అంతులేని శూన్యం: తనని ఒక గురువుగా చేసేది ఏమిటో సద్గురు వివరిస్తున్నారు
తను ఒక కాపలా దారుడు లేనటువంటి ద్వారం అనీ, అదే తనని ఒక గురువుగా చేస్తుందనీ సద్గురు చెబుతున్నారు.
ప్రశ్న: మీచే దీక్ష పొందిన వారికి, మా అవగాహనకి అతీతంగా కొన్ని జరుగుతున్నాయి. అసలు మీరు ఎవరు అని? అలాగే మీరు ఒక గురువుగా ఎలా పనిచేస్తారు అని? నేను ఆశ్చర్యపోతూనే ఉన్నాను, సరిగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగానే అని చెప్పాలి.
సద్గురు: వ్యక్తిగా నేను చాలా ఘోరమైన వాడిని. ఒక గురువుగా చూస్తే నేను పూర్తి శూన్యాన్ని. నేను గురువు అయింది, నా జ్ఞానం వల్ల కాదు. నేను గురువుగా ఉండడానికి కారణం, నా అజ్ఞానం అపరిమితమైనది కాబట్టి, ముఖ్యమైనది కూడా అదే. మీలోది ఒకటి అపరిమితం అయితే - అది ఏదైనా సరే - అది పనిచేస్తుంది. మీరు అపరిమితమైన అజ్ఞానులుగా అయితే, అది పనిచేస్తుంది. మీరు అపరిమితమైన ప్రేమగా అయితే, అది పనిచేస్తుంది. మీరు అపరిమితమైన కోపంగా అయితే అది పనిచేస్తుంది. మీరు ఎందులోనైనా అపరిమితమైన వారిగా అయితే, అది పనిచేస్తుంది.
అపరిమిత అజ్ఞానంతో ఉండడం అనేది అత్యంత తేలికైన మార్గం అని నాకు అనిపించింది. నా ఆధ్యాత్మిక ప్రక్రియా అంతా, ‘నాకు ఏమీ తెలియదు’ అని నేను గ్రహించడం వల్లే మొదలైంది. మరి అదేమీ చిన్న విషయం కాదు. ఏదైతే అపరిమితమో, అది చిన్నగా ఉండలేదు. మీరు అపరిమిత జ్ఞానులు అయ్యే ప్రయత్నం చేస్తే, మీరు ఎంతని తెలుసుకుంటారు? మీరు ఎంత తెలుసుకున్నా సరే, అది పరిమితమైనదే. ఈ అసలు ట్రిక్కుని, ఆ వాస్తవాన్ని, నేను తెలుసుకున్నాను - జ్ఞానంగా పిలువబడేది అజ్ఞానం, అజ్ఞానంగా పిలువబడేది నిజమైన జ్ఞానం.
నేను ఖాళీ స్థలంలా ఉండడం వల్ల, నా ద్వారా పనిచేసేందుకు, నేను ఆదియోగికి ఒక ద్వారంగా అయ్యాను. మీరు నన్ను వీధిలో కలిస్తే నా తల ఖాళీగా ఉంటుంది. ఈ వ్యక్తి వెనక చూస్తే, మీకు ఏమీ కనపడదు. ఇక వ్యక్తిత్వ విషయాని కొస్తే, నేను ప్రతి కొన్ని సంవత్సరాలకీ దాన్ని మారుస్తూ ఉన్నాను. ఈ విషయంలో ప్రజలు ఇప్పటికే అయోమయానికి, గందరగోళానికి గురయ్యారు. నా చుట్టూ ఉండేవారితో, నేను చాలా ముందుగానే, నా వ్యక్తిత్వాన్ని మార్చబోతున్నానని చెప్తాను, అయినా సరే వాళ్లలో చాలామంది కలత చెందారు. కొంతమంది ఉండిపోయారు, కొందరు వెళ్ళిపోయారు.
ఈ వ్యక్తి(సద్గురు) ఎట్లా రూపొందించబడ్డాడంటే, అతనితో మీకు ఏ సంబంధమూ వద్దు అనేంత ఘోరంగా అతను ఉంటాడు, కానీ అదే సమయంలో మీరు విడిచి ఉండలేనంత మధురంగా అతను ఉంటాడు. నేను ఇంకొంచెం ఘోరంగా తయారైతే ఇక ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నేను ఇంకొంచెం మధురంగా అయితే కూడా, ఎవరూ ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేరు. వాళ్ళు నన్ను తట్టుకోలేరు, కానీ నేను లేకుండానూ ఉండలేరు, నన్ను నేను అటువంటి స్థితిలో ఉంచుకుంటాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనే ప్రేరణ వారిలో ఉండాలంటే ఇది అవసరం.
వారు నన్ను మరీ మధురంగా ఉండటం చూస్తే, తమ ఆధ్యాత్మిక అన్వేషణ కన్నా వాళ్లు నన్ను పెద్దవానిగా చేస్తారు. అది మంచిది కాదు. వాళ్లు నన్ను మరీ ఘోరంగా ఉన్నట్టు చూస్తే, వాళ్ళు ఆధ్యాత్మిక అన్వేషణని వదిలేస్తారు. ఇది కూడా మంచిది కాదు. రెండింటికీ తగిన విధంగా నా వ్యక్తిత్వాన్ని నేను రూపొందిస్తున్నాను. తద్వారా వాళ్ల జిజ్ఞాస ఎప్పుడూ చెదరి పోకుండా ఉంటుంది. నాతో విసిగిపోవడం వల్ల, వాళ్లు నాకు అతీతంగా చూసినా, అది పనిచేస్తుంది. గురువు ఒక గమ్యం కాదు. గురువు ఒక మార్గం. గురువు ఒక ద్వారం లాంటివాడు. ఆ ద్వారం గుండా వెళితే మీరు వాస్తవాన్ని తెలుసుకుంటారు.
నా ద్వారా వెళ్లడం మంచిది. ఎందుకంటే మీరు కనుగొనగల అతికొద్ది శూన్యాలలో ఇది ఒకటి. తక్కిన చోట్లల్లా, అది పారదర్శకత లేకుండా - పూర్తిగా జ్ఞానంతో, గ్రంథాలతో, ఇంకా నిర్ధారణలతో నిండిపోయి ఉంది. ద్వారం అనేది ఖాళీగా ఉండాలి. మీరు దాని గుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వెళ్ళగలిగితేనే, అది ఉపయోగం. కాబట్టి ద్వారంలో ఏదో కనుగొనే ప్రయత్నం చేయకండి. మీరు ద్వారంలో ఏదైనా కనుగొంటే, అది మూసుకుపోయిన ద్వారం అని అర్థం.
నేను గమ్యస్థానం కాదు. తెరచి ఉన్న ద్వారాన్ని- మనం దేనినైతే ఆదియోగి అంటామో దానికి ఒక ద్వారాన్ని. అతనికి తెలిసిన అంతటికీ, ఇంకా అతను అయి ఉన్న సంభావ్యతలు అన్నింటికీ ఒక ద్వారాన్ని. కాపలా దారుడు లేనటువంటి ఒక ద్వారాన్ని. మీరు దాని గుండా వెళ్ళటానికి సుముఖంగా ఉంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.
Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower July 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.