శివుడు రావణున్ని కైలాసం నుంచి తన్ని వేయడం!
సద్గురు: రావణుడు శివుని పరమ భక్తుడు, వారి గురించి అనేక కథలున్నాయి. ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు, కానీ మరి ఆయన గొప్ప భక్తుడు. ఆయన ఎక్కడో దక్షిణ దేశం నుంచి కైలాస పర్వతం దాకా నడుచుకుంటూ వచ్చాడు. అంత దూరం నడవడం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. అలా వచ్చి శివుని గురించి స్తుతిస్తూ పాడడం మొదలెట్టాడు. ఆయన దగ్గర ఒక డమరుకం (డోలు) ఉంది, దానితో లయ కూర్చుకుని, అనర్గళంగా 1008 శ్లోకాలు పాడాడు, వాటినే శివతాండవ స్తోత్రాలు అంటారు.
ఈ సంగీతం వింటూ శివుడు ఎంతో పరమానందం చెందాడు. అలా పాడుతూ, కైలాసం దక్షిణ దిశనుంచి రావణుడు మెల్లగా ఎక్కడం మొదలెట్టాడు. రావణుడు దాదాపు శిఖరాగ్రం చేరినప్పుడు, శివుడింకా అతని సంగీత తన్మయత్వంలో ఉన్నప్పుడు, అతను పైకి ఎక్కడం పార్వతి చూసింది.
శిఖరాగ్రాన ఇద్దరికే చోటుంది. అందువల్ల పార్వతి శివుడిని ఈ తన్మయత్వంలోంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆమె ‘ఈయన పైకి వచ్చేస్తున్నాడు’ అంది. కాని శివుడు ఆ సంగీతానికి, సాహిత్యానికీ పూర్తిగా తన్మయత్వంలో మునిగి ఉన్నాడు. చివరకు పార్వతి ఆయనను ఆ తన్మయత్వం నుంచి బయటకు తేగలిగినప్పుడు, రావణుడు శిఖరాగ్రం చేరినప్పుడు, శివుడు అతనిని కాలితో తోసేశాడు. రావణుడు కైలాసం దక్షిణ ముఖం నుంచి జారి పడ్డాడు. ఆయన అలా జారుతున్నప్పుడు, ఆయన డమరుకం ఆయన వెనుక కైలాసం మీదనుంచి క్రింది దాకా ఒక గాడి చేస్తూ పడిందని అంటారు. మీరు దక్షిణ ముఖం వంక చూస్తే, మధ్యలో నిటారుగా ఓ గాడి లాంటి గీత చూడవచ్చు.
కైలాసం ఒక ముఖాన్నుంచి మరొక ముఖాన్ని బేధంగా చూడడం భావ్యం కాదు, కాని దక్షిణ ముఖం మాకు ఎంతో ప్రియమైనది, ఎందుకంటే అగస్త్య ముని ఆ దక్షిణ ముఖంలో ఐక్యమైపోయాడు. మేము దక్షిణాది నుంచి వచ్చినవారం కాబట్టి మాకు దక్షిణ ముఖం మాకు ఇష్టం, నా ఉద్దేశ్యంలో అది అన్నింటికంటే అందమైన ముఖం. అక్కడ ఎక్కువ మంచు ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా అది అతి తెల్లనిది.
అనేక విధాలుగా అదే ఎంతో తీవ్రమైన ముఖం, కాని చాలా తక్కువ మంది దక్షిణ ముఖం వైపుకు వెళతారు. అది చాలా దుర్గమమైన దారి. మిగతా వైపులకన్నా దానికి చేరడానికి మార్గం చాలా కష్టమైనది. ఒక రకమైన వారే అక్కడకు వెళతారు.
ప్రేమాశీస్సులతో,