నదులను సంరక్షించేందుకు విధి-విధానాలు రూపొందించడం అవసరం
భారతీయ నదులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఎంతటి తీవ్రమైనదో, గంభీరమైనదో తెలుసుకొందాం. నదులను రక్షించుకోవడం ఏ రకంగా లాభసాటిగా ఉంటుందో కూడా చూద్దాం.
నదులు అనాదిగా మానవ నాగరికత చిగురించడానికి మూల కారణంగా నిలిచి ఉన్నాయి. పర్వతాల్నీ, కొండశిలల్నీ చీల్చుకుంటూ వచ్చి సారవంతమైన భూముల్ని ఏర్పాటుచేస్తున్నాయి. అనేక వైవిధ్యభరితమైన జీవ, వృక్ష, జంతుజాలానికి అధారభూతమై ఉన్న నదులు ప్రాణదాతలుగా ప్రపంచమంతటా ఒక విశిష్ట స్థానాన్ని పొందాయి. ప్రత్యేకించి భారత దేశంలోని నదులతో సామాజికంగానే కాకుండా సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా కూడా విడదీయరాని అనుబంధం పెనవేసుకొని ఉంది.
అయితే, భూగర్భ జలాల్ని విపరీతంగా వాడటం, అడవుల్ని కొట్టివెయ్యడం, పర్యావరణ కాలుష్యం, వాతావరణంలో మార్పులు ఇతర అనేక కారణాలవలన గత కొన్ని దశాబ్దాలుగా మన నదుల్లో నీటి మట్టం క్షీణిస్తూ వస్తోంది. పెద్ద పెద్ద జీవనదులు కాస్తా వర్షాధార నదులుగా మారిపోయి ఏడాదిలో కొన్ని నెలలపాటు సముద్రం వరకు చేరలేకపోతున్నాయి. పూర్వకాలంతో పోలిస్తే గోదావరి 20%, కావేరి 40%, కృష్ణా మరియు నర్మదా 60% వరకు తగ్గిపొయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, అంచనాల ప్రకారం 2030వ సంవత్సరానికి మనం బ్రతకడానికి అవసరమయ్యే నీటిలో సగమే మిగులుతాయి. అంతే కాకుండా మన దేశంలో దాదాపు 25% భాగం ఎడారిగా మారిపోతోంది.
1947 నాటితో పోలిస్తే మన దేశంలో నేడు తలసరి నీటి వనరులు 25 శాతమే ఉన్నాయి. నాల్గింట మూడొంతులు సేద్యపు నీరు, 20 శాతం వరకు త్రాగు నీరు మనకి నదుల ద్వారానే అందుతోంది. మిగతా అవసరానికి బావులు, చెరువుల నుండి ఇతరత్రా ఏవైతే వాడుతున్నామో అవన్నీ కూడా ఎండిపొయ్యే ప్రమాద స్థితికి చేరుకున్నాయి. దేశంలోని 32 అతి పెద్ద పట్టణాల్లో 22 పట్టణాలు నీటి కొరతని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు చాలా అరుదుగా వినే కొరత, కరువు లాంటివి నేడు అతి సామాన్యమైన విషయాలుగా తరచూ మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. సత్వరమే నీటి దుర్వినియోగాన్ని తగ్గించే, జలాశయాల్ని రక్షించే చర్యలు చేపట్టని పక్షంలో వచ్చే 10-15 సంవత్సరాలలో దేశం అతి దారుణమైన నీటి మరియు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇటువంటి సంక్షోభాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే 'నమామి గంగే', 'నమామి దేవీ నర్మదా' లాంటి కార్యక్రమాలు చేపట్టింది. కాగా, నదులకి సంబంధించిన జీవావరణ వ్యవస్థని మొత్తంగా పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుత వ్యవహార స్థితిగతుల దృష్ట్యా, నదుల నీటిని పెంపొందించే మరియు ఆ నీటిని సంరక్షించే విధి-విధానాలూ, నిర్దేశక సూత్రాలను రూపొందించడం కూడా ఎంతో అవసరం. దీని రూపకల్పన, కార్యాచరణ జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిల్లో సంయుక్తంగా చేయవలసి ఉంటుంది. ఇంతే కాకుండా, నదులని రక్షించే చర్యలు ఏవైనా సరే వాటిపై అధారపడి ఉన్నవారికి జీవనోపాధి కల్పించే (లేదా) పెంపొందించే విధంగా ఉంటే వారందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమాలు సుదీర్ఘకాలం నదులని రక్షిస్తూ ఉండడం వారి వ్యక్తిగత పూచీకత్తుగా కూడా భావిస్తారు. కార్యాచరణ చాలా వరకు సులభతరం అవుతుంది.
అంతర్జాతీయ స్థాయిలో, సంయుక్త రాష్ట్రాలతో 'సుస్థిర అభివృధ్ధి లక్ష్యాలు - 2030 (ఎస్.డి.జి.)' అనే ఒప్పందానికి భారత దేశం కట్టుబడి ఉంది. దీని ప్రకారం, ఏ రకమైన అభివృధ్ధి కార్యక్రమాలైనా నిష్పక్షపాత ధోరణిని వహించాల్సి ఉంటుంది. నదుల విషయంలో పైన పేర్కొన్న విధంగా కార్యాచరణ రూపొందించడం ద్వారా ఎస్.డి.జి. లోని ఈ క్రింది లక్ష్యాలను సాధించవచ్చు:
- 6వ లక్ష్యం: శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం
- 13వ లక్ష్యం: వాతావరణ చర్య
- 15వ లక్ష్యం: జీవావరణం, జీవకోటి
అలాగే, ఈ క్రింది లక్ష్యాలపై పరోక్షంగా అత్యంత ప్రభావం ఉంటుంది:
- 1వ లక్ష్యం: పేదరికం
- 2వ లక్ష్యం: ఆకలి నిర్మూలన
- 3వ లక్ష్యం: ఆరోగ్యం, క్షేమం
- 8వ లక్ష్యం: గౌరవనీయ వృత్తి, ఆర్థిక పురోగతి
- 9వ లక్ష్యం: పరిశ్రమలు, మౌళిక సదుపాయాలు, ఆవిష్కరణ
- 10వ లక్ష్యం: అసమానతా నిర్మూలన
- 11వ లక్ష్యం: సామాజిక, పట్టణ సుస్థిరత
- 12వ లక్ష్యం: సుస్థిర ఉత్పత్తి, వినియోగం
నదులకు జాతీయ సంపదగా గుర్తింపునివ్వాలి. నదుల సంరక్షణ ముఖ్యంగా రెండు విషయాలను పరిగణించాల్సి ఉంటుంది 1) సమగ్ర పర్యావరణ, జీవావరణ పునరుద్ధరణ 2) జన్యు సమీకరణను కాపాడే నీరు యొక్క భౌతిక, రసాయన, జీవ పరమైన లక్షణాలకు భద్రత. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మందికి ఉపయోగపడే నదుల సంరక్షణకు దేశ అభివృద్ధి పథకాల జాబితాలో తగు స్థానం కల్పించాలి. అందుకనే నీటి పరిరక్షణ, పునరుద్ధరణ మనకి అతి ముఖ్యమైనది.
మరిన్ని వివరాలకు, నదుల రక్షణ కోసం ముసాయిదాని ప్రభుత్వానికి అందించిన డాక్యుమెంట్ ని చూడండి: Draft Policy Recommendation