మహత్తరమైన కైలాస శిఖరం
మహిమాలయములైన హిమాలయాలలోని కైలాస పర్వతం పై రోజు రోజుకీ గాఢమవుతున్న తన ప్రేమని సద్గురు ఈ వారం వ్యాసం రూపంలోనూ, కవిత రూపంలోనూ మనతో పంచుకుంటున్నారు. ఈ శిఖర సౌందర్యాన్ని అద్భుతమైన స్లయిడ్ షోలో చూడడం మరిచిపోకండి. వీటితో పాటు, టిబెట్ లోని మానససరోవరం, ఇతర దర్శనీయస్థలాల్లో ఈషా సభ్యుల పవిత్రపాదయాత్రలోని కొన్ని ముఖ్యమైన చిత్రాలని కూడా జతపరిచాము.
5 రోజులపాటు నేపాల్ లో కొండలెక్కిన అనుభూతులూ, అన్నపూర్ణ శిఖరం పరిసరప్రాంతాల్లో ఊపిరితీసుకోనీయని అద్భుతమైన హెలికాప్టర్ ప్రయాణాలూ, ఈ మహత్తరమైన కైలాసపర్వతం దర్శించిన అనుభూతిముందు మటుమాయమౌతాయి. ఆ పడ్డ కష్టాలూ, కండరాల సలుపులూ, ఎముకలుకొరికే చలివాతావరణం, భరించలేని మరుగుదొడ్లూ, ఇవన్నీ కూడా కైలాస పర్వతాన్ని చూడగానే మర్చిపోతాము. కొండ దిగి, దర్శన్ (ఇక్కడ వాళ్ళు దర్చన్ అని పలుకుతారు)చేరుకున్నాక, మేమందరం ఒక విధమైన ఆహ్లాదకరమైన మైమరపులో ఉన్నాము. అందరూ కూడా ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించి, ఇక్కడ కలిగే మైమరపుని అనుభూతి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఈ పర్వతంపట్ల నా ప్రేమ ప్రతి ఏడూ పెరుగుతోంది గాని తరగడం లేదు. నేను అమూల్యంగా భావించే అనేక వస్తువుల్లో, ఇది నమ్మశక్యంకానంతగా నన్ను ఆకట్టుకుంది.
కైలాస శిఖరం
"అతని" అపారమైన జ్ఞానపారావారాన్ని
పంచుకోవాలని అర్రులుజాచినపుడు, ఈ శిఖరం
మహోన్నతప్రమాణంలో గోచరమయే జీవాత్మ.
ఈ అనంత జ్ఞానప్రవాహోద్ధృతిని
తట్టుకుని నిలబడడానికి
ఏ సాధకులూ సమర్థులుగారు.
సృష్టిలోని సమస్త అస్తిత్వమూ
సకల నైరూప్యతా ఇక్కడ గోచరిస్తాయి.
ఈ జ్ఞానము సృష్టిలో మనకు కనిపించే
సమస్త చరాచర వస్తువులూ,
వాటి అంతరాంతరాలూ,
వాటి అస్తిత్వపు మూలాలనూ
పరివేష్ఠించి ఉంటుంది.
పవిత్రమైన ఈ జ్ఞానానికి
తగిన మేధోప్రమాణముగల
సాధకుణ్ణి కనుగోనకే
ఈ శైలాన్ని ఎంపిక చేసికున్నది.
ఏ మూర్ఖుడూ దీనిని కేవలమొక
శిలగా పరిగణించి నిర్లక్ష్యంచేసి
శాశ్వతాంధకారంలో మగ్గకుండుగాక!
సమస్త జీవజగత్తులోనూ
ఈ శైలము "ఆది గురువు" ఎంపిక అని
అందరూ గ్రహింతురుగాక!
ఆంగ్లంలో ఇక్కడ చదవండి : Glorious Kailash