ఆకాంక్షలూ, ఆశలూ, కోరికలూ..!!
సద్గురు ఏమంటారంటే, చాలామందికి కేవలం ఆశలూ, కోరికలూ మాత్రమే ఉంటాయని - వారి జీవితాల్లో వారికి ఆకాంక్షలే ఉండవని..! మన ఆశలే మనల్ని నడిపిస్తే, మనం జీవితంలో ఉన్నది ఉన్నట్లుగా చూసేది మరణ సమయంలో మాత్రమేనని గుర్తుచేస్తున్నారు.
ప్రశ్న: సద్గురు, నేను జీవితంలొ ఒక స్ఠాయికి ఎదిగాను. నేను నా జీవితంలొ ఎన్నో పోకడలను గమనించాను. నాకు ఈ ఆకాంక్షలన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. కానీ, నేను ఎంతో త్వరగా వాటిని వదిలేస్తూ ఉంటాను. నేను వాటిని వదిలిపెట్టి మళ్ళీ మొదలు పెడుతుంటాను. ఇది ఇలా ఓ చక్రంలా సాగుతూనే ఉంది. ఈ చక్రం నుంచి బయట పడాలంటే, లేదా కనీసం దాని గురించిన ఎరుకతో ఉంటూ సానుకూల దిశగా ముందుకు వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి..?
సద్గురు: మీకు ఇవాళ ఒకదాని మీద, రేపు మరొకదాని మీద ఆశ కలగవచ్చు. మీ కోరికా, ఆశ కూడా ఈరొజున ఒకదాని మీద రేపు మరొక దాని మీద కలగవచ్చు. కానీ మీ ఆకాంక్ష అన్నది అలా కాదు, దానికి వెనుదిరగడం అన్నది ఉండదు. మీరు ఒక క్షణంలో కోరికను సృజించుకోవచ్చు. మీరు ఐదు నిమిషాల్లొ దేనిగురించో కోరుకోవడం మొదలుపెట్టవచ్చు. కానీ, ఆకాంక్ష అన్నది అలా వచ్చేది కాదు. ఈ భూమి మీద ఎంతోమంది మానవులకు వారి జీవితకాలంలొ అసలు ఆకాంక్ష అన్నదే లేదు. వారికి కోరికలూ, అవసరాలూ, ఆశలూ ఉన్నాయి కానీ, వారికి ఆకాంక్ష అన్నదే లేదు. ఆకాంక్ష అనేది మీలొ వచ్చి పోతూ ఉండేది కాదు. “నేను నా జీవితంలో ఒక స్థాయికి వచ్చాను” అని మీరు అంటుంటే, మీరు నిజంగా మీ ఆకాంక్ష గురించి మాట్లాడుతున్నారనుకున్నాను. లేదు - మీరు, ఇంకా మీ కోరికల గురించే మాట్లాడుతున్నారు. అవి పెరగడం, తగ్గడం గురించి.
ఉడికించేయడం లేదా చల్లబడిపోవడం
కోరికలు అన్నవి ఉడికిస్తాయి, ఈ విషయం మీకు తెలుసు. ఏదైనా మెషీన్ సమర్థవంతంగా పని చెయ్యలేనప్పుడు వేడెక్కుతుంది..! అందులో రాపిడీ లెదా ఘర్షణ ఎక్కువైనప్పుడు, అది మరింత వేడిగా తయారౌతుంది. అలా కాకుండా అందులో రాపిడి లేకుండా పని చెస్తున్నప్పుడు అది చల్లగా ఉంటుంది. అది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది కానీ, చల్లగానే ఉంటుంది. ఆకాంక్ష అనేది ఇటువంటి కోరికే..! ఇందులో, కోరికలోని ఒక అంశం ఉంది. కానీ, అది మిమ్మల్ని ఉడికించెయ్యడమో లేదా చల్లబరచెయ్యడమో చెయ్యదు. అది, ఎప్పుడూ అలా ఉంటుంది..!! మీరు దానికి ప్రతీరొజూ ఆజ్యం పొయ్యవలసిన అవసరం లేదు. ఒకసారి ఆకాంక్ష అన్నది మీలో ఉన్న తరువాత, అది ఇక పోదు. మీరు ఏమి చేసినా సరే, మరణించినా సరే, అది పోదు. అది మీతో జన్మజన్మలకీ వస్తూనే ఉంటుంది. మీ జీవితాలని ఒక్కటిగా ఉంచే అల్లిక లాంటిది. ఇలాంటి ఆకాంక్షల వల్లే ఎన్నో జీవితాలు ఒక్కటౌతాయి. ఎవరికైతే జీవితంలో ఇలాంటి ఆకాంక్ష ఉందో, వారు అనుగ్రహంలో ఉన్నట్లే. ఎందుకంటే, వారితోపాటూ ఎన్నో జీవితాలు ఒక్కటిగా అల్లబడతాయి. ఇలా ఎన్నో జీవితాలు ఒక్కటిగా అల్లబడినప్పుడు, ఇక మీరు వారికీ ఈ జీవిత చక్రం ఎలా తిరుగుతొందన్న కథని చెప్పాల్సిన పని లేదు. మీరసలు వారికి ఏమీ చెప్పఖర్లేదు.
మీ చివరి క్షణం వచ్చినప్పుడు...
మీ ఆకాంక్షను తెలుసుకోడానికి కొంత సమయం వెచ్చించండి. జీవితం ఇలానే ఎదుగుతుంది. ఎవరైనా చనిపొయేముందు మీరు గమనిస్తే, వారికి జీవితంలొ ఎంతో ప్రియమైనవారు, ఎవరైతే అప్పటివరకు కూడా సర్వస్వం అనుకున్నారో - మృత్యు క్షణం వచ్చినప్పుడు వారిని అపరిచితులుగా చూస్తారు. సినిమాలను నమ్మకండి..వాటిలో చివరి క్షణంలో అతను మీ చెయ్యి అలా పట్టుకోవడం లాంటివి యేవో చూపిస్తారు. నిజానికి అలా కాదు జరిగేది. ఇద్దరి మధ్య ఎంత భావావేశం ఉన్నా సరే, ఆ చివరి క్షణంలో, ఎవరిని చూసినా, అసలు వారిని ఎరుగనట్లే చూస్తారు. అది నిజమే అన్నట్లు ఈ భౌతికత అంతా కూడా మీకు ఎన్నో భ్రమల్ని కలిగిస్తుంది. ఆట ముగిసిపొతున్నప్పుడు, ఉన్నఫళంగా దానికి సంబంధించిన ఆట అంతాకూడా మీకు అర్థం లేనిదిగా కనిపిస్తుంది. మీ జీవితంలో చివరి క్షణం వచ్చినప్పుడు, మీ చుట్టూరా ఉన్నవారిని మీరు ఎలా చూస్తారు..? మీరు ఇప్పుడు అదే విధంగా చూడాలి.. ఎల్లప్పుడూ అని కాదు. కానీ, మీరు అలా చూడగలిగి ఉండాలి. అప్పుడు ప్రతీ మానవుడికీ కూడా ఒకే ఆకాంక్ష ఉంటుంది. ఏ గ్రంధాలూ చెప్పలేని అనుభవాన్ని ఆ ఒక్క క్షణం మీకు తెలియచెప్తుంది.
ఎందుకంటే, అప్పుడు మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు. ఇది ప్రతీ మానవుడికీ కూడా జరగాలి. అదేమిటంటే, మీరు మీ జీవితాన్నీ, ఇక్కడ మీ ఉనికి యొక్క తత్త్వాన్నీ చూడాలి. మీ చుట్టూరా జరుగుతున్న చిన్న పరిధిలో కాదు - అది ఆశ్రమం అవ్వనివ్వండీ, సమాజం అవ్వనివ్వండీ, ఒక ఊరో, ఒక పెద్ద నగరమో ఇవన్నీ కూడా చిన్న వృత్తాలుగానే జరుగుతున్నాయి. దీనికి అంతం అది కాదు. కనీసం, మీరు సమయంలొ వెనక్కి తిరిగి చూడండి, మీరు లేనప్పుడూ ఇక్కడ ఒక ప్రపంచం ఉంది. అలానే, మీరు లేనప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో మీరు చూడగలిగి ఉండాలి. అప్పుడు, మీకు సరైన అవగాహన కలుగుతుంది. మీ ఆకాంక్షలన్నీ కూడా సరైనవిగా ఉంటాయి. లేదంటే మీకు కేవలం కోరికలూ, కాంక్షలూ మాత్రమే ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎన్నో దిశలుగా నడిపిస్తుంటాయి. అవన్నీ నిజమని మీరు నమ్మేలాగా చేస్తాయి.