Read in Hindi: आखिर झूठ बोलने में हर्ज क्या है ?
பொய்களை களையெடுப்போம்

నే ను కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం గమనిస్తున్నాను. అది ఏంటంటే కొంత మంది ఈషా యోగా కేంద్రానికి రావాలన్న ఉత్సాహంలో వాళ్ళు ఎక్కడకు వెళుతున్నారనే విషయంలో అబద్ధం ఆడుతున్నారు. ఇది రోజువారీ జీవితంలో మనుషులు తమ కుటుంబానికి, జీవిత భాగస్వామికి, యజమానికి ఇంకా తమ చుట్టూ ఉన్నవారికి అబద్ధాలు చెపుతారు అనడానికి ఎన్నో ఉదాహరణలలో ఒకటి మాత్రమే. మీరు, మీ జీవితంలో అబద్ధాలు ఆడడం, ఒక భాగం చేసుకుంటే,  అప్పుడు సహృద్భావ సంబంధాలు ఏర్పరుచుకోవడం కష్టం అవుతుంది. ఏ సబంధంలోనైనా అబద్ధాలను ఏరివేయడం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే మీరు అందమైన సంబంధం కలిగి ఉండవచ్చు. ఒకసారి మీరు అబద్ధం చెప్పారంటే మీరు చెప్పే ప్రతి విషయాన్ని వాళ్ళు అనుమానించడం మొదలుపెడతారు. ప్రజలు నిజం చెప్పడం వల్ల కలిగే కాస్తంత అసౌకర్య సందర్భాన్ని ఎదుర్కునే ధైర్యం లేక అబద్ధం చెపుతారు. దయచేసి  అటువంటి సందర్భాన్ని ఎదుర్కోండి..

మీరు, మీ జీవితంలో అబద్ధాలు ఆడడం, ఒక భాగం చేసుకుంటే,  అప్పుడు సహృద్భావ సంబంధాలు ఏర్పరుచుకోవడం కష్టం అవుతుంది.

కొంత విచారణ తరువాత, మీరు ఒకటి చేయదలుచుకుంటే, ఒక వేళ మీ చుట్టూ ఉన్న వాళ్ళు దానికి వ్యతిరేకమైతే, ’నేను దీన్ని చేస్తాను’ అని ఖచ్చితంగా చెప్పండి. మీరు నిజం చెపితే కొంత ఘర్షణ కలగవచ్చు, కానీ బంధం, గౌరవం ఇంకా ఆదరణ నిలిచిఉంటాయి. ఎప్పుడైతే  అసౌకర్య సందర్భాన్ని తప్పించుకోడానికి మీరు అబద్ధం ఆడతారో అది బంధాలను నాశనం చేస్తుంది. ఆ తరువాత మీరు నిజం చెపుతున్నారో, అబద్ధం చెపుతున్నారో వాళ్ళకి తెలియదు. అది అవతలి వ్యక్తిలోనూ ఇంకా ఇద్దరి మధ్య సంబంధంలోనూ అంతులేని పోరాటం మిగుల్చుతుంది. అందుచేత నిజం చెప్పండి. మీకు ఏది ముఖ్యమో దాని కోసం మీరు నిలబడాలి. ముఖ్యంగా యోగ విషయానికి వస్తే మీరు మీ శ్రేయస్సు కోసం మీరు చేస్తున్నారు. మీ కోసం మీరు నిలబడడం మీకు, మీ బంధాలకి, యోగకి కూడా ఉపయోగం. మొదట మీ చుట్టూ ఉన్న వాళ్ళు కలత చెందవచ్చు, కానీ కొద్ది కాలం తరువాత అది సర్దుకుంటుంది. కనీసం వాళ్ళు మిమ్మల్ని నమ్మవచ్చు అని తెలుసుకుంటారు.

ప్రజలు నిజం చెప్పడం వల్ల కలిగే కాస్తంత అసౌకర్య సందర్భాన్ని ఎదుర్కునే ధైర్యం లేక అబద్ధం చెపుతారు.

నమ్మకం చాలా పెళుసైనది (బలహీనమైనది). ఒకవేళ ఎవరన్నా నూటికి నూరు శాతం మిమ్మల్ని నమ్మితే, ఒక విధంగా, మీ ద్వారా వాళ్ళంతట వాళ్ళు బలహీనమవుతున్నట్లే. మిమ్మల్ని వారు దగ్గరగా రానిస్తారు. అందుచేత మీరు వారి నమ్మకాన్ని వమ్ము చేస్తే అది వాళ్ళని గాయపరుస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే మీరు ప్రపంచంలో ఎంత సమర్థవంతంగా ఉండగలరు అనే విషయం, మీరు ఎంత నమ్మకం సంపాదించారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అత్యంత తెలివి, సామర్ధ్యం, జ్ఞానం ఉండి కూడా మీరు మీ చుట్టూ పక్కల మనుషుల నమ్మకం సంపాదించలేకపోతే, వాళ్ళు మిమ్మల్ని ప్రపంచంలో దేనినీ సృస్టించనివ్వరు. నమ్మకం సంపాదించడానికి అతి సులువైన మార్గం సూటిగా ఉండడం. మీరు చేసింది తప్పైనా, సరి అయినా తెలివైనదైనా అయినా లేక తెలివి తక్కువది అయినా సూటిగా ఉండండి. మొదట్లో అది కాస్త అసౌకర్యంగా  ఉండవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ, ఒకసారి ఎప్పుడైతే మీరు బాధ్యత వహించడానికి సిద్ధపడతారన్న విషయం ప్రయలకు అర్థమవుతుందో, నమ్మకం వృద్ధి చెందుతుంది. 

ఎప్పుడైతే మీరు పది మంది నమ్మకం సంపాదించారో, మీకు పది మంది మనుషుల బలం ఉన్నట్టే. మీరు పది లక్షల మంది నమ్మకం సంపాదించారంటే, ఒక విధంగా, మీకు పది లక్షల మంది బలం ఉన్నట్టే. మనం అందరం కూడా నమ్మకం సంపాదించుకోడానికి ఇంకా నిలుపుకోవడానికి సాధ్యమైననంత జాగృత వహించాల్సి ఉంటుంది. నమ్మకాన్ని వమ్ము చేయడం సులభం, కానీ నమ్మకం కలిగించడం అంత సులభం కాదు . ఎప్పుడు అయితే నమ్మకం నాశనం అయిందో, దాన్నిమీరు ఏవో అవాస్తవ కారణాలతో దాచే ప్రయత్నం చేయకుండా, మీరు చేసిన దానికి మీరు బాధ్యత వహించాలి. మీరు చేసినదానికి  మీరు బాధ్యత వహించి, మీ చుట్టూ పక్కల వాళ్ళకి భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారో, మిమ్మల్ని మీరు నిరుపించాకుంటే, మరలా నమ్మకాన్ని తిరిగి నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు పదే పదే మనుషుల నమ్మకాన్ని వమ్ము చేస్తుంటే మీతో ఎవరూ ఉండరు. అది కేవలం ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం గురుంచి కాదు. మిమ్మల్ని మనుషులు నమ్మితేనే మీరు ప్రపంచంలో ఏదైనా సృష్టించగలరు. సత్యప్రవర్తన కలిగి ఉండడం ఇంకా నమ్మకాన్ని కలిగించడం అనేవి నైతిక సంబంధమైన విషయాలు కాదు. అది అత్యంత సమర్ధవంతమైన, ఉపయుక్తమైన జీవన విధానానికి మార్గం.

ప్రేమాశీస్సులతో