సహజంగానే శ్వాసించండి..!!
హాంకాంగ్ లో జరిగిన మొట్టమొదటి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం లో ఒక పార్టిసిపెంట్, శ్వాసను శరీరంలో విభిన్న రీతుల్లో పట్టి ఉంచడం మీద ఒక ప్రశ్నను అడిగారు.
పార్టిసిపెంట్: నమస్కారం సద్గురూ.. ఇంతకుముందు నేను కీకాంగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రతీ శ్వాస తరువాత మణిపూరకం దగ్గర శక్తిని పట్టి ఉంచమని అక్కడ నాకు చెప్పారు. నా శ్వాసను అక్కడ అలా పట్టి ఉంచడం, నాకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు, నేను శాంభవీ మాహాముద్ర నేర్చుకున్న తరువాత, ఈ రెండిటినీ నేను కలిపి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీనిగురించి నాకు ఏదైనా సలహా ఇస్తారా ?
సద్గురు: ఎంతో పురాతనమైన వివాదాన్ని మీరు మళ్ళీ తిరగతోడారు. చాలాకాలం పాటూ బౌద్ధ సంప్రదాయానికి చెందినవారు రెండు విధానాలను ఏర్పరచారు. ఒక విధానంలో, వారు ఎప్పుడూ శ్వాసను నాభి దగ్గర పట్టి ఉంచి, ఛాతీ ద్వారా శ్వాసను తీసుకుంటారు. మరొక విధానం వారు నాభి ద్వారా శ్వాసను తీసుకోవడం సరైనదని నమ్ముతారు. మీరు బుద్ధుడి విగ్రహాలను కనుక చూసినట్లయితే ఇది మీకు ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశం నుంచి వచ్చిన విగ్రహాల్లో క్రీడాకారుడి లాగా ఆయన పొట్ట లోపలికి ఉంటుంది. కానీ ఇతర ఆసియా దేశాలనుంచి వచ్చిన బుద్ధుడి విగ్రహాలను మీరు చూసినట్లయితే, ఆయనకు ఒక పెద్ద పొట్ట ఉంటుంది. ఇవి ఆ రెండు విధానాలను సూచిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన అవసరాల కోసం వీటిని ఈ విధంగా చేసారు.
ఎవరికైతే శరీరం లేదో వారిని ఆయన చిక్-చిక్-చిక్ అలా తొలగించేసేద్దామనుకున్నారు. దాదాపుగా నలభైవేలమంది సాధువులను ఆయన జీవితకాలంలో తయారు చేశారు. కానీ, నలభైవేలు అన్నది ప్రపంచం మొత్తం కాదు కదా..?? మిగతావారందరూ పిల్లల్ని కన్నారు. అందుకే, మీరు ఈరోజున ఇక్కడ ఉన్నారు. ఆయన కల సాకారం కాలేదు. మౌలికంగా, ఆయన నేర్పించిన సాధనలు తాపసుల కోసం. ఎవరైతే సన్యాస మార్గంలో ఉన్నారో, వారికోసం. దురదృష్టవశాత్తూ, ఈరోజున ప్రతిఒక్కరూ ఎదో ఒక పుస్తకం రాసేస్తారు. ప్రతిఒక్కరూ, వారికి దాని గురించి పూర్తి అవగాహన లేకుండానే ఏదోఒక సాధన చేసేస్తారు. కానీ నిజానికి ఇవన్నీ కూడా, సన్యాస పథంలో ఉన్నవారి కోసం సృజించబడినవి. ఉదాహణరకి, మీరు ఈశా యోగా కేంద్రానికి వచ్చారంటే, ఇక్కడ విభిన్నమైన సాధనలు ఉంటాయి. మేము సన్యాసులకి ఒక రకమైన సాధనని ఇస్తాము. వీటిని, మరొకరు ఎవరూ చెయ్యరు. వివిధరకాల ప్రజల కోసం, విభిన్నమైన సాధనలు ఉంటాయి. వారి జీవితంలో ఎటువంటి స్థాయిలో ఉన్నారు, వారి జీవన విధానం ఎటువంటిది ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుని, సాధనలు ఇవ్వబడతాయి.
మీకు అలా తెలియనప్పుడు, మీరు ఒక చిన్న చెరువులో ఈత కొట్టడం మంచిది. మీరు శ్వాసను సహజంగా తీసుకోండి. దానిని ఈ విధంగానో-ఆవిధంగానో పట్టి ఉంచడానికి ప్రయత్నించకండి. అలాంటి అవసరం లేదు. ఎందుకంటే, ఇటువంటివి విభిన్న స్థాయిల్లో ఉన్న తాపసులకోసం సృజించబడినవి. ఇవి, విభిన్నమైన పార్శ్వాలను చేరుకోవడానికి సృజించబడినవి. కానీ మీరు మీ జీవిత విధానాన్నే పూర్తిగా మార్చుకోవాలి లేదంటే అవి మీ జీవితంలోని మిగిలిన అంశాలనన్నిటినీ తీసివేస్తాయి. అందుకని, సాధన కేవలం ఒక దిశగా చెయ్యడం అన్నది, సరైన పని కాదు. వ్యవస్థలో సరైన మార్పులు జరగకుండా ఇటువంటివి చేసినట్లయితే, దీనివల్ల మీకు మేలు కంటే హానే ఎక్కువగా జరుగుతుంది. అందుకని, సహజంగా శ్వాసించండి. మీకు ఒక విభిన్న విధానంలో శ్వాసించడం అన్న పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ కూడా వదిలి పెట్టండి. మీరు శ్వాసను తీసుకున్నప్పుడు, ఆ గాలికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. దానిని, అక్కడికి వెళ్ళనివ్వండి.