Sadhguruఖాట్మండులోని  పశుపతినాథ ఆలయం పశుపతి నాథుడికి నిలయం. కొన్ని సంస్కృతుల్లో ఇది అన్నిటిల్లోకి గొప్ప ఆలయం. ఈ లింగం వేదాలకన్నా పురాతనమైనది. వేదాలు సుమారు 5000 నుండి 8000 సంవత్సరాల పురాతనమైనవి. ఇది అంతకంటే ప్రాచీన కాలానికి చెందినది. ఈ గుడి ఎన్నోసార్లు మళ్ళీ కట్టవలసి వచ్చింది. కానీ ఆ లింగం మాత్రం వేదాలకంటే ముందరి కాలం లోనిదే.

“పశు” అంటే జీవం. “పతి” అంటే ప్రభువు. యోగ శాస్త్రం ప్రకారమైనా, ఆధునిక శాస్త్రం ప్రకారమైనా మనిషి జంతువులన్నిటిలోకి ఉత్తమ స్థాయిలో ఉన్నాడు. ఈ రోజు చార్లెస్ డార్విన్ ఏమి చెప్తున్నారంటే – మీరొక కోతి అని, పొరపాటుగా మీ తోక రాలి పడిపోయి ఉండవచ్చునని చెప్పారు.  అంటే పరిణామక్రమంలో మీరే ఆఖరు అని దీని అర్థం. అప్పటివరకూ పరిణామక్రమంలోని రూపాలన్నీ మీలో నశించాయని దీని అర్థం కాదు. మానవునిలోని డి.ఎన్.ఏ ను చింపాంజీ లోని డి.ఎన్.ఏ ను పోల్చి చూస్తే కేవలం 1.23 శాతం తేడా ఉంది. అది పెద్ద తేడా ఏమీ కాదు. 1.23 శాతం పెద్ద తేడా కాదు కదా అని, కొంతమంది దాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు కూడా...!  1.23 శాతం పెద్ద తేడా కాదు. కానీ చూడండి అది మీకూ చింపాంజీకి మధ్య ఎంత వ్యత్యాసం చూపించిందో.

మీరు మానవ రూపంలో ఉండి కూడా మరో పంది లానొ, కోతిలానో, తాబేలులానో మరెలా అయినా ప్రవర్తిస్తారు. మీరు మీ చైతన్యంతో ఈ పశు ప్రవృత్తిని అధిగమించకపోతే మీరు అలానే ప్రవర్తిస్తారు.

ప్రకృతి క్రమంలో మనిషి జంతుప్రపంచంలోకెల్లా తుది స్థాయిలో ఉన్నాడు. అందుకని భారతావనిలో దివ్య అవతారాలను ఈ విధంగా చెబుతారు. మొట్టమొదట నీటిలో మసలే మత్స్యం. ఆ తరువాత నీటిలోనూ, భూమిమీదా కూడా నడవగలిగే కూర్మావతారం. ఆ తరువాత భూమి మీద బాగా స్థిరపడ్డ వరాహావతారం. తరవాత సగం జంతువు సగం మనిషి. తరవాత ఓ మరుగుజ్జు మనిషి. తరువాత అంతగా స్థిరత్వం లేని మనిషి. తరువాత ఒక పూర్తి స్థాయిలో మనిషి. ఆ తరువాత ఎన్నో స్థాయిలలోని పురుషులు, ఎన్నో మానవ రూపాలు. పెంపొందుతున్న మేధస్సుతో, పెరుగుతున్న ఆవశ్యకతలతో ఎన్నో మానవ రూపాలు. ఈ దివ్య అవతారాలన్నీ కూడా మనకి ఈ పరిణామ సిద్ధాంతాన్ని బోధించటమే.

ఈ సందర్భంలో మానవుడు “పశుపత” అంటే జీవరాశులన్నిటిలోకి ఉన్నతమైనవాడు. అంటే జీవరాశుల్లో ఉన్నవన్నీ కూడా మనిషిలో ఉంటాయి. కోతిలోని కుతూహలం, పాములోని విషం, పందిలోని కామం - ఈ గుణాలన్నీ కూడా మనిషి తత్వంలో ఉన్నాయి కదా ? మీరు కానిది ఏదైనా ఉందా? అన్నీ మీ ద్వారా విన్యాసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రకృతి మిమ్మల్ని ఒక కణంగా ఉన్న జంతువు దగ్గరినుంచి ఇంత సంక్లిష్టమైన యంత్రంగా పరిణామం చెందించింది. ఇప్పుడు మీ చైతన్యాన్నికనుక మీరు వృద్ధి చేసుకోకపోతే, ప్రకృతి పడ్డ ఈ శ్రమ అంతా వృధాయే కదా? మీరు మానవ రూపంలో ఉండి కూడా మరో పంది లానొ, కోతిలానో, తాబేలులానో మరెలా అయినా ప్రవర్తిస్తారు. మీరు మీ చైతన్యంతో ఈ పశు ప్రవృత్తిని అధిగమించకపోతే మీరు అలానే ప్రవర్తిస్తారు.

శివుడు ఈ ప్రవృత్తిని అధిగమించాడు కాబట్టి “పశుపత” నుంచి “పశుపతి” అయ్యాడు. పతి అంటే “ప్రభువు”. ఈయన ఈ పశు ప్రవృత్తిని జయించి దానినుంచి విముక్తి చెంది ఇక్కడ యోగిగా కూర్చున్నారు. ఆయన అప్పటి వరకు తనలో ఉన్న వాటన్నిటిని అధిగమించారు. అందుకనే ఆయన “పశుపతి” అయ్యారు.  ఈ “పశుపతినాథ ఆలయం” పరిణామం చెందడానికి అనువైన స్థలం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే అది ఒక చేపల మార్కెట్ లాగా తయారయ్యింది. ఇది ఒక విషాదం. ఇందులో ఒక సౌందర్యం కూడా ఉంది. ఇది ఇలా ఒక చేపల మార్కెట్లా ఉన్నా అక్కడ ఉన్నవాళ్లకి దీని విశిష్టత తెలియకపోయినా గానీ ఈ ఆలయం ఇంకా సజీవంగానే ఉంది. అది వారి అవివేకం వల్ల పాడైపోలేదు. ఇది ఇందులో ఉన్న ఒక విషాదం, ఒక సౌందర్యం కూడా.

ఈయన ఈ పశు ప్రవృత్తిని జయించి దానినుంచి విముక్తి చెంది ఇక్కడ యోగిగా కూర్చున్నారు.

మీరు ఈ పశుపతినాధ ఆలయానికి వెళ్ళినపుడు ఎలా ఉండాలంటే – మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, అది ఏమిటంటే మనం కేవలం దీనిపట్ల గౌరవభావంతో మాత్రం ఉండడమే కాదు, ఇక్కడ ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాలపాటు వారి ముక్తి కోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్ని వేల సంవత్సరాలో మనకి తెలియదు. కానీ అక్కడి “లింగం” వేదాలకంటే కూడా పురాతనమైనది. కనీసం 8 వేల సంవత్సరాల క్రితం నుంచి ఆ లింగం అక్కడ వుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు