అంతా శూన్యమే - ఒక జెన్ కథ
ఈ జెన్ కథలో గురువు డొకువాన్, సమురాయ్ టెస్షుకి పరీక్ష పెట్టారు. సద్గురు ఈ కథను ఉపయోగించి నిజంగా జ్ఞానోదయం పొందడానికీ ఇంకా కొన్ని పదాలు సేకరించి, కేవలం ఆ పదాలను ఉపయోగించడానికీ మధ్య వ్యత్యాసాన్ని వివరించారు.
జెన్ కథ: యమవోకా టెస్షు అనే సమురాయ్ ఒక జెన్ విద్యార్ధి. తను అనేక జెన్ గురువుల వద్ద విద్యాభ్యాసం చేస్తూ జపాన్ అంతా తురుగుతూ ఉండేవాడు. ఒక రోజు, అతను షోకోకు దేవాలయానికి వెళ్ళినప్పుడు సన్యాసి అయిన డొకువాన్ ను కలిశాడు.
జెన్ గురించి తనకు గల జ్ఞానాన్ని ప్రదర్శించాలనే కోరికతో, టెస్షు ఆ గురువుతో, “మనసు, బుద్ధుడు ఇంకా అన్ని జీవులు శూన్యమే. అన్నింటి వాస్తవ స్వభావం శూన్యమే. జ్ఞానోదయం లేదు, మాయ లేదు; ఋషులు లేరు, సామాన్యులు లేరు; శ్రమ లేదు, ప్రతిఫలం లేదు” అన్నాడు.
గురువు డొకువాన్ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి, అతని తలపై గట్టిగా కొట్టాడు.
టెస్సు ఒక్కసారిగా కోపంతో, “ఎందుకు అలా చేశారు?” అని అడిగాడు.
అప్పుడు డొకువాన్, “అంతా శూన్యమే అయితే, ఈ కోపం ఎక్కడ నుండి వచ్చింది?” అన్నారు.
సద్గురు: జ్ఞానోదయం అంటే అదొక సాధించే విషయం కాదు; అది తిరిగి ఇంటికి రావడం లాంటిది. దాని లోని అసాధారణత ఏంటంటే, మీరు పరమ సాధారణంగా అవుతారు. శూన్యంగా మారడమంటే, మీరు ఇకపై మీ సొంత విషయాలతో నిండిపోరు, మీదంటూ ఏముండదు. మీరు అంతా మీదే అన్నట్లు అయినా, లేదా ఏది మీది కాదు అన్నట్లు అయినా, అటువంటి స్థితిలో ఎలాంటి నిర్బంధత్వం ఉండదు.
ఈ సమురాయ్ ఎక్కడో విన్నదీ చదివినదీ పట్టుకుని – తాను శూన్యమని, ప్రతీదీ కూడా శూన్యమేననీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకసారి తల మీద కొట్టగానే అతనికి కోపమొచ్చింది. అంతా శూన్యమే అయ్యి ఉంటే, మీలో ఎటువంటి నిర్బంధం లేకపోతే, ఈ కోపం ఎక్కడ నుండి వస్తుంది? అది ఏదైనా లక్ష్యం కోసం ఎరుకతో ప్రదర్శించిన కోపం కాదు; ఎవరో తలపై కొట్టగానే ఒక్కసారిగా వచ్చిన కోపం.
ప్రజలతో జ్ఞానోదయం గురించి మాట్లాడడం బాధ్యతారహితమైన విషయం. ఎందుకంటే మూర్ఖులందరూ ఈ పదాలను పట్టుకుని, వాటిని ఇతరులను మోసం చేయడానికో, లేదా మరీ ముఖ్యంగా, తమని తాము భ్రమింపజేసుకోడానికో ఉపయోగిస్తారు. ఇలా ప్రతి చోటా జరుగుతూనే ఉంది.
25,000 రూపాయిలు ఇస్తే, మీకు జ్ఞానోదయం అయ్యిందని ప్రకటించే చిత్తశుద్ధి లేని వారు నేడు సమాజంలో ఉన్నారు. మీకు అలాంటి జ్ఞానోదయం కావాలంటే, మీ డబ్బు వృధా చేసుకోకండి, జ్ఞానోదయం అయ్యిందని మీకు మీరే ప్రకటించుకోండి, ఎందుకంటే రెండింటికీ పెద్ద తేడా ఏమీ లేదు.