ప్రశ్న: మనలో ఆధ్యాత్మిక ప్రక్రియ సంపూర్ణంగా సాగేటట్లు చేయడం ఎలా? మనకు తెలియకుండానే మనం దానికి అడ్డంకులు కలిగిస్తున్నామా?

మీలో ఉండే అడ్డంకులు ఏమిటి? మీకున్న సమస్య ఏమిటంటే మీ ఆలోచనలు, భావోద్వేగాలు, ఊహలు, మీరు ‘నేను’ అనుకునే దానంతటికీ అవసరానికి మించిన ప్రాధాన్యం ఇవ్వడమే. మీ వ్యక్తిత్వాన్ని నిర్మించేవి ఇవే కాబట్టి మీరు వీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.

అన్నిటికంటే ముఖ్యమైనది  - మీ ఇష్టాలు, అయిష్టాలు. తక్కినదంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. మీరెవరితో ఉండాలనుకుంటారు, ఎవరితో ఉండకూడదనుకుంటారు, ఎటువంటి ఆహారం తింటారు, ఏది తినరు, ఎక్కడికి వెళతారు, ఎక్కడికి వెళ్లరు, మీరు ఏకీభవించే ఆలోచనలేమిటి,  మీరు తిరస్కరించే ఆలోచనలేమిటి - ఇవ్వన్ని కూడా  మీ ఇష్టాయిష్టాలలో నాటుకుపోయి ఉంది. మీరు ఇష్టాయిష్టాలను తొలగించుకోగలిగితే, మీ ఆధ్యాత్మిక ప్రక్రియ మెల్లగా సాగదు, మీలో ఉరకలు వేస్తుంది.

ప్రస్తుతం మీ సమస్య ఏమిటంటే ఇది పవిత్రమైనది, ఇది అపవిత్రమైనది  అన్న భావన.

దీన్ని చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. సృష్టిలో ఉన్న ప్రతిదాన్నీ పవిత్రమైనదానిగా చూడడం. మీరు చేస్తున్న పని, మీ భార్య, మీ సంతానం, మీ భర్త, మీ కుక్క, మీ తల్లి, మీ దేవుడు – ప్రతిదీ, టాయిలెట్‌కు పోవడంతో సహా – ప్రతిదీ పవిత్రమైనదిగా చూడడం. లేదా ప్రతిదాన్నీ అర్థరహితమైందిగా, పనికిమాలిన చెత్తగా చూడడం – పూర్తి జుగుప్సతో – మీ దేవుడు, మీ శరీరం, మీ ఆధ్యాత్మికత, మీ ధ్యానం, ప్రతిదీ. రెండూ అద్భుతంగానే పనిచేస్తాయి.

ప్రస్తుతం మీ సమస్య ఏమిటంటే ఇది పవిత్రమైనది, ఇది అపవిత్రమైనది  అన్న భావన. అందులో పడితే మీరు కొట్టుకుపోతారు. జీవిన ప్రక్రియ జరిగే  విధానం ఇది కాదు. ఇలా ఉంటే మీకు అభివృద్ధి జరగదు. అసలు మీ కర్మకు ఆధారమే ఇష్టాయిష్టాలు. మీకు నిజంగా ఉన్న బంధనం అదే. నాకు ఇదంటే ఇష్టం, అదంటే అసహ్యం అనడంలో మీరు ద్వంద్వాన్ని ఏర్పరుస్తున్నారు. ఒక్కసారి ద్వంద్వం ఏర్పడితే ఆధ్యాత్మికత ఉండదు. అందుకే యోగ అంటే కలయిక. మీకు ఇది ఇష్టంలేకపోతే మీరు సర్వం ఆత్మగతం ఎలా చేసుకోగలరు? అది మిమ్మల్ని మీరు ఓడించుకునే ప్రక్రియ. మీరు దీనిమీద కృషి చేయాలి. ఇష్టం, అయిష్టం అన్నవి ఉండవు. ప్రతిదీ  పవిత్రమైనదే లేదా ప్రతిదీ పనికిమాలిందే, మీరు ఏ వైపు నడవదలచుకున్నారు?

ప్రతిదీ పవిత్రమైనదే అని మీరు చూడగలిగినప్పుడు మీ పని సులువవుతుంది. అన్నిటినీ వ్యర్థంగా, అసహ్యంగా చూడడానికి మరోవిధమైన శక్తి అవసరమవుతుంది. భారతదేశంలో నాగబాబాలనే ఒక పెద్ద యోగుల బృందం ఉంది. వాళ్లలో రెండు రకాలున్నారు. ఒక రకం వారు ప్రతిదాన్నీ పవిత్రంగా చూస్తారు. వాళ్లు ఒకరాయి, ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక జంతువు దేన్నైనా కానివ్వండి, శివుడిగానే చూస్తారు. మరో బృందం చాలా తీవ్రంగా ఉంటారు. సాధారణంగా నాగాలు తీవ్రమైన యోగుల జాతి. వాళ్లు దిగంబర సన్యాసులు. మరీ చలిగా ఉన్నప్పుడు ఒంటిమీద ఒక రగ్గు కప్పుకుంటారు. కుట్టిన బట్టలు ఏదీ ధరించరు. త్రిశూలం ఉంటుందెప్పుడూ వారి చేతిలో. ఈ జాతి ప్రతిదాన్నీ జుగుప్సతో చూస్తుంది. మీరు వాళ్లముందు ఒక చిన్న తప్పటడుగు  వేశారనుకోండి వాళ్లు మీ మీద బూతులవాన కురిపిస్తారు. వాళ్లు శివుణ్ణి కూడా ఇలా తిట్టడానికి సందేహించరు. వాళ్లలా ఉంటారు. ఒకరు మొత్తాన్నీ పవిత్రంగా చూస్తారు, ఒకరు మొత్తాన్నీ తిరస్కారంగా చూస్తారు. ఈ రెండూ కూడా చక్కగా పనిచేస్తాయి.

మీరు సర్వాన్నీ పవిత్రంగా చూసినా సరే, సర్వాన్నీ ద్వేషించినా సరే అందులో ఇష్టాయిష్టాలుండవు.

మీరు ప్రతిదాన్నీ పవిత్రంగా చూసే మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మీరు దేనికైనా సంపూర్ణంగా అంకితం కాగలరు. మీకంతా దివ్యమైనదిగానే కనిపిస్తుంది. దీనికంటే అది మంచిది అన్న భావనకు అవకాశమే ఉండదు. అందువల్ల ఏదీ మరొక దానికంటే ముఖ్యమైంది కాదు. మీరు ప్రతిదానితోనూ ఐక్యం కావలసి ఉంటుంది.

రెండింటికీ తేడా ఏమిటంటే మీరు ప్రతిదాన్నీ పవిత్రంగా భావించినట్లయితే మీ జీవితంలో అనంతమైన కార్యకలాపం ఉంటుంది. మీరు ప్రతిదాన్నీ అసహ్యించుకోగలిగితే – ఇది చాలా కష్టం కాని, తొందరగా సాధించగలుగుతారు. కాని సామాజిక సందర్భాలలో మీరిది చేయలేరు. మీరు అన్నిటినీ విడిచి ఏకాంతంలోకి వెళ్లవలసి వస్తుంది. మీకు ఏది అనుకూలమో అది చేయండి. మీరు సర్వాన్నీ పవిత్రంగా చూసినా సరే, సర్వాన్నీ ద్వేషించినా సరే అందులో ఇష్టాయిష్టాలుండవు. అది సాధనం. మీరొక పవిత్రమైన పని చేసి, మరొక అపవిత్రమైన పనిచేశారనుకోండి, ఆధ్యాత్మిక ప్రక్రియకు సంబంధించినంతవరకు అగరొత్తి లాగా మెల్లగా కాలిపోవడమే. మీరు మీ ఇష్టాయిష్టాలను పెకిలించి  వేస్తే, మీ ఆధ్యాత్మిక ప్రక్రియకు సంబంధించిన టపాకాయలు మీలో పెద్ద ఎత్తున పేలడం ప్రారంభిస్తాయి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు