శివుని గణాలు...
ఈ వ్యాసంలో శివుని అనుచరగణం, గణాలు, వారి మూలాలు గురించి సద్గురు మాట్లాడుతున్నారు.
యోగ గాథల్లో, గణాలు శివుని అనుచరులు. ఆయన చుట్టూ ఎప్పుడూ వాళ్లే ఉంటారు. ఆయనకి శిష్యులు, భార్య, ఎందరో అభిమానులు ఉన్నప్పటికీ ఆయన ఆంతరంగికులు గణాలే. గణాలను వికృతంగానూ, వెర్రిగానూ ఉంటారని భావిస్తారు. వాళ్ల శరీరం నుండి కాళ్లూ చేతులూ ఎముకలు లేకుండా సాధారణమైన చోట్ల నుండి కాక భిన్నస్థానాల నుండి మొలిచి ఉంటాయట. అందుకనే వాళ్లు వికృతంగా ఉంటారు, ఉన్మాదంతో ఉంటారని వర్ణిస్తారు. అంటే వాళ్లు మనకంటే భిన్నంగా ఉంటారు.
వాళ్లలా భిన్నంగా ఎలా ఉంటారు? ఇది జీవితంలో ఒక కోణం, అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. శివుణ్ణి యక్షస్వరూపుడిగా వర్ణిస్తూ ఉంటారు. యక్షుడు అంటే మరో లోకానికి చెందినవాడు. దాదాపు 15,000 సంవత్సరాల కిందట శివుడు ప్రస్తుతం టిబెట్టులో ఉన్న మానస సరోవరానికి వచ్చాడు. అది తేథిస్ సముద్ర అవశేషం అంటారు. ఇక్కడే అనేక మానవ సంస్కృతులు ఉద్భవించాయి. ఇవ్వాళ అది సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తున ఉంది. కాని, వాస్తవానికది ఒక సముద్రం. పైకి వచ్చి సరోవరమయింది.
శివుని అనుచరులైన గణాలు మనుషుల్లాంటి వాళ్లు కాదు. వాళ్లెప్పుడూ ఏ మనుష్య భాషనూ మాట్లాడినట్లు తెలియదు. వాళ్లు మాట్లాడేదంతా శుద్ధ రణగొణ ధ్వనిలాగా ఉంటుంది. శివుడు, ఆయన అనుచరులు మాట్లాడుకునేటప్పుడు ఎవరికీ అర్థం కాని భాష మాట్లాడుకుంటారు. మనుషులకు అదంతా రణగొణ ధ్వనే. కాని శివుడు నిజంగా సన్నిహితంగా ఉండేది గణాలతోనే.
మీకు గణపతి తలను పోగొట్టుకున్న కథ తెలుసుకదా. శివుడు వచ్చినప్పుడు గణపతి అడ్డుపడ్డాడు. శివుడు అతని తల తీసి వేశాడు. పార్వతి దుఃఖించింది. శివుణ్ణి ప్రార్థించింది గణపతిని తిరిగి బతికించమని. శివుడు ఒక జీవి తలని తొలగించి దాన్ని పిల్లవాడికి అతికించాడు. ఈ జీవి ఏనుగు అని చెప్పడం జరిగింది. కాని మీరు అర్థం చేసుకోవలసిందేమిటంటే ఎవరూ అతన్ని "గజపతి" అనలేదు. మనం అతన్ని ఎల్లప్పుడూ "గణపతి" అనే అంటాం. నిజానికి శివుడు తన స్నేహితుడి తల తీసి బాలుడికి తగిలించాడు.
గణాలకు, కాళ్లూ చేతులకు ఎముకలు లేవు. అందువల్ల ఈ పిల్లవాడు గణపతి అయ్యాడు. ఎందుకంటే ఈ సంస్కృతిలో ఎముకలు లేని అవయవాన్ని ఏనుగు తొండం అంటారు – కాని వాస్తవానికి అతను గజపతి కాదు, గణపతి. అతనికి గణాలలో ఒకడి తలను శివుడు తీసి అమర్చాడు, అతన్ని గణాలకు అధిపతిని చేశాడు.