యోగ ఇంకా ఆరోగ్య సూత్రాలు - రెండోవ భాగం
ప్రముఖ గుండె సర్జన్ డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి గారితో సంభాషణలో, సద్గురు రోగి ఆరోగ్యానికి యోగా ఎలా మేలు చేస్తుందో ఇంకా ఎలా శ్రేయస్సు కోసం ఒక సమగ్ర ఆరోగ్య ప్రక్రియను ఎలా సృష్టిస్తుందో చూస్తున్నారు. రెండు భాగాలలో ఇది రెండోవ భాగం
దేవి శెట్టి: నేను ఈనాటి యువ తరం డాక్టర్లను చూసినప్పుడు, ఆధునిక వైద్యం ఏ స్థాయికి చేరుకుందంటే, ఇక మనం నిజంగా రోగిని తాకాల్సిన అవసరం లేదు. నా ఆఫీసులో ఒక రోగిని చూసేటప్పుడు, అతను అప్పటికే అన్ని టెస్టులూ చేయించుకుని ఉంటాడు. అన్ని ఫోటోలూ అక్కడ ఉంటాయి, గత వైద్య చరిత్ర అంతా రాసి ఉంటుంది, అంతా ప్రణాళికా బద్దంగా ఉంటుంది. సాంకేతిక పరంగా, నేను రిపోర్టులను చూసి చెప్పగలను, “సరే, మీకు బైపాస్ అవసరం,” లేదా “ మీకు వాల్వ్ రీప్లేస్ మెంట్ అవసరం” అని. కానీ నేను ఎప్పుడూ కచ్చితంగా నా స్టెతస్కోప్ ని తీసుకుని అతని చాతి మీద పెట్టి, అతని గుండె చప్పుడుని వింటాను. రోగి కళ్ళను పరిశీలిస్తాను, వారి భుజం మీద చేయి వేసి, ఏం జరుగుతుందో వారికి వివరించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతాను. వ్యక్తిగతంగా , ఈ ప్రపంచంలో కనిపెట్టబడిన అన్నింటికంటే, స్పర్శకి నయం చేయగల శక్తి ఉందని నేను నమ్ముతాను. మీరు అది నమ్ముతారా ?
సద్గురు: అవును. అంటే యువతరం డాక్టర్లకి ఇది తెలియక పోవచ్చు, రేపటి రోజున ఎవరో ఒక కొత్త సాఫ్ట్వేర్ ని కనిపెట్టవచ్చు, అది రిపోర్టులు అన్నింటినీ పరిశీలించి, దానికదే వైద్యాన్ని నిర్ణయించగలగొచ్చు. మీరు మెడికల్ టెక్స్ట్ బుక్ మొత్తాన్నీ అందులోకి ఎక్కించవచ్చు. మీకు డాక్టర్తో అవసరం ఉండదు. స్పర్శ అనేదే ఉండదు.
దేవి శెట్టి: సరిగ్గా చెప్పారు.
సద్గురు: అర్థం చేసుకోని విషయం ఏమిటంటే - అవును, మనలో ఒక భాగం యాంత్రికమైనది, కానీ ఇతర పార్శ్వాలు ఉన్నాయి. యాంత్రిక భాగాలలో లోపం వచ్చేది, చాలా వరకూ అది మనం ఇతర పార్శ్వాలతో సరిగా వ్యవహరించక పోవడం వల్లే. ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి, ఉదాహరణకి రెండు కోతులు ఒక జంటగా నివసిస్తున్నాయి. మీరు ఒకదాన్ని వేరుగా ఉంచితే, ఈ కోతిలో గుండె సమస్యలు వస్తాయి, రక్త నాళాలలో బాక్టీరియా చేరుతుంది, ఇటువంటివి జరుగుతాయి. ఈ విషయాన్ని కనుగొనడానికి వాళ్ళు ఒక కోతి జీవితాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మంది మనుషుల విషయంలో ప్రతి రోజూ ఇదే జరుగుతూ ఉంది. ప్రాధమికంగా, లోపం ఎక్కడుందంటే వారి జీవం దేనిచేతా తాకబడలేదు. భౌతిక స్పర్శ అనేది కేవలం ఒక అభివ్యక్తం మాత్రమే.
అది ఒక సంబంధమే అవ్వాలనేమీ లేదు - మీరు ఎన్నో విషయాలచే స్పృశించ బడవచ్చు. మీరు సూర్యోదయాన్ని, లేదా సూర్యా స్తమయాన్ని, లేదా చంద్రోదయాన్ని చూసి ఎన్ని దశాబ్దాలు అయ్యింది? క్రితంసారి మీరు ఒక పువ్వు విచ్చుకోవడం కోసం వేచి ఉన్నది ఎప్పుడు? క్రితంసారి, మీరు ఒక సీతాకోక చిలుకనో, ఒక ఆకునో, ఒక పువ్వునో, లేదా మరొక వ్యక్తినో గమనించినది ఎప్పుడు? మీకు ఫేసులు నచ్చవు, ఫేస్బుక్ నచ్చుతుంది! జీవంతో స్పర్శలో ఉండటం - అది ఒక మనిషైనా, జంతువు అయినా, మొక్క అయినా, లేదా మీ చుట్టూ ఉన్న మూలకాలు అయినా - మనలో ఈ స్పర్శ లోపిస్తోంది. ఎంత మంది కనీసం వారు తీసుకోబోయే ఆహారాన్ని కొంత నిమగ్నతతో ఒక క్షణం పాటన్నా చూస్తున్నారు? వారు దానిచే తాకబడ్డారా? లేదు. చివరాకరికి, పరిస్థితులు విషమించినప్పుడు, ఒక డాక్టరు, లేదా ఆఖరిలో ఒక కాటి కాపరి వారిని తాకాలి.
యోగ ద్వారా పునరుజ్జీవనం
స్పర్శకి దీనితో ఏమన్నా సంబంధం ఉందా? ఎంతో గొప్ప సంబంధం ఉంది. స్పర్శ అనేది ప్రతిసారీ భౌతిక స్పర్శే కానక్కర్లేదు - అది ఎన్నో రకాలుగా ఉండొచ్చు. మీరు జీవంచే తాకబడకపోతే, మీరు జీవిస్తున్న జీవం కాదు, మెల్లగా మరణిస్తున్న జీవం. వైద్య పరిభాషలో ఇది సాధారణంగా తెలిసినదే, మీ శరీరంలోని కణాలు పాలపుంతలోని నక్షత్రాలకంటే ఎక్కువ అని. ప్రతిరోజు మీ శరీరంలో కొన్ని లక్షల కణాలు మరణిస్తున్నాయి అలాగే అదే సంఖ్యలో కొత్త కణాలు పుడుతూ ఉన్నాయి. పాతకణాలను వదిలేయండి, మీరు కేవలం ప్రతి క్షణం కొత్తగా పుట్టే లక్షల కణాలను నియంత్రణలోకి తీసుకున్నా, ఈ కొత్త కణాలు పుట్టే విధానంపై మీకు కొంత నియంత్రణ ఉంటే, మీరు వాటిని సరిగ్గా సృష్టించి రూపొందించ గలిగితే, మీ గుండె, మెదడు - ప్రతిదీ కూడా సరి అవుతుంది. మీకు ఈ స్థాయి అవకాశం ఉంది. ప్రతీ క్షణమూ కూడా మీరు మీ జీవితాన్ని పునరుజ్జీవింపజేసుకోవచ్చు. కానీ అది జరగడం లేదు ఎందుకంటే మీరు జీవం గురించి పూర్తిగా పట్టకుండా పోయింది. చాలా వరకు మీ ఆలోచనలు ఇంకా భావోద్వేగాలే అన్నింటినీ శాసిస్తున్నాయి.
సరైన దృక్పథం
ఆలోచనలు ఇంకా భావోద్వేగాలు అనేవి కేవలం ఒక మానసిక నాటకం మాత్రమే - వాటికి అస్తిత్వ పరమైన ప్రాముఖ్యత లేదు. ప్రస్తుతం ఒక వెయ్యి మంది ఇక్కడ కూర్చుని వెయ్యి విభిన్నమైన ప్రపంచాలలో జీవించవచ్చు. దానర్థం ఎవరూ కూడా వాస్తవికతలో లేరు అని. మీరు జీవితాన్ని అనుభూతి చెందడం లేదు - మీరు కేవలం ఆలోచిస్తూ మీ చుట్టూ ఉన్న పరిస్థితులకు ప్రతిస్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం సూర్యుడు సరైన సమయానికి ఉదయించాడు. మీరు అనుకుంటారు, “అయితే ఏంటి?” అని. రేపు ఉదయం సూర్యుడు ఉదయించకపోతే, కొంత సమయం తర్వాత ఈ గ్రహం మీద ఉన్న జీవం చాలా వరకు అంతరించిపోతుంది. కానీ ఈరోజు ఉదయం సూర్యుడు సరైన సమయానికి వచ్చాడు. ఇవాళ ఈ సౌర వ్యవస్థలో ఏ గ్రహాలూ కూడా ఒక దానితో ఒకటి గుద్దుకోలేదు. ఈ మొత్తం విశ్వంలో, ఈ అంతులేని విశ్వంలో అంతా సజావుగా జరుగుతుంది. కానీ మీ తలలో ఇష్టంలేని ఒక చిన్న ఆలోచన తిరుగుతూ ఉంటే, మీరు అది ఒక చెడ్డ రోజు అనుకుంటారు. మీరు జీవం గురించి దృక్పథాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇది ఒక రకమైన పిచ్చి. ఒకసారి ఈ ఉనికిలో మీరు ఏమిటి, మీ స్థానం ఇంకా స్థాయి ఏమిటి అన్న దృక్పథాన్ని మీరు కోల్పోతే, మీరు రోగులే. ప్రస్తుతం ఏ డాక్టరూ మిమ్మల్ని రోగి అని నిర్ధారణ చేయకపోయినా, మీలో ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఒక రోజున అది ఆ డాక్టర్ పరికరాలు లేదా అతని స్పర్శ, “మీరు రోగంతో ఉన్నారు” అని చెప్పే స్థాయికి అభివ్యక్తం అవుతుంది. అప్పుడు అతను మీకు వైద్యం చేస్తాడు లేదా ఒక సర్జరీ అవసరం అంటాడు. మీరు ఆ దిశగా చాలా గట్టిగా కృషి చేస్తున్నారు.
ఒక ఆలోచనగా ఉండే కన్నా, ఒక భావోద్వేగంగా ఉండే కన్నా, మీరు కేవలం ఒక జీవంగా అవ్వండి - కేవలం ఒక జీవంగా. మీరు ఒక ఆలోచనల, అభిప్రాయాల, ఇంకా భావోద్వేగాల గుట్టగా ఉండటాన్ని ఆపి, ఇక్కడ కేవలం ఒక జీవంగా ఉంటే, కేవలం ఉప్పొంగుతున్న జీవంగా ఉంటే జీవాన్ని తెలుసుకోవటం అనేది చాలా సహజమైనది అవుతుంది.
ఒక వ్యక్తి అంతరంగ శాంతిని ఇంకా ఆరోగ్యకరమైన, శారీరక ఆనందాన్ని అనుభవించేందుకు సాయపడేందుకు ఈశా రెజువనేషన్ ని సద్గురు రూపొందించారు. ఈశా రెజువనేషన్ ప్రోగ్రాములు శాస్త్రీయంగా నిర్మాణాత్మకమైనవి. ఈ ప్రోగ్రాములు, వివిధ పురాతన భారతీయ వైద్య విధానాలలోని అద్భుతమైన జ్ఞానాన్ని, అల్లోపతి, ప్రత్యామ్నాయ ఇంకా పరిపూరకరమైన చికిత్సలతో మిళితం అయి ఉంటాయి.