Sadhguruరామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువకాలం తీవ్రమైన భక్తునిగా జీవించాడు. ఆయన కాళిమాత భక్తుడు. ఆయనకు కాళి ఒక దేవత కాదు, సజీవ సత్యం. ఆమె ఆయన ముందు నాట్యమాడేది, ఆయన చేతులతోనే భోజనం ఆరగించేది, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది. తరువాత ఆయనని పరమనందానుభూతిలో వదిలేసేది.

ఇది నిజంగానే జరిగేది. ఇదేదో ఊహాజనితం కాదు, ఆయన నిజంగా తినిపించేవాడు. రామకృష్ణుల చైతన్యం ఎంత స్పష్టమైనదంటే ఆయన ఏ రూపం కోరుకుంటే ఆరూపం ఆయనకి నిజంగా కనిపించేది. ఒక మనిషి ఉండగలిగిన అత్యంత అందమైన స్థితి అది. రామకృష్ణుల యొక్క శరీరం, మనస్సు మరియు భావోద్వేగాలు పరమానందంతో తడిసిపోతున్నా, ఆయన అస్థిత్వం మాత్రం ఈ పరమానందాన్ని దాటి అవతలికి వెళ్ళాలని కోరుకునేది. ఈ పరమానందం కూడా ఒక బంధనమే అని ఎక్కడో ఒక ఎరుక ఉండేది.

ఒకరోజు రామకృష్ణులు హూగ్లీ నదీ తీరాన కూర్చుని ఉండగా, తోతాపూరి అనే ఒక గొప్ప యోగి ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఇలాంటి యోగులు చాలా అరుదు.   రామకృష్ణుడు ఒక తీవ్రమైన మనిషిగా, జ్ఞానోదయం పొందే అర్హత కలవాడిగా ఆయన గమనించాడు. సమస్య ఏమిటంటే ఆయన భక్తిలో చిక్కుకుపోయాడు.

చాలా రకాలుగా తోతాపూరి ఉపదేశం చేయబోయాడు కాని రామకృష్ణుడు ఆసక్తి చూపలేదు. అదేసమయంలో ఆయన తోతాపూరి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కనబరిచేవాడు ఎందుకంటే తోతాపూరి ఉనికి అలాంటిది.

తోతాపూరి రామకృష్ణుల దగ్గరకు వచ్చి "ఇంకా నువ్వు భక్తికే ఎందుకు అతుక్కుపోయావు? నీకు అంతిమ మెట్టుకు చేరుకునే శక్తి ఉంది" అని నచ్చచెప్పబోయాడు. కాని రామకృష్ణులు మాత్రం "నాకు కాళి కావాలి, అంతే!" అన్నాడు. ఆయన తల్లిని అడిగే పిల్లవాడి లాంటివాడు. అటువంటి స్థితిలో ఉన్నవారికి తర్కపరంగా నచ్చ జెప్పలేము. అది పూర్తిగా ఒక భిన్నమైన స్థితి. రామకృష్ణుడి భక్తీ, ఆసక్తీ కాళీనే. అతనిలో కాళీతత్వం అధికమైనప్పుడు ఆయన పరమానందంతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు.  అతనిలో ఆ స్థితి కాస్త తగ్గగానే, అతను ఒక పసిబిడ్డలాగా ఏడ్చేవాడు. ఆయన ఇలాగే ఉండేవాడు. తోతాపూరి చెప్పే జ్ఞానోదయంలాంటి వాటి గురించి ఆయనకు అస్సలు ఆసక్తి లేదు. చాలా రకాలుగా తోతాపూరి ఉపదేశం చేయబోయాడు కాని రామకృష్ణుడు ఆసక్తి చూపలేదు. అదేసమయంలో ఆయన తోతాపూరి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కనబరిచేవాడు ఎందుకంటే తోతాపూరి ఉనికి అలాంటిది.

రామకృష్ణుడు ఇలాగే వ్యర్ధంగా గడిపేస్తున్నాడని తోతాపూరి గమనించాడు. అప్పుడు "ఇది చాల సులభమైనది, ఇప్పుడు నువ్వు నీ భావోద్వేగాలని ప్రబల పరుస్తున్నావు, నీ శారీరాన్ని ప్రబల పరుస్తున్నావు, నీలోని రసాయన వ్యవస్థని ప్రబల పరుస్తున్నావు, కాని నీలోని ఎరుకని ప్రబల పరచడం లేదు. నీ దగ్గర కావలసినంత శక్తి ఉంది కేవలం నువ్వు నీ ఎరుకను ప్రబలం చేయాలి, అంతే!" అని అన్నాడు.

రామకృష్ణుడు అంగీకరించి "సరే నేను నా ఎరుకని సాధికారపరచి కూర్చుంటాను" అని అన్నాడు.

కాని  ఆయనకు కాళి రూపం స్ఫురిస్తే మళ్ళీ తనని తాను ఆపుకోలేని పరమానంద ప్రేమ స్థితిలోకి జారిపొయేవాడు. ఎన్నిసార్లు కూర్చున్నా సరే, ఒక్కసారి కాళి దృశ్యం కనపడగానే ఎగిరిపొయేవాడు.

తోతాపూరి "మరోసారి కాళి కనపడితే నువ్వు ఒక ఖడ్గంతో ఆమెను ముక్కలు చెయ్యి" అన్నాడు.

అప్పుడు  రామకృష్ణుడు "ఖడ్గం ఎక్కడనుండి తీసుకురావాలి" అన్నాడు.

అందుకు తోతాపూరి " ఎక్కడనుండైతే నువ్వు కాళిని తెచ్చుకుంటావో అక్కడనుండి. నీకు కాళినే సృష్టించే శక్తి ఉన్నప్పుడు ఒక ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేవు? నువ్వు సృష్టించగలవు. నువ్వు ఒక దేవతని సృష్టించగలిగినప్పుడు, తనని కోయడానికి ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేవు? సిద్ధంగా ఉండు!"అన్నాడు. రామకృష్ణుడు కూర్చున్నాడు. ఏ క్షణంలో అయితే కాళి కనపడిందో, మళ్ళీ పరమానందంలో మునిగిపోయి ఆ ఖడ్గాన్ని, ఎరుకని అంతా మరిచిపోయాడు.

ఇప్పుడు తోతాపూరి ఒక గాజు ముక్కని తీసుకుని, ఇలా అన్నాడు "ఈసారి నాతో కూర్చో. కాళి వచ్చిన క్షణమే ఈ గాజుముక్కతో నువ్వు ఎక్కడైతే చిక్కుకున్నవో అక్కడ కోసేస్తాను. ఎప్పుడైతే నేను ఆ చోటుని కోస్తానో, నువ్వొక ఖడ్గాన్ని సృష్టించి కాళిని ముక్కలు చేయి" అన్నాడు.

మళ్ళీ రామకృష్ణుడు కూర్చున్నాడు, ఎప్పుడు ఆ పరమానందపు అంచుకు చేరుకున్నాడో,  ఎప్పుడు కాళి  కనపడిందో, తోతాపూరి ఆ గాజుతో రామకృష్ణుని నుదుట బాగా లోతుగా గాటు పెట్టాడు.

ఆ క్షణం రామకృష్ణుడు ఖడ్గాన్ని సృష్టించి కాళిని నరికేసాడు, తద్వారా తల్లినుంచి, ఆ పరమానందంనుంచి  విముక్తుడయ్యాడు. ఆ సమయంలోనే ఆయన నిజంగా పరమహంస అయ్యాడు, పూర్తి జ్ఞానోదయం పొందాడు. అప్పటివరకూ అతను ఒక ప్రేమికుడు, ఒక భక్తుడు, ఆయనే సృష్టించుకున్న మాతృదేవత యొక్క పుత్రుడు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు