శివుడు, గణేశుడు మరియు పార్వతి - గణేశుడి జనన వృత్తాంతము
సద్గురు చెప్పిన ఈ కథలో శివుడు గణేశుడి తలను ఎలా ఖండించాడో, అందరు అనుకుంటున్నట్లుగా వారికి ఏనుగు తలను కాకుండా శివుని పరిచారకులైన గణాల అధినాయకుడి తలను ఎలా అమర్చారో చూద్దాం.
Table of Content |
---|
1. గణేశుడు ఎలా పుట్టాడు? |
2. శివుడు గణేశుడి తలను ఎందుకు ఖండించాడు? |
3. గణేశుడిది తల ఏనుగుది కాదు, ఎందువల్ల? |
4. చక్కగా విందారగించిన పండితుడు: |
5. వినాయక చవితి ప్రాముఖ్యత: |
1. గణేశుడు ఎలా పుట్టాడు?
సద్గురు: శివుడు ఒక రకంగా తిరుగుబోతు స్వభావం ఉన్న భర్త. అతనెప్పుడూ తన ఇష్టానుసారం ఏళ్ల తరబడి ఏటో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లూ, ఈ-మెయిల్సూ ఉండేవి కాదు కదా మరి. అతను ఆలా వెళ్ళిపోయినప్పుడు పార్వతి అసలు శివుడితో సంప్రదించలేకపోయేది. ఆమె చాలా ఒంటరితనానికి లోనయ్యేది. అంతే కాకుండా, శివుడు మానవ మాత్రుడు కాక, యక్ష స్వరూపుడు అయినందున, పార్వతికి సంతానం కలిగే అవకాశమే లేకపోయింది.అందువల్ల ఆమె తన ఒంటరితనాన్నీ, కోరికనీ జయించి మాతృత్వపు మధురిమలను ఆస్వాదించ దలచి, ఒక బిడ్డను సృష్టించి ప్రాణం పోయడానికి పూనుకుంది. ఆమె తన ఒంటికి రాసుకున్న గంధాన్ని కొంత నులిమి అక్కడి మట్టితో దాన్ని కలిపి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. ఇది చాలా విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇటువంటి విషయం సాధ్యమేనని ఈరోజు శాస్త్రం చెబుతోంది. ఎవరైనా మీ చర్మ(పై పొర) కణాన్ని సేకరించినట్టైతే, ఎప్పటికైనా అందులోంచి మీకు సంబంధించినదాన్ని సృష్టించవచ్చట. అలాగే పార్వతి ఆ బొమ్మకి ప్రాణం పోసింది. ఓ చంటి బిడ్డ పుట్టాడు.
2. శివుడు గణేశుడి తలను ఎందుకు ఖండించాడు?
కొన్ని సంవత్సరాల తరువాత, బాలునికి సుమారుగా పది సంవత్సరాల వయసప్పుడు, శివుడు అతని గణాలతో తిరిగి వచ్చాడు. పార్వతి స్నానానికి వెళుతూ "ఎవ్వరిని లోపలి రానివ్వకు" అని బాలునితో చెప్పి వెళ్ళింది. బాలుడు ఎప్పుడూ శివుణ్ణి చూడకపోవటం వల్ల అతన్ని నిలువరించాడు. శివుడు ఇలాంటి అడ్డంకి సహించే స్థితిలో లేనందున వెంటనే తన ఖడ్గముతో బాలుని తల ఖండించి పార్వతి వద్దకు వెళ్ళాడు.
పార్వతి శివుని చేతిలోని రక్తసిక్తమైన ఖడ్గాన్ని చూసి ఏమి జరిగి ఉంటుందో ఊహించింది. బాలుని మొండెం కింద పడి ఉండటాన్ని చూసి కోపోద్రిక్తురాలయ్యింది. శివుడామెను శాంతిప చేయ ప్రయత్నించాడు. "అతను నీ సొంత కుమారుడేమీ కాదు. నువ్వో బొమ్మను తాయారు చేసావంతే. నేను ఖండించాను. ఇందులో చింతించేందుకు ఏముంది" అంటూ ఎన్నో చెప్పి చూసాడు. కానీ పార్వతి వినే పరిస్థితిలో లేదు.
గణేశుడిది తల ఏనుగుది కాదు, ఎందువల్ల?
ఈ సమస్యను పరిష్కరించడానికి, శివుడు అతని గణాల్లో ఒకరి తలను బాలునికి పెట్టాడు. ఈ తల మార్పిడి జరిగిన రోజే వినాయక చవితి. గణాల అధిపతి తలను తీసి ఈ బాలునికి పెట్టాడు కాబట్టి, "ఇప్పటినుంచి నీవే గణపతివి. గణాలకు అధిపతివి" అన్నాడు శివుడు. ఆ తరువాతి కాలంలో చిత్రకారులకు అసలు ఈ ప్రాణి ఏమిటనేది సరిగ్గా అర్థం కాక గజముఖాన్ని చిత్రించి ఉంటారు. గణాలకు అవయవాల్లో ఎముకలు ఉండవని శాస్త్రం చెబుతోంది. ఈ సంస్కృతిలో ఎముక లేని అవయవం అంటే ఏనుగు తొండమే. అందువలన చిత్రకారులు దాన్ని ఏనుగు తలగా చిత్రించారు. మానససరోవర తీరాన మీకు ఏనుగులు కనిపించే అవకాశం లేదు. అది ఏనుగుల నివాస ప్రాంతం కాదు. అక్కడ ఏనుగులకు సరిపడే అంత వృక్ష సంపద లేదు. కాబట్టి శివుడు ఏనుగు శిరస్సును ఖండించి ఉండే అవకాశమే లేదు. ఆయన్ని మనం గణేశుడు, గణపతి, వినాయకుడు అంటామే కానీ గజపతి అనము.
ఈ గణాలు శివుని సహచరులు. వాళ్లెక్కడినుండి వచ్చారో మనకి తెలియదు. కానీ పురాణాల ప్రకారం వాళ్ళు ఈ గ్రహానికి చెందిన వారు కాదు. వారి జీవన విధానానికి ఇక్కడి జీవన విధానానికి పొంతన ఉండదు.
ఏకకణ జీవుల నుంచి అనేక సంక్లిష్టమైన జీవరాశులూ, అక్కడి నుండి మానవుడూ ఉద్భవించడం ఎంతో అసాధారణమైన పరివర్తన అని ఈరోజున ఆధునిక జీవశాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది. కానీ ప్రాథమిక జీవన ధర్మము అలాగే ఉంది, అసలు మారనే లేదు. ఇంకా క్లిష్టతరమౌతోంది కూడా. కానీ గణాల జీవన విధానం వేరు. వారు భూమి మీద తయారైన వారు కాదు. వారికి ఎముకలు లేని అవయవాలు ఉంటాయి.
మీరు మీ శరీరాన్ని అనేక విధాలుగా ఉపయోగించినట్లైతే, ఆసనాలు వేయడానికి ప్రయత్నించినట్లైతే, నాకూ ఎముకలు లేకుంటే ఎంత బావుండు అని అనుకుంటారు. నేను పదకొండవ ఏట యోగ మొదలు పెట్టాను. నా ఇరవై ఐదవ ఏట నేను హఠ యోగ నేర్పుతున్నప్పుడు జనం నన్ను చూసి "మీకు అసలు ఎముకలు లేవు" అన్నారు. ప్రతి యోగీ కోరుకునేది ఇదే. తనకు ఏదో ఒక రోజు ఎముకలు లేకుండా పోతే ఏ ఆసనాన్నైనా సులువుగా చేసేయవచ్చు అన్నదే వారి కల.
4. చక్కగా విందారగించిన పండితుడు:
వినాయక చవితి కొన్ని వేల ఏళ్లుగా జరుపుకోబడుతోంది. గణేశుడు ఎంతో ప్రజాదరణ కలవాడు, భారత దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి కాబడుతున్న దేవుడు. అతనెంతో అనువైన శరీరం కలవాడు. ఎన్నో రూపాలలో, భంగిమల్లో అగుపించగలిగిన వాడు. విద్యకూ అధిపతి ఆయనే. సూక్ష్మ బుద్ధి గల పండితుడని ప్రతీతి. అతని ప్రతిభా పాటవాలకు చిహ్నంగా గణపతి చేతుల్లో ఎప్పుడూ పుస్తకమూ, కలము ఉంటాయి. ఆయన పాండిత్యము, ప్రతిభ మానవ మేధస్సుకు అందనివి.
ఒక విధంగా యోగ ప్రక్రియలన్నీ దీనికోసమే, మీ ప్రజ్ఞ ఉన్నచోటనే పాతుకుపోకూడదనే. కొందరు సరళమైన ఆధ్యాత్మిక సాధనల ద్వారా తమ మేధస్సును ఎలా ద్విగుణీకృతం చేసుకున్నారో చెప్పడానికి కొన్ని వేల ఉదాహరణలున్నాయి. అంటే మీకు ఏదో తొండం మొలుస్తుందని కాదుకాని, మీ బుద్ధి కుశలతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించవచ్చు అని అర్థం.
5. వినాయక చవితి ప్రాముఖ్యత:
మనిషెప్పుడూ మంచి మనుషులను తయారు చేయాలని ప్రయత్నించి ఒక పెద్ద తప్పు చేస్తూ వచ్చాడు. మనకు మంచి మనుషులు అవసరం లేదు. మనకు కావలసింది వివేకవంతులు. వివేకం ఉన్నట్లైతే మీరెప్పుడూ సరైనదే చేస్తారు. మనిషి మూర్ఖపు పనులు చేసేది వివేకము లోపించినందువల్లే.
తెలివి అంటే వ్యవహారదక్షత కాదు. తెలివి అంటే బుద్ధిచతురత కలిగి ఉండటం కాదు. మీరు అసలైన తెలివిగలవారైతే మీరు సృష్టితో వంద శాతం మమేకమై ఉంటారు ఎందుకంటే మరోవిధంగా తెలివిగా ఉండడం అనేదే లేదు. మీ చుట్టూ ఉన్న ప్రతిదానితోనూ మమేకమై ఉండటమే తెలివికి సంకేతం. లోపలా బయటా ఎటువంటి సంఘర్షణలకు తావివ్వకుండా మీరు జీవన ప్రస్థానాన్ని సాగిస్తున్నారని అర్థం.
వినాయక చవితి మీ బుద్ధికుశలతను పెంపొందించుకునే కనీస ప్రయత్నాన్ని ప్రారంభించదగిన రోజు. ఎముకలు లేని శరీరం కోసం రోజు ఉదయాన్నే ఆసనాలు వేసినట్లయితే, అది జరుగ వచ్చు కూడా.