేస్తుందో తెలుపగలరా? ఈ పూజా విధానం సాంప్రదాయమైన పూజలకు భిన్నంగా అనిపించింది.

సద్గురు: మీరు సాంప్రదాయ బద్ధమైన పూజలను ఇంతవరకు చూడలేదు. ఎక్కువగా వృత్తి పరమైన పూజలను మాత్రమే చూసారు. ఇది వృత్తి పరమైన పూజ కాదు. మీ ఇంటికి వచ్చిన వారు (ఆశ్రమంలో వారిని 'మా' అని పిలుస్తాం) వృత్తిపరమైన పూజరిణులు కారు. వారు తమ జీవితాన్ని ధారపోసి ఈ పూజను నిర్వహిస్తున్నారు. ఇంతకీ, ఈ పుణ్యపూజ అంటే ఏమిటి, ఇంకా ఈ పూజ ఇంత ప్రభావాన్ని ఎలా కలిగిస్తోంది?

పుణ్యం అంటే ఏమిటి? 

దురదృష్టవశాత్తు మనం వేటిని పాప పుణ్యాలని అంటామో, వాటి అర్థాలు కాలంతో పాటు బాగా వక్రీకరించబడ్డాయి. మీ లో జీవ కళను పెంపొందించే చర్యలు పుణ్యమనీ, మిమ్మల్ని జడత్వం వైపు నడిపించే చర్యలు, అదే మరోలా చెప్పాలంటే మిమ్మల్ని మృత్యువు వైపు నడిపించే చర్యలే పాపమని అర్థం. నేను మరణం అన్నప్పుడు శారీరిక మరణాన్ని మాత్రమే సూచించట్లేదు - ఇంకావేరే విధాలుగా కూడా చనిపోవచ్చు.

మీరు ఒక పూర్ణ చంద్రుణ్ణి చూసి ఎంత కాలం అయింది?

చివరి సారిగా సూర్యోదయాన్ని ఎప్పుడూ చూసారు?

మీరు చివరి సారిగా ఒక పువ్వు వికసించటాన్ని ఎపుడు చూసారు? అసలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా?  

జీవనక్రమంలో చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు, ప్రతి నిమిషం జరుగుతున్నాయి. మనుషుల్లో ఎక్కువ శాతం వీటన్నిటి పట్ల నిర్జీవులై ఉన్నారు. వారు చందమామను గమనించలేరు, ఒక సూర్యోదయాన్ని లేదా సూర్యాస్తమయాన్ని గమనించలేరు. ఎప్పుడైతే వారికి పొద్దున్నే ఏదో ఒక పని పడుతుందో అప్పుడు మాత్రమే సూర్యుడు వారి కంట్లో పడతాడు. ఇది ఎందుకు ఇలా అవుతోందంటే, వారి మానసిక స్థితి ప్రభావం, విశ్వ ప్రభావాన్ని ఆవరించేసింది. మీ వెర్రి మానసిక కాల్పనికత, సృష్టికర్త సృష్టినే అధిగమించింది.

పుణ్యపూజ అంటే ఏమిటి? - జీవం పట్ల సచేతనులు కావటం

పుణ్యపూజ అంటే మిమ్మల్ని ఒక శక్తితో కూడిన ప్రదేశానికి తీసుకు వెళ్లడం, ఎక్కడైతే మీరు జీవశక్తికి సచేతనులు అవుతారో అలాంటి ప్రదేశానికి తీసుకు వెళ్లడం... ఎందుకంటే, కేవలం జీవశక్తి మాత్రమే జీవనాన్ని ఉత్తేజపరుస్తుంది. మీలోని జీవశక్తిని మెరుగు పరుచుకోవడానికి ఉన్నమార్గం ఇదొక్కటే. మీరు ఇది అర్థం చేసుకోవాలి, మీరు జీవించాలి అంటే జీవాన్ని మీరు స్వీకరించాలి. ఒక కూరగాయ రూపంలోనో, ఒక ధాన్యం రూపంలోనో, లేదా ఒక జంతువు రూపంలోనో.. ఉదాహరణకి ఒక పక్షీ లేదా చేప, ఏదో ఒకటి. బ్రతుకు సాగించటానికి ఒక జీవం మరొక జీవాన్ని ఆరగిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఒక జీవం మరొక జీవాన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. అది కేవలం నోటి ద్వారా కానక్కర్లేదు. ప్రతి క్షణం విశ్వంలో జరిగేది ఇదే. ఈ విశ్వమంతా ఒక సజీవమైన స్థితిలో ఎప్పుడూ ఉంటుంది ఒక జీవంలో మరో జీవం, దానిలోఇంకొకజీవం, జీవంలో జీవం, జీవంలో జీవం, ఒక రూపంలో ఇంకో రూపం, దానిలో మరొకటి, దాని లోపల ఇంకొకటి.  

పుణ్యపూజ అంటే మిమ్మల్ని ఒక శక్తితో కూడిన ప్రదేశానికి తీసుకు వెళ్లడం, ఎక్కడైతే మీరు జీవశక్తికి సచేతనులు అవుతారో అలాంటి ప్రదేశానికి తీసుకు వెళ్లడం.

పుణ్యపూజ విశిష్ఠత 

సచేతనంగా ఉండటానికి గల ప్రాముఖ్యత ఏమిటి? మీరు ఒక జీవం. అదే దాని విశిష్టత. ఇందులో లాభం ఏముంది? అంటే, ఏదో ఒక లాభం ఉండాలి అనేది, మీ మనసులో జరిగే అర్థం లేని ఆలోచన. మీరు ఇది గమనించండి. మీరు పుట్టారు, ఇంత కాలం జీవించి వున్నారు. నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువ కాలం జీవించాలని ఆశీర్వదిస్తాను. అయినా కూడా మీరు ఏదో ఒక రోజున చనిపోతారు. మీరు పోయిన తర్వాత, అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, ఈ మనిషి పుట్టడం, కొంత కాలం జీవించడం, ఒక రోజు చనిపోవడం వల్ల ఒరిగిన ప్రయోజనం ఏముంది? నిజానికి దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు. కేవలం పర్యావరణానికి మాత్రం మీ చావు చాలా ఉపయోగకరం. ఎందుకంటే, మీరు ఇంకా నేను, భూమికి మంచి ఎరువుగా పనికొస్తాము. 
 
అయితే జీవించి ఉండటంలో ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమీ లేదు. జీవితానికి అర్థం ఏంటి? అన్నిటికన్నా మనోహరమైన విషయం ఏంటంటే, జీవితానికి అర్థం లేదు. ఒకవేళ ఏదైనా అర్థం ఉంటే..అది మీరు కనిపెడితే.. దాని తరువాత ఏం చేస్తారు? మీకు ఆ తరువాత ఏం చెయ్యాలో అర్థం కాదు. దీనికి ఏ అర్థం లేదు. కేవలం ఇది ఒక అంతులేకుండా ఉపొంగే స్థితి. ఇది మీరు అనుభూతి చెందితే, మీకు జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. లేదంటే కేవలం మీకు మీ అర్థం లేని ఆలోచనలు, ఇంకా భావోద్వేగాలు మాత్రమే మిగిలి ఉంటాయి.

మీ నివాస స్థలాన్ని సజీవంగా ఉంచుకోవడం 

Tపుణ్య పూజ మీ నివాస స్థలానికి జీవం పోయడం కోసం చేసే ప్రక్రియ. మీ ఇంట్లో ఉన్న స్థలమంతా జీవంతో నిండిపోవాలి. ఒకవేళ మీ ఇంట్లో మీరు ప్రతిక్షణం మీ లోపల ప్రేమ, వెలుగును నింపుకుని నివసిస్తూ ఉంటే కనుక ఇక పుణ్య పూజ అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో మీరు, మీ ఇళ్లను ఎంత పెద్దగా నిర్మించుకుంటున్నారు అంటే, అందులో కేవలం నివసించడం వల్ల ఆ ప్రదేశాన్ని సజీవంగా ఉంచడం సాధ్యం కాదు. ఒకవేళ మీ ఇంట్లో కేవలం ఒక గది మాత్రమే ఉండి, అందులో మీరు ప్రేమ, ఆనందాలతో గొప్పగా జీవిస్తూ ఉంటే గనక, దాన్ని సజీవంగా ఉంచడం చాలా సులభం. కానీ ఇవాళ మీ ఇళ్లలో పది, పదిహేను గదులుంటాయి. అటువంటి చోటుని సజీవంగా ఉంచడం ఏ మనిషికైనా చాలా కష్టమే. ఎప్పుడైనా మీరు గమనించండి, మీ ఇంటిని కొన్నాళ్లపాటు శక్తివంతంగా ఉంచకపోతే, ఆ ఇంటిలో కొన్ని చోట్లలో ప్రవేశించినప్పుడు, ఏదో శవపేటికలో ఉన్నట్టు, నెమ్మదిగా మీకు అనిపించడం ప్రారంభిస్తుంది. కొన్ని భాగాలు జీవంతో నిండి ఉంటాయి, సాధారణంగా వంటగది సజీవంగా ఉండటం నేను చూస్తాను ఎందుకంటే, అదొక్క చోట మాత్రం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది.


 
కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పుణ్యపూజ జరిగితే, మీ చుట్టూ ఉన్న స్థలం సజీవంగా ఉంటుంది, మీకు సహాయపడుతుంది కూడా. మీరు శవపేటికలో సంతోషంగా ఉండలేరా? అంటే, ఉండొచ్చు మీకు సాధ్యం అయితే. కానీ అందరికీ అది సాధ్యం కాదు. కొందరికి బైట నుండి సహాయం అవసరం అవుతుంది. స్థలాలను పవిత్రం చేయడంలో ఉద్దేశం ఇదే. పుణ్యపూజ అంటే, ఒక విధంగా మీ ఇంటిని అంతటినీ, ఇంటిలోని ప్రతి భాగాన్నీ, ప్రాణ ప్రతిష్ఠ చేయటం - తద్వారా మీ ఇంట్లో సజీవ చైతన్యం వెల్లివిరుస్తుంది. కానీ మేము మీ ఇంటిని శాశ్వతంగా సజీవంగా ఉండేట్టు చేయలేము. ఎందుకంటే మీ ఇల్లు, అందుకు తగిన జ్యామితి (geometry) తో నిర్మించబడలేదు. దాన్ని కట్టడంలో వాడిన పదార్థాలు, పూజ ప్రభావాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచేంత సామర్థ్యం కలిగినవి కావు.
 
ఇటుక ఇంకా రాళ్లతో కట్టిన ఇంటిని ప్రాణ ప్రతిష్ఠ చేసినపుడు అది తేలికగా 1 - 2 సంవత్సరాలు శక్తిని నిలుపుతుంది. అమెరికాలో ఎక్కువగా చెక్కతో ఇంకా అవాహకం (విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే-ఇన్సులేటర్) అయిన పదార్థాలతో కట్టిన ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఎక్కువ కాలం సజీవంగా ఏమి జరగకకుండా ఉన్నా లేదా ఆ ఇంట్లోని వారు నిరాశగా, బాధగా ఉంటున్నా ఆ ఇంట్లో ప్రాణ ప్రతిష్ఠ ప్రభావం 6 - 8 నెలల్లో క్షీణించిపోతుంది. ఎక్కువ కాలం నిలవదు ఎందుకంటే, కట్టడంలోని పదార్థం శక్తిని నిలుపలేదు. కానీ మీరు ఎలా జీవిస్తున్నారు అనేది కూడా ముఖ్యం. కట్టడంలోని ప్రధానాంశం ఎలా ఉన్నా సరే మీరు ఉత్సాహంగా ఉంటే అది కొంత కాలం నిలుస్తుంది.

ఇంట్లోని శక్తిని వృద్ధి పరచటం 

ఇంకొక అంశం ఏంటంటే, అక్కడక్కడే తిరిగి ప్రసరిస్తున్న గాలి. ఎవ్వరూ కిటికీని కానీ, తలుపులను కానీ తెరవటం లేదు, పూర్తిగా మానేసారు. ఉన్న గాలి మాత్రమే లోపల తిరుగుతూ ఉంటోంది నెమ్మదిగా, అతి తక్కువ శక్తితో. మీ చుట్టూ గనక చాలా చెట్లు, మొక్కలు ఉంటే, మీ కిటికీలు తెరచి ఉంచితే, అప్పుడు అవి కొంతవరకు పుణ్య పూజను మీకు చేసి పెడతాయి. కాని చాలా ఇళ్ళలో మూసేసి ఉంటాయి, వాటిలో అప్పటిదాకా ఉన్నగాలి అక్కడే స్తంభించిపోయి ఉంటుంది.

మీ చుట్టూ గనక చాలా చెట్లు, మొక్కలు ఉంటే ఇంకా మీ కిటికీలు తెరచి ఉంచితే, అప్పుడు కొంతవరకు పుణ్య పూజను అవే మీకు చేసి పెడతాయి.

మనుషులు ఆనందంగా జీవించట్లేదు. అయితే కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తున్నారు లేదా మానసికంగా కృంగిపోయి ఉంటున్నారు లేదా నిద్రపోతూ ఉంటున్నారు. జడత్వం, ఒత్తిడి, వివిధ స్థాయిల్లో ఉద్రిక్తతలు మెల్లగా ఆ స్థలంలో పేరుకుపోయి, అక్కడుంటున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇది మీరు చాలా మందిలో చూసి ఉండొచ్చు, వారు ఒంట్లో బాగో లేకపోయినా లేదా మానసికంగా కృంగిపోయి ఉన్నా, ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళగానే, వాళ్లకి చాలా ఉపశమనంగా, హాయిగా అనిపిస్తుంది. ఇక ఆ స్థలం నుంచి పూర్తిగా వేరే స్థలానికి మారిపోతే, వాళ్లు చాలా మటుకు పూర్తి ఆరోగ్యం పొందుతారు. నిజానికి మానసిక సమస్యలతో బాధపడే వారందరూ భౌతికంగా రోగులు కాదు. వారిలో అధికశాతం మంది తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు బాధితులు.

శక్తి వల్ల ఏర్పడే స్థితి కూడా అంతే. పైగా అది ముఖ్యమైనది కూడా. అయితే ఇది ఏదైనా తంత్రమా? పాశ్చాత్య దేశాల్లో ఈ పదానికి ఒక విపరీత అర్ధం సృష్టించారు. కానీ మీరు శాస్త్రపరంగా గమనిస్తే, నిజానికి “తంత్రం’’ అంటే సాంకేతిక విజ్ఞానం (టెక్నాలజీ). ఆ విధంగా చూస్తే అవును అనవచ్చు. అలా కాకపోతే అది యోగ.

మేము మీకు ఒక క్రియ నేర్పించాము, మీ శరీరాన్ని ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంచుకోటానికి. కాని మీరు కట్టుకున్న పెద్ద పెద్ద చెక్క ఇళ్ళు ఉన్నాయే, వాటిని ఉత్తేజంగా ఎలా ఉంచేది? మీ క్రియ చాలా అద్భుతంగా ఉండి ఉంటే కనుక, శాంభవి మహా ముద్ర మీలో విస్ఫోటనం లాగా సాగుతూ ఉంటే, మీరు కేవలం అలా ఇల్లంతా ఒకసారి తిరిగితే చాలు, బహుశా ఆ ప్రదేశం శక్తివంతంగా మారిపోవచ్చు. కాని మీరు అలా లేకపోతే, అప్పుడు మీకు పుణ్యపూజ సహకరిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ.

సంపాదకుడి సూచన: పుణ్య పూజను నిర్వహించుకోటానికి సమాచారం కొరకు, poojas@lingabhairavi.org కు ఈమెయిల్ చేయండి.