ఉండడానికి అన్నింటికంటే మంచి ప్రదేశం –జెన్ కథ
విస్తృతంగా పర్యటించిన తన గురువును, కొత్తగా చేరిన ఓ విద్యార్థి ప్రశ్నించాడు ‘‘గురువుగారూ, మీరు ప్రపంచమంతా పర్యటించారు, వేసవిలో ఉండటానికి ప్రపంచంలో అన్నిటికంటే మంచిన ప్రదేశం ఏది? వర్షాకాలంలో బసచేయదగ్గ మంచి ప్రదేశం ఏది? శీతాకాలంలో ఉండదగ్గ మంచి ప్రదేశం ఏది?” అని ప్రశ్నించాడు.
ఒకప్పుడు ప్రపంచమంతా పర్యటించిన జెన్ గురువు ఒకరు ఉండేవారు. ఒకరోజు ఆయన నడకకు బయలుదేరారు. కొత్తగా చేరిన విద్యార్థి ఒకరు ఆయనతో పాటు బయలు దేరాడు.
హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభం అయింది. శిష్యుడు పక్కనే ఉన్న అరటిచెట్టు ఆకు ఒకటి తెంపి తలమీద పెట్టుకుని, ‘‘గురువుగారూ, మీరు ప్రపంచమంతా పర్యటించారు, వేసవిలో ఉండటానికి ప్రపంచంలో ఉత్తమ ప్రదేశం ఏది? వర్షాకాలంలో బసచేయదగ్గ మంచి ప్రదేశం ఏది? శీతాకాలంలో ఉండదగ్గ మంచి ప్రదేశం ఏది?” అంటూ గురువు గారిని అడిగాడు.
గురువుగారు అలా నడుస్తూనే “నువ్వు నిజంగా అన్నింటికంటే మంచి ప్రదేశంలో ఉండాలంటే వేసవి, వానా కాలం, శీతాకాలం లేని చోటుకు వెళ్ళాలి” అన్నారు.
“ మీరు అకడకు వెళ్ళారా?”
‘‘వెళ్లాను”
“ అది ఎక్కడ ఉందో చెపుతారా?”
“నువ్వే స్వయంగా తెలుసుకొని వెళ్ళు” అని, తన నడకను ఆపకుండా వెళ్ళిపోయారు, గురువు గారు.
సద్గురు: ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు శరీరంలో రక్త ప్రసారం గూర్చి మహా ఉత్సాహంగా బోధిస్తోంది. విద్యార్థులు బోధనలో లీనం కావాలనే ఉద్దేశంతో ఆవిడ క్లాసులో ఒక పిల్లవాడిని ప్రశ్నించింది.
“నేను ఇప్పుడు తలక్రిందుగా నిలబడితే, రక్తం అంతా నాముఖంలో చేరుతుంది, మీకు నా ముఖం ఎర్రగా కనబడుతుంది. అదే నా కాళ్ళ మీద నేను నిలబడితే నా పాదాలు ఎర్ర బడవు? ఎందుచేత?”
ఆమె ప్రశ్న పూర్తికాకముందే పిల్లవాడు జవాబు ఇచ్చాడు “ఎందుకంటే మీ పాదాలు ఖాళీగా లేవు కాబట్టి.”
ఈ విద్యార్థికి మానవ శరీరం గూర్చి ఎంత తెలుసో, జెన్ గురువు గారిని ప్రశ్నించిన శిష్యుడికి జీవితం గూర్చి అంతే తెలుసు. వేసవిలో బాగా ఉండే ప్రదేశం ఏది? బాగా చల్లగా ఉండే ప్రదేశం వేసవిలో మంచిదనిపిస్తుంది. శీతాకాలంలో బాగా ఎండగా ఉండే ప్రదేశం సెలవులు గడపడానికి పనికి వస్తుందనిపిస్తుంది. ఈ ప్రశ్నలను అడగటం ద్వారా శిష్యుడు తన మనస్థితిని తెలియజేస్తున్నాడు. గురువు ‘‘ఇది నీ జీవితం కాదు’’ అని గుర్తు చేస్తున్నాడు.
“ఎక్కడ వేసవి, శీతాకాలం, వర్షాకాలం లేదో అక్కడకు చేరటానికే నీ జీవితం” అని గురువు గారు అంటున్నారు. ఆయన చెపుతున్న ప్రదేశాన్ని మీరు భౌగోళిక పఠంలో చూడలేరు. మీ ప్రయాణం భౌతిక పరిధులను దాటి విస్తరించాలని ఆయన సూచిస్తున్నారు. శరీరపు పరిధిని దాటి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వేసవికాలం, శీతాకాలం ఎలా ఉంటాయి? వేసవి తాపం, చలికాలపు చల్లదనం మీ అంతరంగాన్ని తాకగలవా? అవి కేవలం మీ శరీరాన్ని మాత్రమే తాకగలవు. ఈ చర్చ సెలవులకు ఏది మంచి ప్రదేశం అనే విషయం గూర్చి కాదు. ఒకవేళ అక్కడకు వెళ్ళినా కేవలం శరీరం మాత్రమే సుఖంగా ఉండగలదు. ఇక మిగిలినది అంతా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. మీరు సాధన ద్వారా ఇప్పుడు ఉన్న చోటనే మీ అంతరంగాన్ని చలి వేడి మిమ్ములను ఏమి చెయ్యలేని స్థితికి తీసుకు వెళ్ళాలి.