తలుపు చాటున రాక్షసుడు
ఒక చిన్న ఊర్లో ఒక పాత ఇల్లు ఉండేది. అందరూ అందులో రాక్షసుడు ఉన్నాడని అంటూ ఉండేవారు. ఎవ్వరూ, ఆ ఇంటికి వెళ్ళే సాహసం చేసేవారు కాదు.
ఒక చిన్న ఊర్లో ఒక పాత ఇల్లు ఉండేది. అందరూ అందులో రాక్షసుడు ఉన్నాడని అంటూ ఉండేవారు. ఎవ్వరూ, ఆ ఇంటికి వెళ్ళే సాహసం చేసేవారు కాదు. ఎంతో ధైర్యం కలిగిన ఒకతను ఒక రోజున “నేను వెళ్ళి ఈ రాత్రంతా ఆ ఇంటిలో గడుపుతాను” – అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం అతను అక్కడికి వెళ్ళి ఆ రాత్రంతా అక్కడ ఉండడానికి సిద్ధమయ్యాడు. మరొకతను కూడా - ఇతను మొదటి వ్యక్తి కంటే ఎంతో ధైర్యవంతుడు... ఇతడు కూడా ఆ రోజునే ఆ ఇంటికి వెళ్ళి ఆ రాత్రంతా అక్కడ గడపాలనుకున్నాడు. రెండో అతను ఆ ఇంటికి వచ్చేసరికి, మొదటి అతను ఆ ఇంట్లోకి వెళ్ళి లోపల ఉన్నాడు. రెండో అతను అక్కడికి వచ్చి తలుపు తెరవాలనుకున్నాడు. అతను తలుపుని బాగా గట్టిగా తోశాడు.
లోపల ఉన్న వ్యక్తి, అవతలి ప్రక్కన రాక్షసుడు వచ్చాడు ఆనుకుని, చాలా గట్టిగా ఇవతలి వైపు నుంచి తలుపుని తన భుజంతో ఆపటం మొదలు పెట్టాడు. రెండో అతను కూడా అతని భుజాన్ని ఉపయోగించి ఎంతో గట్టిగా తలుపుని తెరవాలనుకున్నాడు. ఇలా రాత్రంతా వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఘర్షణ సాగింది. ఇద్దరూ కూడా అవతలి ప్రక్కన రాక్షసుడు ఉన్నాడేమో అనుకుంటున్నారు. ఆ రాత్రంతా ఇద్దరికీ ఇలాంటి వ్యాయామం అయిన తరువాత; పొద్దున్నే సూర్యోదయం అయ్యి వెలుతురు వచ్చేసరికి, వారిద్దరూ కూడా మానవులే, ఒక రకమైన వారే అని తెలుసుకున్నారు.
ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులు ఉన్నది ఈ విధంగానే కదా ..? ఎప్పుడూ ప్రజలేమనుకుంటున్నారంటే వారు మంచి వ్యక్తులే; కానీ వారు ఎవరితో అయితే పోరాడుతున్నారో, ఆ అవతలి వారు చెడ్డ వ్యక్తులని అనుకుంటున్నారు. నిజానికి, రెండు వైపులవారు కూడా – అవతలివైపు వారు చెడ్డ వ్యక్తేమో అనుకుంటున్నారు. ప్రజలు, ఎప్పుడూ కూడా వారు నమ్మినది మంచిది - మరొకరు నమ్మినది చెడ్డది అని అనుకుంటున్నారు. ఈ విధంగానే వారు ప్రపంచంలో వారనుకుంటున్న వాటిని ముందుకు తీసుకువెళ్లగలరు. ప్రపంచంలో తీవ్రవాదిగా ముద్రపడ్డ ఒక వ్యక్తి - అతను తనని తాను ఎంతో మంచి వ్యక్తిని – అని అనుకుంటాడు. తాను ఎంత మంచివాడిని అని అతను అనుకుంటే; అన్ని ఘోరమైన పనులు మనకి చేస్తాడు. కానీ, ఎవరు మంచి.. ? ఎవరు చెడ్డ..?- అన్నది; మీరు దేనితో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు అన్నదాని మీద ఆధారపడుతుంది. అది మీ మతం అవ్వచ్చు, మీ దేశం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు.
మౌలికంగా ప్రతీ మానవుడూ కూడా మొదట తనని తాను సరిచేసుకోవలసిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఏ మానవుడైనా సరే తన ఆంతర్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి. అప్పుడు, అతను ఎంతో ఆనందంగా మారతాడు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు; మీరు ఎంతో ఉదారంగా ఉంటారు. ఔనా...? మీరు విచారంగా ఉన్నపుడు మీరెంతో ప్రమాదకరమైన వ్యక్తిగా ఉంటారు. అందుకని మీ మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఒక ఆనందంగా ఉన్న వ్యక్తిగా మలచుకోవడమే. ఇదిగనక జరగలేదంటే; మనం మంచి ఉద్దేశ్యాలతోనే ఈ భూమ్మీద ఎంతో దు:ఖాన్నీ, బాధనీ కలిగిస్తాం. అదే కదా ఈ రోజున జరుగుతున్నదంతా కూడానూ. మీకు మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ భావాలని – ఎలా నిర్వహించుకోవాలో తెలియకపోతే మీరు ఈ ప్రపంచాన్ని ఎలా నిర్వహిస్తారు..? మీకు; మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలో తెలియకపోతే... మీరు ప్రపంచాన్ని ఎలా సరి చూడగలుగుతారు...?
అందుకని మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే... ప్రతి మనిషీ కూడా, అంతర్ముఖంగా తనని తాను “ఇన్నర్ -ఇంజినీర్” చేసుకోవలసిన అవసరం ఉంది. ఎవరికైతే జీవితం మీద అద్భుతమైన అవగాహన ఉంటుందో అటువంటి మానవులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరం.